Sunday, December 22, 2024

సిఐఎస్‌ఎఫ్ అధీనంలో కెజి కర్ ఆస్పత్రి

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: ఆర్‌జి కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో సిఐఎస్‌ఎఫ్ మోహరింపునకు సుప్రీం కోర్టు ఆదేశించిన మరునాడు కేంద్ర పారా మిలిటరీ దళ బృందం ఒకటి బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వైద్య కళాశాల, ఆసుపత్రిని సందర్శించి, భద్రత ఏర్పాట్లను తనిఖీ చేసింది. ఒక సీనియర్ అధికారి నేతృత్వం లో కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సిఐఎస్‌ఎఫ్) బృందం బుధవారం ఉదయం ఆసుపత్రికి చేరుకున్నది. భద్రత ఏర్పాట్ల గురించి వారు స్థానిక పోలీసులతోను, ఆసుపత్రి అధికారులతోను మాట్లాడినట్లు అధికారి ఒకరు తెలిపారు. హత్యాచారానికి గురైనట్లుగా భావిస్తున్న ఒక పోస్ట్‌గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ మృతదేహం ఈ నెల 9న కర్ వైద్య కళాశాల, ఆసుపత్రి సెమినార్ రూమ్‌లో కనిపించడం దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు దారి తీసింది.

ఈ కేసు సందర్భంగా ఒక సివిక్ వాలంటీర్‌ను ఆ మరునాడు అరెస్టు చేశారు. ఒక గుంపు 15న తెల్లవారు జామున కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలోకి ప్రవేశించి మర్జన్సీ విభాగం, నర్సింగ్ కేంద్రం, మందుల స్టోర్‌లలో విధ్వంసకాండకు పాల్పడడమే కాకుండా సిసిటివి కెమెరాలను నాశనం చేశారు. ‘సదరు కిరాతక కృత్యం, ఆ దరిమిలా ప్రదర్శనల నేపథ్యంలో శాంతి భద్రతల ఉల్లంఘనను నివారించేందుకు రాష్ట్ర భద్రత బలగాలను రాష్ట్ర ప్రభుత్వం మోహరించవలసి ఉంది. ఆసుపత్రి ఆవరణలో జరిగిన నేరంపై దర్యాప్తు సాగుతున్నందున ప్రభుత్వం ఆ పని చేయవలసిన అగత్యం మరింతగా ఉంది. ఆసుపత్రి ఆవరణలో విధ్వంసకాండ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సంసిద్ధంగా లేదో మాకు అర్థం కావడం లేదు’ అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ఆతరువాత ఆసుపత్రిలో భద్రత బాధ్యతను సిఐఎస్‌ఎఫ్‌కు అప్పగించింది.

ముగ్గురు పోలీస్ అధికారుల సస్పెన్షన్
ఇది ఇలా ఉండగా, ఆర్‌జి కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో క్రితం వారం విధ్వంసకాండ సందర్భంగా తమ అధికారులు ముగ్గురిని కోల్‌కతా పోలీస్ శాఖ సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. సస్పెండైన పోలీస్ సిబ్బందిలో ఇద్దరు అసిస్టెంట్ కమిషనర్లు కూడా ఉన్నారని వారు తెలిపారు. జన సమూహంఈ నెల 15 తెల్లవారు జామున ఆసుపత్రి ఆవరణలోకి ప్రవేశించి, ఎమర్జన్సీ విభాగం, నర్సింగ్ కేంద్రం, మందుల స్టోర్‌లను ధ్వంసం చేసిన విషయం విదితమే. ఆ సంఘటనపై దర్యాప్తు సాగుతోంది.

మాజీ ప్రిన్సిపాల్‌కు పాలీగ్రాఫ్ పరీక్ష?
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ వైద్య కళాశాల, ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు సిబిఐ నిజ నిర్ధారణ పరీక్ష నిర్వహించవచ్చు. హత్యాచారానికి గురైన ట్రైనీ మహిళా డాక్టర్ మృతదేహం ఆసుపత్రి సెమినార్ హాల్‌లో కనిపించిన రెండు రోజుల తరువాత రాజీనామా చేసిన సందీప్ ఘోష్ ఇప్పటికే పలు మార్లు దర్యాప్తు నిమిత్తం సిబిఐ అధికారుల ముందు హాజరయ్యారు. ‘మా ప్రశ్నలకు హోష్ ఇచ్చిన సమాధానాలు కొన్నిటిలో వ్యత్యాసాలు ఉన్నందున ఆయన సమాధానాలను మరింతగా నిర్ధారించుకోవాలని అనుకుంటు న్నాం. అందువల్ల ఆయనకు నిజ నిర్ధారణ పరీక్ష నిర్వహణ గురించి ఆలోచిస్తున్నాం’ అని అధికారి ఒకరు ‘పిటిఐ’తో చెప్పారు.

పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీపై హత్యాచారంపై దర్యాప్తులో భాగంగా ఘోష్‌ను మంగళవారం కూడా దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. సిబిఐ అధికారులు గత కొన్ని రోజుల్లో ఘోష్‌కు రకరకాల ప్రశ్నలు వేశారు. డాక్టర్ మృతి వార్త వచ్చి న తరువాత ఆయన ఎలా వ్యవహరించారు, ఆ తరువాత ఎవరిని సంప్రదించారు, ఆమె మృతదేహాన్ని చూసేందుకు సుమారు మూడు గంటలకు పైగా ఆమె తల్లిదండ్రులను ఎందుకు నిరీక్షింపచేశారు అని కూడా సిబిఐ అధికారులు ప్రశ్నించారు. ఆమె మృతదేహం కనిపించిన తరువాత ఆర్‌జి కర్ ఆసుపత్రి సెమినార్ హాల్ పక్క గదుల్లో మార్పులకు అధికారం ఇవ్వడంపై కూడా ఆయనను ప్రశ్నించారు. ఈ కేసులో ప్రమేయానికి గాన అరెస్టయిన సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్‌పై నిజ నిర్ధారణ పరీక్షకు సిబిఐ అంతకు ముందు ఒక స్థానిక కోర్టు నుంచి అనుమతి సంపాదించింది.

మాజీ ప్రిన్సిపాల్‌పై ఇడి దర్యాప్తు: హైకోర్టులో పిటిషన్
ఆర్‌జి కర్ వైద్య కళాశాల, ఆసుపత్రి అధిపతిగా తన హ యాంలో మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణకు సంబంధించి ఆయనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి)తో దర్యాప్తు జరిపించాలని కోరు తూ ఆసుపత్రి మాజీ డిప్యూటీ సూపరింటెండెం ట్ ఒకరు కలకత్తా హైకోర్టును బుధవారం ఆశ్రయించారు. ఘోష్‌పై గల ఆర్థిక అవకతవకల ఆరోపణపై దర్యాప్తునకు ఇడిని ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలుకు మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీకి జస్టిస్ రాజర్షి భరద్వాజ్ ఆనుమతి ఇచ్చారు. తాను 2023లో ఘోష్‌పై పశ్చిమబెంగాల్ ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు అలీ అంతకుముందు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News