Sunday, December 22, 2024

బ్రిటన్ తీర్పు మనకూ గుణపాఠమే!

- Advertisement -
- Advertisement -

బ్రిటన్‌లో మొదటిసారిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ప్రధానిగా ఎన్నికై కొద్దీ కాలానికే ఎన్నికలలో ఘోరంగా ఓటమి చెందటం, 14 సంవత్సరాల కన్సర్వేటివ్ పార్టీ పాలనకు ముగింపు పలకడం భారతీయులకు విచారమే కలిగిస్తుంది. వాస్తవానికి బ్రిటన్ ఆర్ధిక పరిస్థితులను మెరుగుపరచేందుకు రిషి సునాక్ విశేషంగా కృషి చేశారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. తొందరపడి ముందుగా ఎన్నికలకు వెళ్లకుండా ఉంటే ఫలితాలు మరోవిధంగా ఉండేదని భావించేవారు కూడా ఉన్నారు. అయితే వరుసగా కన్సర్వేటివ్ పార్టీ ప్రధానులు అంతర్జాతీయంగా బ్రిటన్ ప్రాధాన్యత కోల్పోయే విధంగా, అంతర్గత పరిస్థితులు అదుపు తప్పే విధంగా వ్యవహరించారని చెప్పవచ్చు. స్వతహాగా సంపన్నుడైన రిషి సునాక్ ఆర్థ్ధిక వ్యవహారాలలో ఆరితేరిన వ్యక్తి కావడంతో ఓ మేనేజర్‌గా వ్యవహరించారు.

అయితే బ్రిటన్ ప్రజలు పరిస్థితులను చక్కదిద్దెందుకు రాజకీయ జోక్యం అవసరమని భావించారు. అందుకనే రాజకీయంగా పరిణతి చెందిన కీర్ స్టార్మర్‌ను ఎన్నుకున్నారు. వివేకంతో బ్రిటన్ ప్రజలు ఇచ్చిన తీర్పు భారత నాయకులకు సైతం ఓ గుణపాఠం కావాలి. నేడు రాజకీయ పార్టీలు నిర్దుష్టమైన విధానపరమైన ఆలోచనలు లేకుండా ఎప్పటికప్పుడు ప్రజలను ఆకట్టుకునేందుకు ‘ఎన్నికల యాజమాన్యం’ పట్ల ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు.ఈ క్రమంలో పరిణతితో అందరినీ కలుపుకొనిపోగల రాజకీయ నాయకత్వం కొరత ఏర్పడుతున్నది. మీడియాను, వ్యవస్థలను, చివరకు ప్రజల దృష్టిని కూడా అదుపు చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారుగాని నిర్దుష్టమైన విధానాలతో, తమ సుపరిపాలనతో ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేయడం లేదు. దాదాపు ఒక దశాబ్దం పాటు, బ్రిటన్ పూర్తిగా నివారించదగిన బ్రెగ్జిట్ ప్రజాభిప్రాయ సేకరణ దుష్పరిణామాలను ఎదుర్కోవలసి వచ్చింది. నలుగురు కన్జర్వేటివ్ పార్టీ ప్రధానులు — థెరిసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషి సునాక్ డేవిడ్ కామెరూన్ వదిలిపెట్టిన గజిబిజిని శుభ్రం చేయడానికి తమ పేలవమైన పదవీ కాలాన్ని కేటాయించవలసి వచ్చింది.

అంతర్గతంగా తలెత్తుతున్న లోతైన సామాజిక, రాజకీయ విభజనల దృష్ట్యా, దేశం స్థిరపడాలంటే సర్ కీర్ స్టార్మర్ వంటి గణనీయమైన జ్ఞానం, సామర్ధ్యం అవసరమని ప్రజలు భావించారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళను పరిష్కరించడంలో కన్సర్వేటివ్ పార్టీ అసమర్థతే ముఖ్యంగా స్టార్మర్ అద్భుతమైన విజయానికి దారితీసిందని చెప్పవచ్చు. 20వ శతాబ్దం చివరి నాటికి, ఐరోపా యూనియన్ సభ్యత్వం బ్రిటన్‌కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సభ్యత్వం లేదా అణుశక్తి హోదా లేదా కామన్వెల్త్‌కు నాయకత్వం వహించలేకపోయిన ప్రపంచ వ్యవహారాల్లో ఒక ప్రాముఖ్యతను ఇచ్చింది. ప్రజల మానసిక స్థితిని పూర్తిగా తప్పుగా అంచనా వేసిన కామెరాన్ దుశ్చర్యల కారణంగా బ్రిటన్‌ను అంతర్జాతీయ వ్యవహారాలలో ఓ బలమైన శక్తిగా నిలబెట్టిన మార్గరెట్ థాచర్ ఏర్పర్చిన వరవడి నుండి బ్రిటన్ పడిపోవడం ప్రారంభమైంది. సద్దాం హుస్సేన్ వద్ద ‘సామూహిక విధ్వంసం సృష్టించే ఆయుధాలు’ ఉన్నాయనే అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ మాయలో టోనీ బ్లెయిర్ పడిపోయి, అమెరికాకు ఉపగ్రహంగా బ్రిటన్‌ను మార్చినప్పటి నుండి అంతర్జాతీయంగా ఆ దేశం ప్రాధాన్యత కోల్పోతూ వచ్చింది.

ఇటువంటి పరిస్థితులలో ఆర్థిక వ్యవహారాలలో నిపుణుడైన రిషి సునాక్ తమను ఆదుకొంటాడు అనుకున్నారు. అయితే ప్రజలకు తాము విశ్వసింపగల, తాము ఆధారపడగల ఓ రాజకీయ నాయకుడి అవసరాన్ని గుర్తించారు. ప్రభుత్వాన్ని నిర్వహించేందుకు నాయకత్వ లక్షణాలున్న నేత అవసరమని భావించారు.ఈవెంట్ మేనేజర్లు ప్రభుత్వానికి స్థిరత్వం కలిగించినా సుస్థిరమైన పాలన అందింపలేరని భావించారు. ఇప్పటి వరకు బ్రిటన్ ప్రధానులు ఎక్కువగా అంతర్జాతీయ వ్యవహారాలపై దృష్టి సారించారు. కానీ కీర్ స్టార్మర్ దేశం లో నిరుద్యోగం, విద్య, ప్రజారోగ్యం, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ ఆర్ధిక వ్యవహారాలను సరిదిద్దాల్సి ఉంది. మరోవంక అమెరికా- చైనాల మధ్య నెలకొన్న ప్రచ్ఛన్న పోరులో నిర్వహించే పాత్ర కీలకం కానున్నది. ముఖ్యంగా ఆసియా- పసిఫిక్ ప్రాంతంలో కన్సర్వేటివ్ ప్రధానులు అనుసరించిన విధానాల బాటలోనే నడిచినా ఉక్రెయిన్ తదితర అంశాలలో సంయమనం పాటించే అవకాశం ఉంది.

గుడ్డిగా అమెరికాను అనుసరించే విధానాలకు తిలోదకాలిచ్చే అవకాశం ఉంది. ప్రతి అంశంలో అమెరికా మార్గదర్శనం కోసం చూడకుండా, ఐరోపా యూనియన్, కామన్ వెల్త్‌లతో సంబంధాలను మెరుగుపరచుకోవాల్సి ఉంటుం ది. ఎన్నికల ఫలితాలు రాగానే భారత్‌తో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకొనే ప్రయత్నం చేస్తామని స్టార్మర్ సంకేతం ఇవ్వడం మనకు సానుకూలమైన అంశం. ఈ విషయంలో భారత్ తో స్నేహంగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలు చెప్పుకోదగిన ముందడుగు వేయలేకపోయాయి. ఎన్నికల అనంతరం జరిగిన భారత్ పార్లమెంట్ మొదటి సమావేశాలలోనే రాజకీయంగా ప్రతిష్టంభన ఏర్పడటం గమనార్హం. ఆ ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు ప్రభుత్వం రాజకీయపరమైన ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు.

ప్రతిపక్షాలు లేవనెత్తిన కీలకమైన అంశాలకు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేయకుండా ఎదురు దాడి చేయడాన్ని మనం చూస్తున్నాము. పరిపక్వత గల రాజకీయ నాయకత్వం ఈ విధంగా వ్యవహరించదు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కీలకమైన అంశాలలో ప్రతిపక్షాలను సంప్రదించడం ఓ ఆనవాయితీగా వస్తున్నది. కొన్ని సందర్భాలలో స్వయంగా ప్రధాని, కాకపోతే కేంద్ర మంత్రులు, సీనియర్ ప్రభుత్వ అధికారులు నేరుగా ప్రతిపక్ష నేతలను కలిసి సమాలోచనలు జరపడం జరుగుతూ వచ్చింది. కానీ అటువంటి సంప్రదాయానికి గత పదేళ్లుగా స్వస్తి పలికిన విధానం దేశంలో లోపిస్తున్న రాజకీయ నాయకత్వాన్ని వెల్లడి చేస్తుంది. చివరకు లోక్‌సభలో ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే సంప్రదాయానికి స్వస్తి పలకడం, ఆ విధంగా ఇవ్వాల్సి వస్తుందని గత ఐదేళ్లుగా ఆ పదవికి ఎన్నికే జరపకపోవడం గమనిస్తే ‘ఈవెంట్ మేనేజర్’ ధోరణులు కనిపిస్తున్నాయి గాని రాజకీయ నాయకత్వం కనిపించడం లేదు.

ప్రస్తుత ప్రభుత్వం ఘనంగా చెప్పుకొంటున్న అంశం అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠలను ఎంతగానో ఇనుమడింప చేయడం. అయితే తాజాగా ప్రధాని జరిపిన రష్యా పర్యటన ఈ విషయంలో పలు అనుమానాలకు తావిస్తున్నది. భారత్‌కు అర్ధ శతాబ్ది కాలానికి పైగా వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటూ వస్తున్న రష్యాపై ఇప్పుడు చైనా ప్రభావం పెరుగుతున్నది. అందుకనే మొదటిసారిగా భారత ప్రధాని అధికారిక పర్యటన సందర్భంగా కీలకమైన రక్షణ అంశాలపై రెండు దేశాల మధ్య ఎటువంటి ఒప్పందం జరగక పోవడం గమనార్హం. అసలు సాంప్రదాయకంగా జరిగే రెండు దేశాధినేతలు కలిసి మీడియా ముందుకు వచ్చి తమ చర్చల సారాంశాన్ని వివరించే ప్రయత్నం చేయలేదు. రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందాల గురించి అధికారిక ప్రకటనలు కూడా లేవు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు విమానాశ్రయానికి వెళ్లి సాదరంగా స్వాగతం పలికిన పుతిన్ భారత ప్రధాని విషయంలో ఆ విధంగా చేయలేదు. కేవలం అణువిద్యుత్ కేంద్రాలను భారత్‌లో నెలకొల్పబోతున్నామని రష్యా అణు ఇంధన కేంద్రం ప్రకటించింది.

ఇప్పటికే తమిళనాడులో రష్యా సహాయంలో ఏర్పర్చిన అణు విద్యుత్ కేంద్రం ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంటున్నది. ఈ విషయమై కూడా రెండు ప్రభుత్వాలు అధికారిక ప్రకటన చేయలేదు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించిన సమయంలో రష్యా నుండి ముడి చమురును కొనుగోలు చేయడం ద్వారా భారత్ ఒక విధంగా ఆ దేశాన్ని ఆదుకుంది. మొదట్లో చమురుకు బదులుగా భారత్ రూపాయిలు తీసుకొనేందుకు రష్యా అంగీకారం తెలిపినా, అంతర్జాతీయ మార్కెట్‌లో భారత్ రూపాయలకు విలువ లేదని గ్రహించి తర్వాత అందుకు నిరాకరిస్తూ వస్తున్నది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్ అభివృద్ధి చెందబోతున్నట్లు చెప్పుకొంటున్నాము. అయితే మన రూపాయికి అంతర్జాతీయ మార్కెట్‌లో విలువ నానాటికీ పడిపోతుంది.

మరోవంక మన వాణిజ్య లోటు పెరిగిపోతున్నది. అందుకనే మనం విదేశాలలో బంగారం కొని, మనం బంగారం రూపంలో చెల్లింపులు చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నాము. అంతర్జాతీయంగా డాలర్ విలువకన్నా బంగారం విలువ తక్కువగా ఉంటూ ఉండడంతో మనకు సౌలభ్యంగా ఉంటున్నది. నేడు మన దేశం ఎదుర్కొంటున్న సంక్లిష్ట సమస్యల పరిష్కారానికి రాజకీయ నాయకత్వం అవసరాన్ని గుర్తించాలి. ఈవెంట్ మేనేజర్లతో ప్రయోజనం ఉండబోదని బ్రిటన్ అనుభవం నుండి గుణపాఠం నేర్వాలి. ఒక వంక రైతుల ఆందోళనలు నిరంతరంగా కొనసాగడం, మణిపూర్‌లో సంవత్సరానికి పైగా హింసాయుత ధోరణులు రగిలిపోతూ ఉండటం, మరో వంక నీట్ పరీక్షలు వంటివి ప్రభుత్వ సామర్ధ్యాన్ని ప్రశ్నిస్తూ ఉండటం గమనిస్తుంటే నాయకత్వ లోపాన్ని వెల్లడి చేస్తుంది.

చలసాని నరేంద్ర
98495 69050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News