Monday, December 23, 2024

ధనస్వామ్యం!

- Advertisement -
- Advertisement -

ప్రపంచంలోనే పేదలు అత్యధిక సంఖ్య (22.8 కోట్ల మంది) లో గల భారత దేశ రాజకీయ రంగం అమిత సంపన్నులతో కిక్కిరిసిపోడం కంటే విచిత్రమేముంటుంది! పేదల దేశాన్ని ధనికులు పాలించడం అంతిమంగా ఎక్కడికి దారి తీస్తుంది!! దేశంలో బిలియనీర్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతూ పేదలు నిరుపేదలవుతుండడానికి ఇదే కారణమనుకోవాలి. కళ్ళముందున్న ఈ కఠోర సత్యాన్ని అద్దంలో చూపించనవసరం లేదు. ప్రస్తుత లోక్‌సభలో గల 539 మంది ఎంపిలలో 475 మంది కోటీశ్వరులని, ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్ ఎడిఆర్ గతంలోనే నిగ్గు తేల్చింది. కోటీశ్వరులంటే ఒకటి రెండు కోట్లున్నవారు కాదు. వీరంతా సూపర్ సంపన్నులే.

ఎడిఆర్ తాజా నివేదిక ప్రకారం దేశంలో గల ప్రస్తుత శాసన సభ్యుల (4128)లలో 87% మంది కోటీశ్వరులు, 43% మంది ఎంఎల్‌ఎలపై క్రిమినల్ కేసులున్నాయి. రాజకీయాల్లో అర అడుగు పెట్టాలంటేనే తప్పనిసరిగా సంపన్నులై వుండాల్సిన స్థితి దేశానికి మేలు చేయదు. సంపన్నులు కావాలంటే అడ్డదారులు తొక్కక తప్పని వాతావరణం స్థిరపడిపోయింది. కింది స్థాయి ఉద్యోగాలు చేసుకుంటున్న వారో, చిన్న, చితక ఉపాధి పనులతో పొట్ట పోషించుకుంటున్న వారో, కేవలం విద్యావంతులు, మేధావులు శాసన సభకు కాదు కదా పంచాయితీ వార్డు మెంబర్ పదవికో, కార్పొరేటర్ స్థానానికో పోటీ చేయగల పరిస్థితి బొత్తిగా లేదు. సంపన్నులైతే కావచ్చు ప్రజాసేవలో వారికి గల రికార్డు, ప్రజా సమస్యలకు మెరుగైన పరిష్కారం చూపగల విజ్ఞత వున్నవారై వుంటే పరవాలేదు. అది కూడా గుండు సున్నాయే.

డబ్బు ఊరక వచ్చేది కాదు, పూర్వమైతే తండ్రి తాతలకు అనాయాసంగా సంక్రమించిన భూ సంపదపరంగా, జమీందారి కుటుంబాల నుంచి వచ్చిన వారు తమ ఫ్యూడల్ మంచితనం మీద ప్రజాభిమానాన్ని చూరగొని చట్ట సభలకు ఎన్నికవుతూ వుండేవారు. ఇప్పటి ప్రజా ప్రతినిధుల్లో అటువంటి వారి శాతం బహు తక్కువ. డబ్బు ఒక్కటే ప్రధానంగా ఎన్నికల్లో దానిని వెదజల్లుతూ శాసన సభల్లో అడుగు పెడుతున్నారు. ఉన్నట్టుండి కోటీశ్వరులు కావాలంటే అడ్డదారులు తొక్కి తీరాలి. అవినీతికి పాల్పడాలి. అదేమని ప్రశ్నించేవారిని తప్పనిసరైతే హతమార్చి తమ దారి నుంచి తప్పించుకోగలగాలి. ప్రభుత్వాల నుంచి దొడ్డిదారిలో కాంట్రాక్టులు వంటి సునాయాస ధనార్జన అవకాశాలు పొందగలగాలి. ఇలా అవినీతిపరులు, నేరస్థ రికార్డు గల వారైతే గాని ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నారు. ఆ విధంగా చట్ట సభల్లో కోటీశ్వరులు, క్రిమినల్స్‌ది పైచేయి కాగలుగుతున్నది. వీరు ప్రజల కోసం ఏమి చేస్తారనేది కళ్ళముందున్నదే.

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) లెక్కల ప్రకారం మన దేశంలో తలసరి ఆదాయం రూ. 1.43 లక్షలు. దేశ జనాభాలో 20% మంది రోజుకు 1.9 డాలర్ల రాబడి (రూ. 150) తో బతుకుతున్నారు. 95% గృహస్థులు ఏడాదికి రూ. 8 లక్షలకు మించని ఆదాయంతో నడిపిస్తున్నారు. ఇటువంటి దేశంలో 88% ప్రజాప్రతినిధులు కోటీశ్వరులు కావడం విడ్డూరం కాదా! వాస్తవానికి 2004లో 156 మంది ఎంపిలే కోటీశ్వరులు. అంటే సభా బలంలో 30% మంది. 2009 నాటికి వీరి సంఖ్య రెట్టింపై 315 (58%)కి ఎగబాకింది. బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2014లో వీరి సంఖ్య 443కి చేరుకున్నది. ఈ విధంగా చట్ట సభల్లో కోటీశ్వరులు, అవినీతి సామ్రాట్టుల సంఖ్య నానాటికీ పెరుగుతూ వుండడం నిరుపేదల దేశమైన భారత దేశ ప్రజాస్వామ్య దుర్దశను ఎలుగెత్తి చాటుతున్నది. చట్టసభల సభ్యులు ఓటర్ల విచక్షణా జ్ఞానంపై ఆధారపడి కాకుండా డబ్బు ప్రవాహం మీద ఆధారపడి ఎన్నికవుతూ వుండడం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు.

రాజ్యాంగం గాని, ఎన్నికల సంఘం గాని, న్యాయ వ్యవస్థ గాని ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయలేకపోడం అత్యంత దురదృష్టకరం. ప్రజాస్వామ్యమంటే అందుకు సంబంధించిన రాజ్యాంగం ప్రకారం ప్రజల శ్రేయస్సు కోసం పని చేసే ఉత్తమమైన వ్యవస్థ. ఇప్పటి మన ప్రజాస్వామ్యం అందుకు విరుద్ధంగా పని చేస్తున్నది. చట్ట సభలకు ఎన్నికవుతున్న సంపన్న సభ్యులందరూ దేశంలో ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని పెంచి తద్వారా తాము మరింత మంది అంబానీలు, అదానీలుగా మారే వైపే పాలనా రథాన్ని నడిపిస్తే ఇన్ని కోట్ల మంది పేదలు, మధ్యతరగతి ప్రజలు ఏమైపోవాలి? సామాజిక న్యాయం ద్వారా క్రింది శ్రేణుల్లోని ప్రజలను ఆర్థికంగా, సామాజికంగా, విద్యా విషయకంగా పైకి తీసుకు వచ్చి ఒకనాటికి సోషలిస్టు తరహా సమాజాన్ని నెలకొలుకోవాలని మన రాజ్యాంగం స్పష్టం చేస్తున్నది. అందుకు విరుద్ధంగా సనాతన హిందూ సమాజాన్ని స్థాపించి అందులో భాగంగా కులాల అంతరాలను తిరిగి పటిష్టపరచడానికి ప్రస్తుత బిజెపి పాలకులు కృషి చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. సంపన్నులు, అవినీతి పరులతో నిండిన చట్టసభలు కూడా ఇందుకే తోడ్పడే ప్రమాదమున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News