ఇయాన్ బెల్
లండన్: రిషబ్ పంత్ వంటి ప్రతిభావంతుడైన బ్యాట్స్‌మన్ లభించడం టీమింండియా అదృష్టమని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ బెల్ అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు పంత్ లేని భారత జట్టును ఊహించలేమన్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ సిరీస్‌ల ద్వారా పంత్ ఎంతో రాటుదేలాడన్నాడు. ఇటు కీపింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ ఎంతో మెరుగయ్యాడని బెల్ ప్రశంసించాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌లతో పంత్ చెలరేగిపోతున్న తీరును ఎంత పొగిడినా తక్కువేనన్నాడు. ప్రస్తుతం టీమిండియాలోనే పంత్ మ్యాచ్ విన్నర్‌గా అవతరించాడనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు.
ఒత్తిడిలోనూ చెలరేగి ఆడడం ఒక్క పంత్‌కు మాత్రమే సాధ్యమవుతుందన్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో అతను చెలరేగిన తీరున తనను ఎంతో ఆకట్టుకుందన్నాడు. తాజాగా ఇంగ్లండ్‌పై కూడా కూడా విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించడని పేర్కొన్నాడు. రానున్న రోజుల్లో టీమిండియా అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా పంత్ ఎదగడం ఖాయమని జోస్యం చెప్పాడు. అంతేగాక మాజీ దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోనీ, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌లను పంత్ మించిపోయినా ఆశ్చర్యం లేదని బెల్ పేర్కొన్నాడు. ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో బెల్ ఈ విషయాలు వెల్లడించాడు.