Sunday, January 19, 2025

నేను తప్పు చేయలేదు… ఆ టెస్టుతో నిజాలు బయటకు వస్తాయి: కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచార ఘటనలో నిందితుడు

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో నిందితుడు సంజయ్‌రాయ్‌ను కోర్టులో సిబిఐ అధికారులు హాజరుపరిచారు. పాలీగ్రాఫ్ పరీక్షలకు నిందితుడు సమ్మతించడంతో కోర్టు అధికారులకు అనుమతి ఇచ్చింది. నిందితుడు సంజయ్‌రాయ్ న్యాయస్థానంలో నోరువిప్పాడు. భావోద్వేగంతో మాట్లాడాడు. తనని కావాలని ఈ కేసులో ఇరికించారని కన్నీళ్లు పెట్టుకున్నారని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. పాలీగ్రాఫ్ ఎందుకు అంగీకరించావని జడ్జి ప్రశ్నించడంతో అతడు కన్నీంటి పర్యంతమయ్యాడు. తాను అమాయకుడిని సర్, తప్పు చేయలేదని, తనని ఈ కేసులో ఇరికించారని స్పష్టం చేశారు. పాలీగ్రాఫ్ పరీక్షతో అసలు నిజాలు బయటకు వస్తాయని భావోద్వేగానికి గురయ్యారు. అతడితో మరో ఏడుగురికి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. లై డిటెక్టర్ పరీక్షకు సిబిఐ అధికారులు సన్నద్ధమవుతున్నారు.

సంజయ్‌రాయ్ కోర్టులో మాట్లాడిన విధానం చూస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సిబిఐ విచారణలో మాత్రం సంజయ్ నేరం అంగీకరించినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. సంజయ్ మానసిక స్థితిని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరికి చెందిన వైద్యబృందం పరీక్షించింది. వైద్యురాలు హత్యాచారానికి సంబంధించిన ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్టుగా సిబిఐ అధికారులకు వివరించాడు. నిందితుడు చెబుతున్నప్పుడు అతడి ముఖంలో పశ్చాత్తాపమే కనిపించలేదని సిబిఐ అధికారులు చెప్పిన విషయం తెలిసిందే. వైద్య విద్యార్థిపై హత్యాచారం జరిగిన రోజు అర్థరాత్రి సమయంలో ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ నుంచి నిందితుడు వెళ్తున్న దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డయ్యాయి. వాటిని తాజాగా దర్యాప్తు అధికారులు విడుదల చేశారు. నిందుతుడి మెడ చుట్టూ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ కూడా కనిపించాయి. వైద్యురాలి మృతదేహం వద్ద ఉన్న బ్లూటూత్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిసి కెమెరాల దృశ్యాల ఆధారంగానే సంజయ్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News