అసిస్టెంట్ కోచ్ ఆమ్రెపై ఒక మ్యాచ్ నిషేధం
ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్, ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌తో పాటు జట్టు అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రెకు ఐపిఎల్ నిర్వాహకులు భారీ జరిమానా విధించారు. రాజస్థాన్‌తో మ్యాచ్ సందర్భంగా చివరి ఓవర్‌లో నోబాల్ వివాదం నెలకొంది. ఈ వివాదం తీవ్ర దుమారం లేపింది. ఈ క్రమంలో రిషబ్, ఆమ్రె, శార్దూల్ ప్రవర్తించిన తీరుపై నిర్వాహకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముగ్గురు ప్రవర్తించిన సమంజసంగా లేదని, ఇది లెవెల్2 నిబంధనల అతిక్రమణ కిందకు వస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా ముగ్గురిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు కెప్టెన్ రిషబ్ పంత్ మ్యాచ్ ఫీజులో వంద శాతం జరిమాన విధించారు. ఇక ఆల్‌రౌండర్ శార్దూల్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు. ఇక అసిస్టెంట్ ప్రవీణ్ ఆమ్రె మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధం విధించారు. ఈ విషయాన్ని ఐపిఎల్ నిర్వాహణ కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
విమర్శలు వెల్లువ..
మరోవైపు మ్యాచ్ సందర్భంగా రిషబ్ పంత్, శార్దూల్‌లు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. వీరి ప్రవర్తన క్షమించారని విధంగా ఉందని పలువురు మాజీ క్రికెటర్లు విమర్శించారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ పీటర్సన్ కూడా ఢిల్లీ జట్టు సభ్యుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు నెటిజన్లు సయితం రిషబ్ అతని సహచరుల తీరును తప్పుపట్టారు.