మత్య్సశాఖకు పిఆర్ చెరువుల్లో చేపలపై హక్కులు: మంత్రి తలసాని
మనతెలంగాణ/హైదరాబాద్: పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉన్న చెరువుల్లో చేపల పెంపకం చేపల వేటపై యాజమాన్య హక్కులను మత్సశాఖకు బదిలీ చేసినట్టు పశుసంవర్ధక మత్సశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. దీనివల్ల గంగపుత్రులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. చెరువుల లీజులో పాత ధరలనే కొనసాగిస్తామని ఇచ్చిన హామీ ప్రకారం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర ఐక్య కార్యాచరణ సమితి నేతలు శుక్రవారం మంత్రిని ఘనంగా సత్కరించి ధన్యవాదాలు తెలిపారు.
మంత్రితోపాటు ఆ శాఖ ఉన్నతాధికారులకు , సమన్వయ కమిటి సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. సమస్యాత్మక సొసైటీల్లో గొడవలు లేకుండా సమగ్ర ఫిషరీస్ రక్షణ చట్టంతోపాటు సర్కులర్ స్థానంలో ప్రత్యేకంగా జివో జారీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర ఐక్యకార్యాచరణ కమిటి చైర్మన్ దిటి మల్లయ్య, కన్వీనర్ కె.యాదగిరి , అధికార ప్రతినిధులు మధుసూదన్ ,మత్తన్న తదితరులు పాల్గొన్నారు.