Monday, January 20, 2025

బ్రిటన్‌లో మంత్రివర్గ మార్పులు

- Advertisement -
- Advertisement -

భారీ మంత్రివర్గ మార్పులు, చేర్పులు చేపట్టడం ద్వారా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సాహసమైన అడుగే వేశారు. వివాదాస్పదురాలైన హోం మంత్రి సుయెల్లా బ్రావర్ మాన్‌ను తొలగించడం, మాజీ ప్రధాని డేవిడ్ కామరాన్‌ను మంత్రి వర్గంలోకి తీసుకోడం ఊహించని చర్యలే. సీనియర్ పోలీసు అధికార్లు పాలస్తీనా అనుకూల ప్రదర్శకుల పట్ల మెతకగా వ్యవహరించారని వ్యాఖ్యానిస్తూ ది టైమ్స్ పత్రికలో వ్యాసం రాసినందుకు విమర్శలు ఎదుర్కొన్న కారణంగా బ్రావర్ మాన్‌ను సునాక్ తొలగించారు. ప్రధాని కార్యాలయం అనుమతి తీసుకోకుండానే ఆమె ఆ పత్రికకు తన వ్యాసాన్ని పంపించడం కూడా విమర్శలకు గురి అయింది.

కోవిడ్ కాలంలో ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమకారుల పట్ల కూడా పోలీసు అధికార్లు చూసీచూడనట్టు వ్యవహరించారని ఈ వ్యాసంలో ఆమె ఎత్తి చూపారు. మితవాద నేషనలిస్టు ప్రదర్శకుల పట్ల కఠినంగా వ్యవహరించి పాలస్తీనా అనుకూల నిరసనకారుల విషయంలో పోలీసులు మెతగ్గా వున్నారని అంటూ వారు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని బ్రావర్ మాన్ విమర్శించారు. అడపదడప నిగ్రహం కోల్పోయి వ్యాఖ్యానించడం ఆమెకు అలవాటే. ప్రధానిగా మంచి రికార్డులేని కామరాన్‌పై అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. ప్రధాని పదవి నుంచి తప్పుకొన్న తర్వాత తాను పని చేసిన గ్రీన్ సిల్ బ్యాంకుకు ప్రభుత్వంలోని తన పలుకుబడిని ఉపయోగించి నిధులు సమీకరించారని ఆయనపై ఆరోపణ వచ్చింది. అటువంటి కామరాన్‌కు విదేశాంగ శాఖను సునాక్ అప్పగించారు.

మామూలుగా ప్రధాని పదవి నుంచి తప్పుకొన్న వారు మంత్రివర్గ సభ్యులుగా చేరడం అరుదు. ఇంత వరకు విదేశాంగ మంత్రిగా చేసిన జేమ్స్ క్లెవర్లీని హోం మంత్రిగా నియమించారు. మధ్యప్రాచ్యంలో, ఉక్రెయిన్‌లో దేశం తీవ్రమైన సవాళ్ళను ఎదుర్కొంటున్న సమయంలో తన అనుభవం సునాక్‌కు ఉపయోగపడుతుందని కామరాన్ అభిప్రాయపడ్డారు. కీలక మంత్రి పదవుల్లో అనుభవజ్ఞులను, సీనియర్లను నియమించడం సునాక్ పునర్వవస్థీకరణలో కొట్టవచ్చినట్టు కనిపించింది. అయితే డేవిడ్ కామరాన్‌ను మంత్రి వర్గంలోకి తీసుకోడంపై నిర్వహించిన అభిప్రాయ సేకరణలో 24 మంది అనుకూలంగాను, 38 మంది వ్యతిరేకంగాను స్పందించారు.

ఈ మంత్రివర్గ మార్పులు చేపట్టిన సమయంలోనే అధికార పార్టీ ఎంపి ఆండ్రియా జెంకిన్స్ మొట్టమొదటి అవిశ్వాస లేఖను ప్రధాని సునాక్‌పై సంధించారు. దీనిని బట్టి సునాక్ మంత్రివర్గం పట్ల పాలక పక్షంలో అసమ్మతికి నాందీ ప్రస్తావన జరిగిందని భావించవచ్చు. అయితే మొత్తం పార్టీ ఎంపిలలో కనీసం 15% మంది ఈ విధంగా అసమ్మతి లేఖలు పంపించినప్పుడే ప్రధాని విశ్వాస ఓటింగ్‌ను ఎదుర్కోవలసి వుంటుంది. పాలక కన్సర్వేటివ్ పార్టీకి 350 మంది ఎంపిలు వున్నారు. ప్రధాని సునాక్‌పై విశ్వాస ఓటును నిర్వహించాలంటే 53 మంది ఎంపిలు అవిశ్వాస లేఖలను సంధించాల్సి వుంటుంది. సునాక్ మంత్రివర్గ మార్పులు మంచివేనని కొన్ని వర్గాలు ప్రశంసిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ ప్రధాని కామరాన్‌ను విదేశాంగ మంత్రిని చేయడాన్ని ఈ వర్గాలు శ్లాఘిస్తున్నాయి.

ఇది భారత బ్రిటన్ సంబంధాలను మంచి మలుపు తిప్పవచ్చుననే ఆశాభావం కూడా వ్యక్తమవుతున్నది. కామరాన్ ప్రభావవంతుడని, ప్రధాని మోడీతో ఆయనకు మంచి సంబంధాలున్నాయని, ఆయనను చేర్చుకోడం భారత బ్రిటన్ విదేశీ వాణిజ్య చర్చలపై సానుకూల ప్రభావం చూపగలదని వ్యాఖ్యలు వచ్చాయి. పూర్వపు హోం మంత్రి బ్రావర్ మాన్ బ్రిటన్‌కు భారతీయుల వలసలను ఆపాలని ప్రయత్నించారని, ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు రావొచ్చునని ఆశిస్తున్నారు. బ్రిటన్‌కు వెళ్ళే స్వల్ప కాల భారత సందర్శకులకు పని వీసాలను హామీ ఇచ్చే కార్యక్రమాన్ని విదేశీ వాణిజ్య ఒప్పందంలో చేర్చాలని ఇండియా కోరుతున్నది. బ్రావర్ మాన్ దీనిని వ్యతిరేకించారు.

తాను ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోయిన బ్రావర్ మాన్ వంటి వారిని వదిలించుకోడంలో సునాక్ వెన్నెముకను రుజువు చేసుకొన్నారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది. సునాక్ తన మంత్రివర్గంలోని అసమర్థులను తొలగించి సమర్థులను చేర్చుకొన్నారనే వ్యాఖ్యలు కూడా వెలువడ్డాయి. అయితే విదేశాంగ శాఖ కోసం మాజీ ప్రధానిని తెచ్చుకోడాన్ని సునాక్ చేతగానితనంగా భావించేవారు లేకపోలేదు. కామరాన్‌ను మంత్రివర్గంలో చేర్చుకొన్నారంటే సునాక్ ఇప్పట్లో ఎన్నికలకు వెళ్ళబోరని చెప్పవచ్చు.

మామూలుగా వచ్చే ఏడాది చివరిలో బ్రిటన్‌లో ఎన్నికలు జరగవలసి వుంది. ఈలోగా ఎన్నికలకు తెర లేపదలచుకొంటే ఈ స్వల్ప కాలానికి విదేశాంగ మంత్రిని మార్చి వేసి కామరాన్‌ను తీసుకు రావలసిన అవసరం కలిగేది కాదు. మొత్తానికి సునాక్ చూపిన సాహసం ఆయన భవిష్యత్తుపై ఎటువంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. గత ఏడాది ముగ్గురు ప్రధానులను చూసిన చరిత్ర బ్రిటన్‌ది. అందుచేత సునాక్ తదుపరి ఎన్నికల వరకు ప్రధానిగా కొనసాగడం కూడా అద్భుతమే అవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News