మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ అకాల మరణం ఎంతో మందిని బాధకు గురి చేసిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా క్రికెటర్లే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆటగాళ్లు వార్న్ మృతిపై తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇక వార్న్‌తో కలిసి సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడిన ఆస్ట్రేలియా క్రికెటర్లు అయితే ఆ షాక్ నుంచి ఇంకా బయటపడలేక పోతున్నారు. వారిలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ పాంటింగ్ ఒకడు. వార్న్‌తో పాంటింగ్‌కు విడదీయలేని అనుబంధం ఉంది. వార్న్ మృతి వార్త విని పాంటింగ్ భావోద్వేగానికి గురయ్యాడు. వార్న్ గురించి చెబుతూ ఎంతో ఆవేదన చెందాడు. ఈ క్రమంలో ఉబికి వస్తున్న కన్నీటిని కూడా ఆపుకోలేక పోయాడు. వార్న్‌తో కలిసి దాదాపు దశాబ్దం పాటు ప్రయాణించాం. ఈ సమయంలో వార్న్‌తో ఆత్మీయ బంధం ఏర్పడింది. తాను అత్యంత ఇష్టపడే సహచరుల్లో వార్న్‌దే అగ్రస్థానం. అతని అకాల మరణాన్ని తాను తట్టుకోలేక పోతున్నానని పాంటింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా విజయాల్లో వార్న్ పాత్ర చాలా కీలకమన్నాడు. అతని అద్భుత బౌలింగ్ వల్లే తాను మెరుగైన కెప్టెన్‌గా గుర్తింపు తెచ్చుకోగలిగానని పాంటింగ్ పేర్కొన్నాడు.
Ricky Ponting about demise of Shane Warne