Sunday, January 19, 2025

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు: సంజయ్ రాయ్‌ను దోషిగా తేల్చిన సీల్డా కోర్టు

- Advertisement -
- Advertisement -

యావత్ దేశాన్ని కలచివేసిన కోల్‌కతా ట్రైనీ వైద్యురాలు హత్యాచార ఘటన కేసులో స్థానిక సీల్డా న్యాయస్థానం శనివారం తీర్పు వెలువరించింది. నిందితుడు సంజయ్ రాయ్‌ను న్యాయస్థానం దోషిగా నిర్థారించింది. ఆర్‌జి కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై దారుణమైన అత్యాచారం, హత్య కేసులో భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్)లోని సెక్షన్ల కింద సీల్డాలోని అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు రాయ్‌ను దోషిగా తేల్చింది. ఇక విచారణ సమయంలో నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నప్పటికీ, ఆ తరువాత తనను ఇరికించారని వాదించిన విషయం విదితమే. కాగా, నిందితులను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాక్షాలను ధ్వంసం చేయజూసిందన్న ఆరోపణల నేపథ్యంలో కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఈ కేసును దర్యాప్తు చేసింది. కాగా, శనివారం తీర్పు నేపథ్యంలో గట్టి భద్రత మధ్య రద్దీగా ఉండే కోర్టు గదికి నిందితుడు సంజయ్ రాయ్‌ను తీసుకువచ్చారు.

కోల్‌కతా ఆర్‌జి కర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ నిరుడు ఆగస్టు 9న దారుణ అత్యాచారం, హత్యకు గురైంది. ఈ అఘాయిత్యంపై సిబిఐ దర్యాప్తు జరిపి అక్టోబర్ 7న చార్జిషీట్ దాఖలు చేసింది. విచారణ అనంతరం శనివారం నిందితుని దోషిగా తేల్చిన జడ్జి అనిర్బన్ దాస్ సోమవారం శిక్షను ఖరారు చేయనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు రాయ్ వాఙ్మూలం వింటామని, ఆ తరువాత శిక్ష ప్రకటిస్తామని న్యాయమూర్తి దాస్ తెలియజేశారు. నిరుడు నవంబర్‌లో రహస్య విచారణ మొదలైన సుమారు రెండు నెలల తరువాత తీర్పు వెలువడింది. తీర్పు ప్రకటిస్తున్న సమయంలో తనను ఇరికించారని రాయ్ కోర్టులో పేర్కొన్నాడు. ‘నేను రుద్రాక్ష మాల ధరిస్తాను. నేనే నేరంచేసి ఉన్నట్లయితే ఆ మాల తెగి ఉండేదే’ అని రాయ్ సమర్థనగా అన్నాడు. కాగా, శనివారం తీర్పు వెలువడిన వెంటనే హతురాలి తండ్రి ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. న్యాయమూర్తిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానిస్తూ, ‘న్యాయవ్యవస్థపై మేము పెట్టుకున్న నమ్మకాన్ని మీరు నిలబెట్టారు’ అంటూ తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News