Saturday, September 14, 2024

పని చేసే చోట డాక్టర్లకే భద్రత లేకపోతే ఎలా?

- Advertisement -
- Advertisement -

హత్యాచారం జరిగే వరకు దేశం ఎదురుచూడాలా?
వ్యవస్థాపరమైన లోపాల వల్లే వైద్య సిబ్బందిపై హింస
భద్రతా నిబంధనల కోసం 10 మంది సభ్యుల టాస్క్‌ఫోర్సు ఏర్పాటు చేయాలి
డాక్టర్ హత్యాచార ఘటనను సుమోటోగా సుప్రీం విచారణ

న్యూఢిల్లీ: ఆసుపత్రులలో డాక్టర్లకు భద్రత లేకపోవడం పట్ల సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. క్షేత్ర స్థాయిలో వాస్తవ మార్పుల కోసం ఒక అత్యాచారమో లేక హత్యో జరగడం కోసం దేశం వచేచి చూడలేదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జి కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో సంభవించిన ఒక పోస్టు గ్రాడ్యుయేట్ ట్రెయినీ డాక్టర్ హత్యాచార ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. దేశవ్యాప్తంగా ఆసుపత్రులలో పనిచేసే డాక్టర్ల భద్రతకు సంబంధించి వ్యవస్ఠాపరంగా ఎదువుతున్న సమస్యలను ఈ ఘటన లేవనెత్తిందని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వైద్య సంఘాలు పదే పదే ప్రస్తావిస్తున్నప్పటికీ వైద్యులు తమ విధి నిర్వహణలో అనేక రూపాలలో హింసను ఎదుర్కొంటున్నారని ధర్మాసనం తెలిపింది.

ఇతరులకు వైద్యసేవలను అందచేసే డాక్టర్లకు భద్రత కల్పించడంలో ఎటువంటి రాజీ ఉండకూడదని రాజ్యాంగంలోని అందరికీ సమాన హక్కులు అన్న సూత్రం స్పష్టం చేస్తోందని ధర్మాసనం పేర్కొంది. ఆసుపత్రులు, ఇతర వైద్య సంస్థలు అన్నివేళలా పనిచేస్తుంటాయని, ఎవరైనా, ఎక్కడికైనా ప్రవేశించడంపై ఎటువంటి ఆంక్షలు లేకపోవడంతో ఆరోగ్య సేవకులు సులభంగా హింసకు గురవుతున్నారని ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రతికూల ఫలితాలు ఎదురైతే రోగుల బంధువులు డాక్టర్ల నిర్లక్షమంటూ నింద వేసేస్తుంటారని, ఈ ఆరోపణల పర్యవసానం డాక్టర్లపై దాడిగా మారుతోందని ధర్మాసనం పేర్కొంది.

వైద్యులపై దాడులకు సంబంధించి అనేక సంఘటనలను ధర్మాసనం ప్రస్తావిస్తూ ఆసుపత్రులలో విధులను నిర్వహించే డాక్టర్లు, నర్సులు, అనుబంధ వైద్య సిబ్బందికి భద్రతను కల్పించడంలో స్వవస్థీకృత వైఫల్యాలు ఉన్నాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భద్రత కోసం ఎటువంటి వ్యవస్థ లేకపోవడంతో డాక్టర్లు హింసకు సులభంగా లక్షంగా మారుతున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవకుల భద్రతకు సంబంధించిన వ్యవస్థీకృత లోపాలు ఉన్న కారణంగానే తాము ఈ విషయంలో జోక్యం చేసుకోవలసి వస్తోందని ధర్మాసనం తెలిపింది. ఈ వ్యవస్థలో ముఖ్యంగా మహిళలు లైంగిక, లైంగికేతర హింసకు గురవుతున్నారని ధరోమాసనం తెలిపింది. స్వతహాగా పురుషాధిక్యత ధోరణులు, వివక్ష కారణంగా మహిళా డాక్టర్లే రోగుల బంధువుల నుంచే దాడులను ఎదుర్కుంటున్నారని కోర్టు పేర్కొంది. వీటితోపాటు మహిళా డాక్టర్లకు తమ సీనియర్లు, సహోద్యాగులు, పై అధికారుల నుంచి లైంగిక హింసను వేర్వేరు రూపాలలో ఎదుర్కోవలసి వస్తోందని కోర్టు తెలిపింది.

వైద్య కళాశాలల్లో కూడాహైరార్కీ ఉంటుందని, కింది స్థానాలలో ఉన్న వారు పైస్థాయిలోని వారి చేతుల్లో హింసకు గురవుతుంటారని కోర్టు తెలిపింది. వైద్య సంస్థలలో వ్యవస్థాపరమైన భద్రతా విధానాలు లేని కారణంగా డాక్టర్లు లైంగిక హింసకు గురికావడం తీవ్రంగా ఆందోళన కలిగించే అంశమని కోర్టు తెలిపింది. డాక్టర్లకు, ఇతర వైద్య సిబ్బందికి, ఆసుపత్రులకు భద్రత కల్పిస్తూ అనేక రాష్ట్రాలు చట్టాలు చేశాయని, అయితే చట్టాలతో వ్యవస్థాపరమైన సమస్యలకు పరిష్కారం లభించడం లేదని కోర్టు పేర్కొంది. వ్యవస్థాపరమైన భద్రతా ప్రమాణాలను మెరుగుపరచకుండా శిక్షలను మరింత కఠినం చేయడం వల్ల సమస్య సమర్థవంతంగా పరిష్కారం కాలేదని కోర్టు పేర్కొంది. వ్యవస్థాపరమైన అంశాలను పరిష్కరించేందుకు సంబంధిత వ్యక్తులందరినీ చరర్చించి ఒక జాతీయ ఏకాభిప్రాయాన్ని సాధించే దిశగా నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం 10 మంది సభ్యులతో జాతీయ టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేయాల్సిన తక్షనావసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News