Sunday, December 22, 2024

దుఃఖ వికసిత భారత్‌కు దారి…

- Advertisement -
- Advertisement -

బ్రిటిష్ వారు పరిపాలన చేసిన కాలం కంటే, ఇప్పుడు మన దేశంలో ధనవంతులకు, పేదలకు మధ్య అంతరం అనేక రెట్లు అధికంగా ఉంది. ఆదాయం, సంపద పంపిణీ మన సమాజంలో ఎంతో అస మానత్వంతో కూడుకొని ఉంది. ఇప్పటికే దేశంలో వున్న కోటీశ్వరు లకు తోడు, 2023 నాటికి మరో 94 మంది కొత్తగా బిలియనీర్లు జత అయ్యారని ‘హురన్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్’ తెలిపింది. 2024 ప్రపంచంలోని అత్యంత ధనికుల జాబితా ప్రకారం చూసినా, ఒక్క అమెరికా మినహాయిస్తే, మరి ఏ ఇతర దేశంలోనూ జరగని విధంగా, భారతదేశంలో ఒక్క ఏడాది కాలంలోనే ఇంత ఎక్కువ మంది బిలియనీర్ల జాబితాలోకి చేరడం జరిగింది.

బుద్ధుడు జన్మించిన లుంబిని నుండి, అతడు నిర్వాణం చెందిన కుశినార లేదా కుశినగర్‌కి మధ్య ఉన్న దూరం మరీ ఎక్కువ ఏం కాదు. కానీ వందల ఏళ్ల క్రితం బుద్ధుడు చేసిన ఈ మహత్తర ప్రయాణంలో, ఆయన ప్రతిపాదించిన జ్ఞానం, విలువలు భారతీయ సమాజానికి ఇంకా సుదూర లక్ష్యాలు గానే ఉన్నాయి. 29 ఏళ్ల వయసులో హృదయం వుండాల్సిన చోట వున్న యువరాజు సిద్ధార్ధుడు, ఒక వృద్ధుడిని, రోగ పీడితుడిని, కుళ్ళిపోతున్న శవాన్ని, సన్యాసిని చూసిన తర్వాత, రాజ్యాన్ని త్యజించాడు అని చెబుతారు. మనిషి దుఃఖ కారణాలు, వాటి నివారణ మార్గాలను అన్వేషిస్తూ బయలుదేరిన అతడు చివరకు బుద్ధుడై, బిక్షుకుడై, లోకమంతా తిరుగుతూ, బోధిస్తూ తన 80వ ఏట మరణించాడు. ఆయన పుట్టింది, మరణించింది ఒకప్పటి పురాతన భారతదేశమే. మనిషి దుఃఖానికి హేతువేమిటి?అది పోయే మార్గం ఏమిటి అనే ప్రశ్న ఈ లోకంలో ఎల్లప్పుడూ ఉన్నప్పటికీ, దాన్ని పట్టించుకునే వాళ్ళు తక్కువే. ఈ అన్వేషణ వ్యక్తులుగా, ఎవరైనా, ఎక్కడైనా చేస్తూ ఉండొచ్చు.
కానీ, బుద్ధుడు పుట్టిన ఈ దేశంలో అధికారంలో వుంటూ ప్రజలను పరిపాలించే ప్రభుత్వాలకి, ఎన్నికల సమయం లో ఊరూరూ తిరిగే, ఓటమి పాలయ్యాక పాదయాత్రలు చేసే రాజకీయ నాయకులకు మన దేశంలో మెజారిటీ ప్రజలు ఎదుర్కొంటున్న పేదరికం, కుల, జెండర్, మతపర వివక్ష పట్టాలి కదా. కానీ ఇవి వారికి ఎన్నడూ, పెద్దగా పట్టలేదు. నిజానికి వాళ్ళ దృష్టిలో భారత దేశం జ్వలామాయంగా వెలిగిపోతోంది ఇప్పుడు. మొన్నటికి మొన్న, అత్యంత కుబేరుడు అంబానీ కొడుకు పెళ్లి వేడుకలను వైన, వైన కథనాలుగా ప్రసార మాధ్యమాలు చూపినప్పుడు, మిరుమిట్లు గొలిపిన ఆ వెలుగులు, దేశంలోని చీకటి కోణాలపైకి ఎంత వద్దనుకున్నా ప్రసరించినప్పుడు, ఎలాంటి వ్యత్యాసాల మధ్య, ఎంతటి కటిక చీకట్ల మధ్య ఈ దేశ ప్రజలు బతుకుతున్నారో, అన్ని రకాల రంగాలలోనూ అసమానతలు ఎంత ఎక్కువగా ఈ దేశంలో వున్నాయో చాలా మందికి అర్ధం అయింది.

దేశం వెలిగిపోతూ, దూసుకుపోతూ వుందని మనకి ఎప్పుడూ చెబుతూ వుండే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఎర్రకోట సాక్షిగా, భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరుస్తామని, అంటూ ‘వికసిత్ భారత్ 2047’ ప్రకటించినప్పుడు, ఆ వెలుగుల వైపు చాలా మంది, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అభిమానులు ఆరాధనగానే చూశారు. ఎకనామిక్స్‌ను అంటే, అర్థ శాస్త్రాన్ని ‘మోడీ నో మిక్స్’ గా పిలిచే అంతగా వారు పరవశించారు. సంపదలెల్ల పోగుపడిన వెలుగు ధగధగలకి అధిపతులు జనాభాలో కేవలం 10 శాతంగా ఉన్న జనాభానే. వాళ్ళ చేతుల్లో 77% జాతీయ సంపద పోగుపడి ఉంది. మళ్లీ వీళ్ళలోనూ ఒక శాతం జనాభా చేతుల్లోనే 57% జాతీయాదాయం ఉంది. 1947 స్వాతంత్య్రానంతరం, దేశంలో కోటీశ్వరులు ఉన్నప్పటికీ, ఆనాడు అవలంబించిన, మిశ్రమ ఆర్థిక విధానాలు, కీలకమైన రంగాలు అన్నింటా కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటు, భూసంస్కరణలు, ఇలాంటి అనేక చర్యల ఫలితంగా వీరి సంపదలు, గత రెండు, మూడు దశాబ్దాలలో పెరిగినంత వేగంగా మాత్రం పెరగలేదు.

1980 నాటి నుండే ప్రభుత్వాలు ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టడానికి ప్రయత్నించినప్పటికీ, 1990ల నాటికల్లా, నూతన ఆర్థిక విధానాలు, లిబరలైజేషన్, గ్లోబల్ మార్కెట్ రంగ ప్రవేశం, బహుళజాతి కంపెనీల పెట్టుబడులకు గేట్లు బార్లా తెరవడం, ప్రభుత్వ సంస్థల అమ్మకాలు, విమానాశ్రయాలు, గనులు, పోర్టులు, ప్రాజెక్టులు ఒకటనేది ఏమిటి, సకల రంగాలను ప్రైవేటు వారికి కట్టబెట్టడం వంటి అనేక విధానాలు ముందుకొచ్చాయి. మొదటి నుండీ సంపదలు కొద్దిమంది చేతిలో కేంద్రీకృతం కావడం మనకి కొత్త కాకపోయినప్పటికీ, స్వాతంత్య్రం నాటికి, ఇప్పటికీ మధ్య చాలా తేడా వుంది. 1947 ప్రాంతాలలో 1.3 శాతంగా, 1982 నాటికి 6.1.శాతంగా వున్న ఈ పెరుగుదల, నూతన ఆర్థిక విధానాల తర్వాత, ఎన్నో రెట్లు స్వల్ప కాలంలోనే ఎంతో వేగంగా పెరిగి, 2022 నాటి కల్లా 22.6%గా నమోదు అయింది.

బ్రిటిష్ వారు పరిపాలన చేసిన కాలం కంటే, ఇప్పుడు మన దేశంలో ధనవంతులకు, పేదలకు మధ్య అంతరం అనేక రెట్లు అధికంగా ఉంది. ఆదాయం, సంపద పంపిణీ మన సమాజంలో ఎంతో అసమానత్వంతో కూడుకొని ఉంది. ఇప్పటికే దేశంలో వున్న కోటీశ్వరులకు తోడు, 2023 నాటికి మరో 94 మంది కొత్తగా బిలి యనీర్లు జత అయ్యారని ‘హురన్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్’ తెలిపింది. 2024 ప్రపంచంలోని అత్యంత ధనికుల జాబితా ప్రకారం చూసినా, ఒక్క అమెరికా మినహాయిస్తే, మరి ఏ ఇతర దేశంలోనూ జరగని విధంగా, భారతదేశంలో ఒక్క ఏడాది కాలంలోనే ఇంత ఎక్కువ మంది బిలియనీర్ల జాబితాలోకి చేరడం జరిగింది. భారత దేశానికి సంబంధించిన అతి పెద్ద పారిశ్రామికవేత్తలు, కోటీశ్వరులు అయిన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, సజ్జన్ జిందాల్ వంటి వారు జఫ్ బెజోస్, ఎలాన్ మస్క్ స్థాయి ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు సంపాదించుకుంటూ ఉన్నారు.

నిజానికి మన దేశంలో పన్నుల భారం కూడా పేదవారిపైనే అత్యధికంగా ఉంది. సుమారు 64% గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జిఎస్‌టి) ని 50% మంది జనాభా చెల్లిస్తూ వున్నారు. ఇక సంపద అంతా చేతుల్లో ఉన్నటువంటి ఆ పది శాతం మంది, కేవలం నాలుగు శాతం జిఎస్‌టిని మాత్రమే చెల్లిస్తున్నారు. అంతేకాదు, బ్యాంకుల నుండి వేల కోట్ల రూపాయల రుణాలను తీసుకొని, పన్నులు ఎగవేసేది, దేశం విడిచిపోయేది వీరే. మన దేశం లో 63 మిలియన్ల మంది జనాభా పేదరికం కారణంగా వైద్యం కోసం తమ ఆదాయంలో అత్యధిక భాగం ఖర్చు చేయడం వల్ల పేదరికంలోకి ప్రతి సంవత్సరం నెట్టబడుతున్నారు. ‘స్టేట్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ – 2023’ నివేదిక ప్రకారం, 74% మంది భారత జనాభా ఆరోగ్యకరమైన, కడుపునిండా ఆహారాన్ని పొందలేకపోతూ ఉంది. భారతదేశంలో భూమిపైన ఆధారపడి బతికే జనాభా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అయితే ఈ జనాభాలో చాలా మందికి భూమి లేదు.

గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్న వాళ్లు పేదరికంలో మగ్గడమే కాకుండా, కొన్ని తరాలపాటు ఆర్థిక అసమాతల మధ్యనే జీవించాల్సి వస్తుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు, అలాగే వివిధ రాష్ట్రాలకు, ఒకే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు మధ్య ఆర్థికపరమైన అసమానత్వం చాలా పెద్ద ఎత్తున, వేగవంతంగా పెరిగింది. నిజానికి మన దేశంలో ఆర్థిక అంతరాలపై జరిగినంత చర్చ, సామాజిక వ్యవస్థకు సంబంధించిన అంతరాలపై జరగాల్సిన జరగలేదు. వ్యవస్థలోని అంతరాలను మనం లెక్కించేటప్పుడు ఆదాయం, ఆరోగ్యం, విద్య, కులం, మతం, జెండర్ ఇంకా ఆస్తిపాస్తులు ఇలా అనేక విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ, అంతరాలు, కుల వ్యవస్థతో ఎలా ముడిపడి వున్నాయో అర్థం చేసుకునేందుకు మరింత లోతైన విశ్లేషణ జరగాలి. జెండర్ అసమానతలున్న 146 ప్రపంచ దేశాల్లో 127వ స్థానంలో భారతదేశం ఉందని ‘గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2023’ చెప్తూ ఉంది. దీన్ని బట్టి స్త్రీల స్థితి ఏమిటో తెలుసుకోవచ్చు.

కోట్లాది మంది భారతీయ ప్రజలు ప్రభుత్వం ఇస్తున్న మినిమం గ్యారంటీ వేజ్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాంలో భాగంగా 100 రోజుల పని మీద ఆధారపడి, రోజుకి నాలుగు డాలర్లు సంపాదిస్తూ, ఆ వేతనంపైనే కుటుంబం అంతా బతకాల్సిన స్థితిలో జీవిస్తునారు. పబ్లిక్ పాలసీ, సంక్షేమ పథకాలు అన్నీ కూడా అనేక మార్పులకు గురికావడనే కాకుండా, కుదించబడుతూ ఉన్నాయి. ప్రభుత్వం ప్రజా సంక్షేమాలపైన, ఆరోగ్యం, విద్య, పౌష్టికాహారం వంటి అంశాల పైన పెట్టే ఖర్చును తగ్గించి వేసింది. ఆర్థిక అంతరాలు గతం నుండీ ఉన్నా, ఇప్పటికీ ఈ అతి పెద్ద అంతరం అనేది 2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాతే శరవేగంగా, విస్తృత స్థాయిలో జరిగింది. ప్రభుత్వాలు ఆర్థిక, రాజకీయపరమైన నిర్ణయాల్ని తీసుకునేటప్పుడు, అతి ధనవంతులైన కొద్ది మంది బృందాలకు ఎక్కువ అనుకూలంగా చేయడం వల్ల, అంతేకాకుండా ఈ అతి పెద్ద వాణిజ్యవేత్తలతో, బృందాలతో ప్రభుత్వం ప్రత్యక్ష సంబంధాలను నెరపడం ద్వారా తక్కువ కాలంలోనే సంపద కేంద్రీకరణ కొద్ది మంది చేతుల్లోకి వెళ్లడం జరిగిందని, సమాజంలో వ్యత్యాసాలు తీవ్రం అయ్యాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

కనీస జీవన ప్రమాణపు రేఖలకు దిగువని జీవించే ప్రజల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. దేశంలో నిరుద్యోగం, అంతర్గత వలసలు, పేదరికం, కుల, మతపర హింస పెరుగుతున్నాయి. 2000 సంవత్సరంలో 54.2 శాతంగా ఉన్న చదువుకున్న నిరుద్యోగుల సంఖ్య 2022 నాటికి 65.7% పెరిగింది అని ఐఎల్‌ఒ చెప్పింది. 2014 నుండి శ్రామికుల నిజవేతనాలలో పెంపుదల లేదని ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త జాన్ డ్రీజ్ పేర్కొన్నాడు. ఇండియా ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద గ్లోబల్ ఎకానమీ కావచ్చు కానీ వ్యక్తుల పరంగా తీసుకున్నప్పుడు ఆర్థిక అభివృద్ధి స్థానంలోని సూచీలో 140వ ర్యాంకులో ఉంది. సంపద వికేంద్రీకరణ మన వద్ద జరగలేదు.

2047 నాటికల్లా భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా, ఆర్థికంగా ఎదిగిన దేశంగా చేస్తానని మోడీ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అది సాధ్యమయ్యే వాస్తవ పరిస్థితులు మాత్రం మన వద్ద లేవు. గౌతమ బుద్ధుడు జన్మించిన ఈ నేలన, ఇప్పుడు ఈ దేశపు మానవుల దుఃఖానికీ, దుర్భర జీవితాలకీ కారణాలను అన్వేషించే తీరిక అధికారంలో ఉన్న, హృదయాలను కోల్పోయిన వారికిలేదు. అందుకోసం అధికారాన్ని త్యజించడం అన్న మాట ఊహకు కూడా అందని విషయం. ఇప్పుడు నడుస్తున్న తీరులోనే ‘మోడీ నో మిక్స్’ ఆర్థిక వ్యవస్థ నడిస్తే, మన దేశం దుఃఖ వికసిత భారత్‌గా మాత్రం తప్పక మారుతుంది.

బహుముఖం

విమల

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News