మమతా బెనర్జీ నిరుపేద ముఖ్యమంత్రి
ఎడిఆర్ నివేదిక
న్యూఢిల్లీ : ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ (ఎడిఆర్) సోమవారం ఢిల్లీలో విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ. 931 కోట్లు విలువ చేసే ఆస్తులతో అత్యంత సంపన్న ముఖ్యమంత్రి కాగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేవలం రూ. 15 లక్షలతో అత్యంత పేద ముఖ్యమంత్రి. రాష్ట్ర శాసనసభలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ముఖ్యమంత్రికి సగటు ఆస్తి రూ. 52.59 కోట్లు అని నివేదిక తెలియజేసింది. భారత తలసరి నికర జాతీయ ఆదాయం (ఎన్‌ఎన్‌ఐ) 2023-24కు సుమారు రూ. 185854 కాగా, ఒక ముఖ్యమంత్రి సగటు స్వీయ ఆదాయం రూ. 1364310. భారత సగటు తలసరి ఆదాయం కన్నాది సుమారు 7.3 రెట్లు అధికం.
31 మంది ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తుల విలువ రూ. 1630 కోట్లు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు రూ. 332 కోట్లకు పైగా విలువ చేసే మొత్తం ఆస్తులతో రెండవ సంపన్న ముఖ్యమంత్రి కాగా, కర్నాటక ముఖ్యమంత్రి ఆ జాబితాలో రూ. 51 కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులతో మూడవ స్థానంలో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రూ. 55 లక్షలు విలువ చేసే ఆస్తులతో ఆ జాబితాలో రెండవ నిరుపేద సిఎం కాగా, పినరయి విజయన్ రూ. 118 కోట్లతో మూడవ స్థానంలో ఉన్నారు.
ఖండుకు రూ. 180 కోట్ల మేరకు అత్యధికంగా అప్పులు ఉన్నాయి. సిద్ధరామయ్యకు రూ. 23 కోట్లు విలువ చేసే అప్పులు ఉన్నాయని, చంద్రబాబు నాయుడుకు రూ. 10 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని నివేదిక వెల్లడించింది. 13 (42 శాతం) మంది ముఖ్యమంత్రులు తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించారని, 10 (32 శాతం) మంది ముఖ్యమంత్రులు హత్యా యత్నం, కిడ్నాపింగ్, లంచం, నేరపూర్వక బెదరింపు సహా తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించారని కూడా నివేదిక తెలిపింది. 31 మంది ముఖ్యమంత్రులలోకి ఇద్దరు మాత్రమే మహిళలు. వారు మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్), ఆతిశీ (ఢిల్లీ).