యువరాజ్ జోస్యం
న్యూఢిల్లీ: భవిష్యత్తులో టీమిండియా సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశాలు యువ సంచలనం రిషబ్ పంత్‌కే అధికంగా ఉన్నాయని భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ జోస్యం చెప్పాడు. కొంతకాలంగా రిషబ్ ఆటను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుందన్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లతో జరిగిన సిరీస్‌ల ద్వారా పంత్ ఎంతో రాటుదేలాడన్నాడు. ఇక ఐపిఎల్‌లో కెప్టెన్‌గా కూడా మెరుగైన ప్రదర్శన చేశాడన్నాడు. సారథిగా ఢిల్లీ క్యాపిటల్స్‌ను అతను నడిపించిన తీరును ఎంత పొగిడినా తక్కువేనన్నాడు. అతడిలో భవిష్యత్తు సారథి కనిపిస్తున్నాడని యువరాజ్ అభిప్రాయపడ్డాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే రానున్న రోజుల్లో పంత్ టీమిండియా కెప్టెన్సీ చేపట్టడం ఖాయమన్నాడు. ఒకవేళ అతనికి సారథ్య బాధ్యతలు అప్పగిస్తే టీమిండియాను విజయపథంలో నడిపించడం తథ్యమన్నాడు. ఇప్పటికే తానొక మ్యాచ్ విజేతనని పంత్ నిరూపించాడన్నాడు. కఠిన పరిస్థితుల్లో ఆస్ట్రేలియాలో ఆడిన తీరును ప్రశంసించక తప్పదన్నాడు. ఇక ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లో కూడా పంత్ టీమిండియాకు చాలా కీలకమని యువరాజ్ పేర్కొన్నాడు.