ముంబై: దేశంలో అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురువారం(సెప్టెంబర్ 5న) బోనస్ షేర్ల జారీకి ఆమోదం తెలిపింది. ప్రతి ఒక్క షేరుకు మరో షేరు బోనస్ గా ఇవ్వనున్నది. అయితే అది రికార్డ్ తేదీన ఇస్తారు. కానీ ఆ రికార్డ్ డేట్ ను ఇంకా నిర్దారించలేదు. త్వరలో తెలుపుతారు. అంతేకాక ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ పెంపును సిఫారసు చేసింది. రిలయన్స్ కంపెనీ బోర్డు ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ను రూ. 15000 కోట్లను రూ. 50 000 కోట్లు(5.96 బిలియన్ డాలర్లకు) పెంచుతూ సిఫారసు చేసింది.
2017 తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ బోనస్ షేర్లు ఇవ్వడం ఇప్పడే మళ్లీ. ఇదివరలో(2017లో) బోనస్ షేర్లు ప్రకటించినప్పుడు షేరు ధర రూ. 700 గా ఉండింది. అప్పటి నుంచి ఈ కంపెనీ షేరు ధర బాగా పెరిగింది. రిలయన్స్ కంపెనీ లిస్టింగ్ అయినప్పటి నుంచి బోనస్ షేర్లు ఇవ్వడం ఇది ఆరోసారి. ఇదివరలో 1980,1983,1997, 2009, 2017లో బోనస్ షేర్లు ఇచ్చారు. రికార్డు డేట్ నాటికి డీమ్యాట్ లో షేర్లు ఉంటేనే ప్రతి ఒక్క షేరుకు మరో షేరు బోనస్ గా లభిస్తుంది. ‘‘రిలయన్స్ వృద్ధి చెందనప్పుడల్లా మేము మా షేర్ హోల్డర్లకు దండిగా రివార్డు ఇస్తాము’’ అని ముఖేశ్ అంబానీ బోర్డు సమావేశంలో తెలిపారు.
రిలయన్స్ షేరు ఈ ఏడాది 16 శాతం మేరకు పెరిగింది. కానీ నేడు స్టాక్ మార్కెట్ లో 1.42 శాతం లేక రూ.43.15 మేరకు పతనమై రూ. 2985.95 వద్ద ముగిసింది. బోనస్ షేర్లు ప్రకటిస్తారన్న వార్త విన్నాక గత వారం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల ధర పెరిగింది.