హైదరాబాద్: నగరంలో భోగి పండుగ సంబురాలు అంబారాన్నంటాయి. తెల్లవారు జామున 4 గంటలకు నిద్ర లేచిన నగర వాసులు మంగళ స్నానాలు ఆచరించి సంప్రందాయ బద్దంగా భోగి మంటలు వేసుకున్నారు. ఈ ఏడాదంతా భోగ భాగ్యాలు అందించాలని కోరుకుంటూ వేసిన భోగి మంటలు చుట్టు చేరి చిన్నారులు, పెద్దలు సందండి చేశారు. తెల్లతెల్లవారు జామునే హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాలతో నగరం మంతా కోలాహలంగా మారింది. ఆడపడుచులు ఇళ్ల ముందు రంగు రంగుల ముగ్గులు వేసి గోబ్బమ్మలతో అందంగా ఆలకరించడంతో సంక్రాంతి శోభ సంతరించుకుంది. భోగి రోజున ప్రత్యేక ఘటమైన భోగి పండ్ల పేరాంటంలో భాగంగా చిన్నారుల తలలపై రేగుపళ్లు, పువ్వులు పోసి పెద్దలు మురికి పోయ్యారు. పండుగ వేళా సంప్రదాయ దుస్తువులలో ఆడపడుచులు మురిసిపోయారు.
నగరమంతా ప్రత్యేక పిండి వంటలతో గుమ్మగుమ్మలాడింది. బందు మిత్రులతో ఇళ్లన్ని కళకళలాడాయి. కెపిహెచ్‌బి, కూకట్ పల్లి, భరత్ నగర్, అమీర్‌పేట్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కొండాపూర్, దిల్ సుఖ్ నగర్, కొత్తపేట, నాగోల్, ఎల్‌బి నగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో భోగి సంబురాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఒమిక్రాన్ నేపథ్యంలో కోవిడ్ నిబంధనల మధ్య యువత కేరింతల మధ్య పతాంగులను ఎగుర వేశారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రతి ఏడాది మాదిరిగానే పిపుల్స్ ప్లాజాలో పంతంగుల సందండి నెలకొంది. చిన్నారులు, పెద్దలు చేరి పంతుంగులను ఎగురవేశారు. శనివారం ప్రధాన పండుగ సంక్రాంతి ఉత్సవాలను మరింత ఆనందోత్సవాల మధ్య జరుపుకునేందుకు మరింత పెద్ద ఎత్తున జరుపుకునేందుకు నగర వాసులు ఏర్పాట్లలో తలమునకలైయ్యారు.
నగరవాసులకు పలువురు పండుగ శుభాకాంక్షలు
సంక్రాంతి పండుగను సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు నగరవాసులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పశు సంవర్థక శాఖ మంత్రి తలసానిశ్రీనివాస్ యాదవ్ నగరవాసులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఆనందోత్సవంతో పర్వదినం జరుపుకోవాలని, ఈ ఏడాదంతా ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని దేవుడిని కోరుకున్నట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ శర్మన్ నగరవాసులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు శాంతి, సౌభాగ్యాలు, సుఖ సంతోషాలతో సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు.