Thursday, January 23, 2025

హంతకుడిని పట్టుకున్న పోలీసులకు రివార్డులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్: మహిళను హత్య చేసి గన్నీబ్యాగులో తీసుకుని వెళ్తున్న వ్యక్తిని పట్టుకున్న షాద్‌నగర్ పెట్రోలింగ్ పోలీసులకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అభినందించారు. ఈ మేరకు వారిని కమిషనరేట్‌కు పిలిపించి సోమవారం రివార్డులు అందించారు. మే, 2వతేదీ రాత్రి 12.30 గంటల సమయంలో షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ పెట్రోలింగ్ కార్ 1 ఇన్‌ఛార్జ్ కానిస్టేబుల్ రఫీ, భూపాల్ రెడ్డి, ఎస్‌పిఓ గోవర్ధన్(డ్రైవర్) శివారులోని చటాన్‌పల్లి రోడ్డు పరిసరాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలోనే ఓ వ్యక్తి గన్నీ బ్యాగును తలపై పెట్టుకుని వెళ్తున్నాడు. అనుమానస్పదంగా కన్పించడంతో పోలీసులు ఆపి ప్రశ్నించడంతో పొంతనలేని సమాధానాలు చెప్పాడు. వెంటనే సంచిని కిందికి దింపి తనిఖీ చేయగా మహిళ మృతదేహం ఉంది. వెంటనే అదుపులోకి తీసుకుని విచారించగా హత్య విషయం బయటపడింది.

షాద్‌నగర్,పటేల్ నగర్‌కు చెందిన రాములు 15 ఏళ్ల క్రితం శారదను వివాహం చేసుకోగా వారికి 13 ఏళ్ల కూతురు ఉంది. మళ్లీ సంతానం కలగపోవడంతో తనతోపాటు కూలీ పనిచేస్తున్న పురుషోత్తం నెల వయస్సు ఉన్న కుమారుడిని రూ.1.50లక్షలు ఇచ్చి బాలుడిని దత్తత తీసుకున్నాడు. రెండు నెలల తర్వాత బాలుడి తల్లి దేవకీ తన కుమారుడిని తనకు ఇవ్వాలని రాములు ఇంటికి వచ్చిగొడవ చేసింది. ఆ సమయంలో దేవకీకి సర్ధిచెప్పి పంపించారు. కాగా సోమవారం రాత్రి మళ్లీ వచ్చి గొడవ చేసింది, ఎంత చెప్పినా వినకపోవడంతో ఆగ్రహంతో రాములు చీరతో ఉరివేసి చంపివేశాడు. తర్వాత మృతదేహాన్ని గన్నీబ్యాగులో పెట్టుకుని శివారులో పడేసేందుకు అర్ధరాత్రి వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. సమయానికి స్పందించి నిందితుడిని పట్టుకున్న పోలీసులకు సిపి స్టిఫెన్ రవీంద్ర రివార్డు అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News