బ్రిటిష్ ప్రధాన మంత్రి ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వానికై జరుగుతున్న పోరులో మొదట్లో దూసుకుపోయిన భారత సంతతికి చెందిన అభ్యర్థి రిషి సునాక్ ఆ తర్వాత అనూహ్యంగా వెనుక పడిపోయారు. ఇప్పటికే లిజ్ ట్రస్ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. బహుశా మరి కొద్దీ రోజులలో ఆమె అధికారికంగా ప్రధాని పదవి చేపట్టవచ్చు. ఎన్నికలలో ఇటువంటి జయాపజయాలు అత్యంత సహజమే. అయితే రిషి సునాక్ వెనుకబడటానికి గల కారణాలు రాజకీయమైనవి కాకుండా, వర్ణ వ్యవస్థకు సంబంధించినవని సర్వత్రా భావిస్తున్నారు. పాశ్చాత్య సమాజంలో పేరుకుపోయిన జాత్యహంకారానికి ఈ ఎన్నికలు అద్దం పడుతున్నాయని చెప్పవచ్చు. సునాక్ ‘తెల్లవాడు’ కాకపోవడం కారణంగా ఆ దేశపు ప్రధాని కాలేకపోతున్నారని అనడంలో సందేహం లేదు.
అధికార పార్టీ ఎంపిలలో జరిగిన వివిధ పోల్‌లలో ఆయన అందరికన్నా ముందున్నారు. లిజ్ ట్రస్ మూడవ స్థానంలో ఉన్నారు. కానీ సాధారణ పార్టీ సభ్యుల ఎంపిక విషయం వచ్చేసరికి ఆమె దూసుకుపోతున్నారు. భారత దేశం సుదీర్ఘకాలం పలు విదేశీ పాలనాలను చూసింది. మిగిలిన వారంతా ఇక్కడ సంపద దోచుకోవాలని, తమ సామ్రాజ్యం ఏర్పాటు చేసుకోవాలని చూశారు. కానీ ప్రజలపట్ల జాత్యహంకారాన్ని కేవలం బ్రిటిష్ వంటి ఐరోపా దేశాల వారు మాత్రమే ప్రదర్శించారని ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. ఆనాడు భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వడానికి తిరస్కరించడానికి ప్రధాన కారణం ‘నల్లవారు‘ పరిపాలన చేసుకోలేరని, తాము లేకపోతే ముక్కలుగా చెల్లాచెదురైపోతారనే దురహంకార భావన. తమ మాట సాగాలని పోతూపోతూ దేశాన్ని ముక్కలు చేసి, పలు వేర్పాటు కుంపట్లు పేర్చి మరీ వెళ్లారు. రవి అస్తమించని సామ్రాజ్యం కూలిపోయినా ఇటువంటి సంకుచిత మనస్తత్వం నుండి వారింకా బైటపడలేదని ఈ ప్రధాని ఎన్నిక స్పష్టం చేస్తుంది.
‘తెల్లవారి’ సామ్రాజ్యంగా భావించే మొత్తం పాశ్చాత్య ప్రపంచం లో నలుపు, ఆసియా లేదా మైనారిటీ జాతులవారు తెల్లవారు అత్యధికంగా ఉన్న దేశాల నేతలుగా ఎన్నికైన సందర్భాలు చాలా అరుదని ఈ సందర్భంగా గమనించాలి. ఆ విధంగా ఎన్నికైనది అమెరికాలో బరాక్ ఒబామా, పోర్చుగల్ ప్రధాన మంత్రి, గోవా సంతతికి చెందిన ఆంటోనియో కోస్టా, తండ్రి భారతీయుడైన ఐరిష్ మాజీ ప్రధాని లియో వరద్కర్ మాత్రమే కనిపిస్తారు. ఆ జాబితాలో రిషి సునాక్ చేరే అవకాశం ఇప్పుడు వచ్చింది. అమెరికాలో నిత్యం నల్లవారిపై అమానుష దాడులు చూస్తున్నాము. తాజాగా నలుగురు భారత సంతతికి చెందిన మహిళలపై జరిగిన దాడి చూశాము. మొదటిసారి ‘నల్లవాడు’ బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా కాగలిగినా తాను అధ్యక్ష స్థానంలో ఉంటూ కూడా పలు సందర్భాలలో ‘వర్ణ వివక్షత’కు గురయ్యానని ఆయనే వెల్లడించారు. ఇప్పటికీ ఆ దేశ న్యాయవ్యవస్థలో తీర్పులలో ‘వర్ణ వివక్షత’ను పరిగణనలోకి తీసుకొంటున్నట్లు ఆయనే వాపోయారు.
కరోనా సమయంలో రిషి సునాక్ వ్యవహరించిన తీరు చూసి ఆ దేశ ప్రజలు ఎన్నో విధాలుగా ప్రశంసించారు. కాబోయే ప్రధానిగా కొనియాడారు. ప్రస్తుతం ప్రధాని పదవికి పోటీ పడుతున్న ఇద్దరిలో సామర్ధ్యం, మేధస్సు, విషయం పరిజ్ఞానం వంటి అన్ని విషయాలలో రిషి సునాక్ మొదటి స్థానంలో ఉన్నారని అందరూ అంగీకరిస్తారు. సునాక్ వెనుకబడడానికి ఆయన పన్నులు పెంచడం, ఆయన భార్య ‘నాన్ – డొమిసైల్’ హోదా, కేబినెట్ మంత్రిగా ఉంటూ కూడా గ్రీన్ కార్డు కలిగి ఉండడం వంటి కొన్ని కారణాలు చెబుతున్నారు. అయితే ఆయన ఏ విషయంలో కూడా ఆ దేశంలోని చట్టాలను ధిక్కరించి వ్యవహరించక పోవడం గమనార్హం. అయితే చట్టపర అంశాలకన్నా రాజకీయ అంశాలు భిన్నమైనవి అనడంలో సందేహం లేదు. భారత దేశంలో సహితం దళితుల పట్ల ఇటువంటి వివక్ష అత్యున్నత స్థాయిలలో సహితం కొనసాగడం ఈ సందర్భంగా గమనార్హం. 1977లో జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మొత్తం 300 మంది ఎంపిలలో సుమారు 200 మంది (జనసంఘ్, లోక్‌దళ్) జగజీవన్ రామ్ పేరును ప్రధానిగా ప్రతిపాదించారు. ఆయనను ప్రధానిగా చేసుంటే ఐదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకొనేవారు. సమీప భవిష్యత్తులో గాంధీ కుటుంబం అధికారంలోకి రాకుండా ఆయన అడ్డుకోనేవారు. పరిపాలనా సామర్థ్యంలో ఆయన ఎవ్వరికీ తీసిపోరు. అయితే ఆయన దళితుడు కావడంతో ఆయన ప్రధాని కాలేకపోయారు. ‘అభిప్రాయ సేకరణ’ పేరుతో మొరార్జీ దేశాయ్‌ని ప్రధానిగా చేశారు. మొరార్జీ రాజీనామా తర్వాత తిరిగి జగజీవన్ రామ్‌కు అవకాశం వచ్చినా నాటి రాష్ట్రపతి సంజీవరెడ్డి పడనీయలేదు. దేశ చరిత్రలో మొదటిసారి ప్రధాన మంత్రి ఎవ్వరు అనే అంశంపై జరిగిన 1980 ఎన్నికలలో జగజీవన్ రామ్ కేవలం దళితుడు కావడంతో జనతా పార్టీ ఓటమి చెందింది. సమీప భవిష్యత్‌లో ఓ దళితుడు భారత ప్రధాని కాగలరని ఊహించే పరిస్థితులు ప్రస్తుతం లేవు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా దళితుల పట్ల ఈ విధమైన వివక్ష జరిగింది. ఇందిరా గాంధీ స్వయంగా ఎంపిక చేసి దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్యను చేస్తే ఆయనను గద్దె దింపేవరకు సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి నిద్రపోలేదు. పరిపాలన సామర్థ్యంలో ఆయన సహితం మరెవ్వరికీ తీసిపోలేరని అనడంలో సందేహం లేదు. ఆ తర్వాత కర్నూలు జనరల్ స్థానంలో ఆమె ఎంపి సీట్ ఇస్తే, కోట్ల విజయభాస్కరరెడ్డి పట్టుబట్టి మరీ ఓడించారు. దేశంలో ఓ అధికార పక్షంకు బంగారు లక్ష్మణ్ ను వాజపేయి అధ్యక్షునిగా చేస్తే, పార్టీలోనే సంకుచిత వర్గాలు పట్టుబట్టి ఆయన రాజకీయ సన్యాసం స్వీకరించేటట్లు చేశాయి. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా దళితులకు అలంకారప్రాయం గా పదవులు ఇస్తున్నాం గాని నిర్ణయాధికారం గల హోదాలు ఇవ్వడానికి మనం సిద్ధపడటం లేదు.
భారత్‌లో దళితుల పట్ల చూపుతున్న వివక్ష నేడు పాశ్చాత్య దేశాలలో ‘నల్లవారి’ పట్ల చూపుతున్నట్లు బ్రిటిష్ ప్రధాని ఎన్నికలు వెల్లడి చేస్తున్నాయి. అయితే కేవలం ‘తెల్లవాడు’ కాకపోవడం వల్లన రిషి సునాక్ ఆ దేశ ప్రధాని కాలేకపోతున్నారని ఆ దేశంలో మీడియా గాని, మరే పరిశీలకుడు గాని బహిరంగంగా ఒప్పుకొనే సాహసం చేయలేరు. అందుకు ఏవేవో కారణాలు చెబుతూ ఉంటారు. అన్ని విధాలా బ్రిటిష్ నాగరికతను వంటపట్టించుకున్నప్పటికీ తన హిందూ మూలాలను వదులుకోలేకపోవడంతో ఆయనను ఓ ‘విదేశీయుడు’గానే ఆ దేశ ప్రజలు చూస్తున్నట్లు అర్ధం అవుతుంది. సాంకేతికంగా, నాగరికతపరంగా పాశ్చాత్య దేశాలు ఎంతగా పురోభివృద్ధి చెందుతున్నప్పటికీ, వారి ప్రజల జీవన ప్రమాణాలు మిగిలిన దేశాలు అందుకోలేని స్థాయికి చేరుకున్నప్పటికీ వారు తమ వలసవాద సంకుచిత ధోరణులను మాత్రం విడనాడలేకపోతున్నారు. రిషి సునాక్ తదుపరి ప్రధానమంత్రి కాకపోతే, దేశానికి ‘చెడ్డపేరు’ వస్తుందని, ‘జాత్యహంకారంగా భావించబడుతుంది’ అని ఒక ప్రముఖ కన్జర్వేటివ్ దాత హెచ్చరించారు. అధికార పక్షానికి 1.3 మిలియన్ల పౌండ్ల విరాళం ఇచ్చిన రామి రేంజర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
సెప్టెంబర్ 5న ఫలితాలు వెలువడినప్పుడు బహుశా లిజ్ ట్రస్ ప్రధానిగా కావచ్చు. ఆమెకు గట్టి పోటీ ఇచ్చిన సునాక్‌కు విదేశీ వ్యవహారాలు లేదా హోం వంటి మరో కీలక మంత్రిత్వ శాఖను ఇచ్చి సంతృప్తి పరచే ప్రయత్నం చేయవచ్చు. ప్రధాన మంత్రి పదవి తర్వాత కీలకమైన నాలుగు మంత్రిత్వ శాఖలలో ఒకటి పొందవచ్చు. ఇప్పటికే ఆర్ధిక వ్యవహారాలు పర్యవేక్షించారు. ఏదేమైనా ఓ ‘నల్లవాడు’ ను తమ దేశపు ప్రధాన మంత్రిగా అంగీకరించడానికి బ్రిటిష్ సమాజం ఇంకా సిద్ధంగా లేదనే స్పష్టమైన సందేశం ఈ ఎన్నికల ద్వారా వెల్లడి చేసే అవకాశం ఉంది. ఏదేమైనా, సునాక్ బ్రిటన్‌లోని భారతీయ సమాజాన్ని దేశంలోని అత్యున్నత పదవికి చాలా దూరం తీసుకువచ్చారు. ఇది 1892లో ప్రారంభమైన ప్రయాణం. భారతదేశంపై బ్రిటిష్ వలస దోపిడీ గురించి ‘డ్రెయిన్ థియరీ’ రచించిన భారతీయ జాతీయవాది దాదాభాయ్ నౌరోజీ, సెంట్రల్ ఫిన్స్‌బరీకి లిబరల్ పార్టీ అభ్యర్థిగా నిలబడి మొదటిసారి గెలుపొందారు. మరో ఇద్దరు భారతీయ పార్సీలు, ఒకరు సామ్రాజ్యానికి అనుకూలమైన మాంచెర్జీ భౌనాగ్రీ, మరొకరు కమ్యూనిస్ట్ షాపుర్జీ సక్లత్వాలా కూడా 20వ శతాబ్దం ప్రారంభంలో ఎన్నికయ్యారు. అయితే, వారిలో ఎవరికీ ప్రత్యేకంగా సుదీర్ఘమైన లేదా ప్రముఖమైన పార్లమెంటరీ కెరీర్ లేదు. ఏ ఒక్కరు కూడా ప్రభుత్వంలో ప్రతిష్ఠాత్మకమైన పదవులను అధిరోహించలేదు. ఆ విధంగా రిషి సునాక్ చరిత్ర సృష్టించారని చెప్పవచ్చు.
Rishi Sunak out in front as UK PM Race