మన తెలంగాణ/మిర్యాలగూడ: వృత్తి రైస్ మిల్ డ్రైవర్.. ప్రవృత్తి దొంగతనాలు.. వరుస దొంగతనాలతో పోలీసులకే సవాల్ విసిరిన 26 ఏళ్ల వయసులోనే పలు దొంగతనాలు, 11 కేసులలో 23 లక్షల చోరీ సొత్తుతో మిర్యాలగూడ పోలీసులకు దొరికిన దొంగను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు జిల్లా ఎస్పీ అపూర్వరావు మంగళవారం ఒకటవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు, స్థానిక ఈదులగూడ చౌరస్తాలో మంగళవారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, పల్సర్ బైక్‌పై అనుమానాస్పదంగా కనిపించిన 26 ఏళ్ల యువకుడు పోలీసులను చూసి పరారయ్యేందుకు ప్రయత్నించగా, పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
Also Read: హుక్కా పార్లర్‌పై పోలీసులు దాడి
నల్లగొండ జిల్లా చందంపేట మండలం కంబాపల్లి గ్రామానికి చెందిన బత్తుల సాయికిరణ్ అలియాస్ సాయి మిల్లు డ్రైవర్‌గా పనిచేసేవాడని, ప్రస్తుతం పట్టణంలో ప్రకాష్ నగర్‌లో రతన్ సింగ్ కిరాణం కొట్టు పక్కన నివాసం ఉంటున్నట్లు తెలిపారు. రైస్ మిల్లు డ్రైవర్‌గా పనిచేస్తే వచ్చే జీతం చాలదని, అతడు తాళాలు వేసిన ఇళ్లని టార్గెట్ చేసుకొని రాత్రివేళల్లో తాళాలు పగలగొట్టి, చోరీలకు పాల్పడుతున్నాడు. అతనిపై 2021లో చిలకలు పోలీస్‌స్టేషన్‌లో లిక్కర్, రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో గేమింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు అయినట్లు తెలిపారు. ఆ నేరాలతోపాటు అతనిపై పట్టణంలోని ఒకటవ టౌన్‌లో 5, రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో 6 కేసులు ఉన్నాయని నేరం అంగీకరించారన్నారు. అతని వద్ద నుండి 33.5 తులాల బంగారం, రెండు కిలోల వెండి, ఒక పల్సర్ బైక్, ఇనుపరాడ్డును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. మిర్యాలగూడ డిఎస్‌పి వెంకటగిరి ఆధ్వర్యంలో కేసును త్వరగా ఛేధించిన ఒకటవ పట్టణ సిఐ రాఘవేందర్, ఎస్సైలు శ్రీను నాయక్, కృష్ణయ్య, హెడ్ కానిస్టేబుల్, వెంకటేశ్వర్లుతో పాటు సిబ్బందిని ఆమె అభినందించారు.