Sunday, December 22, 2024

అస్థిర సునామీలో సునాక్ ఓటమి

- Advertisement -
- Advertisement -

ఇప్పటి వరకు బ్రిటన్ ప్రధానిగా పాలించిన 44 ఏళ్ల రిషి సునాక్ ఓటమి వెనుక అనేక కారణాలు కనిపిస్తున్నాయి. తొలి భారత మూలాలున్న వ్యక్తిగానే కాక, తొలి హిందువుగా కూడా రికార్డు సృష్టించినప్పటికీ పదవిని చేపట్టే ముందు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకోవడంలో ఆయన విఫలమయ్యారన్న విమర్శలు బాగా వినిపించాయి. ఇదే ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. నిజానికి ఎన్నికలు డిసెంబర్‌లో జరగవలసి ఉన్నప్పటికీ ప్రజల్లో ఉన్న అసంతృప్తిని పసిగట్టి ముందస్తు ఎన్నికలకు సునాక్ సాహసించారు.

అయినా తనకు ఏమాత్రం విజయం కలసి రాలేదు. సునాక్ ప్రాతినిధ్యం వహించే కన్సర్వేటివ్ పార్టీకి ఓటమి ఖాయమని ఒపీనియన్ పోల్స్ ముందుగానే వెల్లడించాయి. అధికార కన్సర్వేటివ్ పార్టీకి 21 శాతానికి మించి ఓట్లు రావని, లేబర్ పార్టీకి 41 శాతం ఓట్లు ఖాయమని ముందుగానే అంచనా వేశాయి. రిఫామ్ పార్టీకి 16 శాతం, లిబరల్ డెమోక్రాట్లకు 12 శాతం ఓట్లు వస్తాయని చెప్పాయి. దీన్ని బట్టి ఒపీనియన్ పోల్స్ సరిగ్గానే ప్రజల నాడిని పసిగట్ట గలిగాయని చెప్పవచ్చు. ఆర్థిక సంక్షోభం కొన్నేళ్లుగా బ్రిటన్‌ను పట్టి పీడిస్తోంది. ముఖ్యంగా నిత్యావసర ధరలు భగ్గుమంటున్నాయి.

ఆర్థిక నిపుణుడై ఉండి కూడా ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దలేకపోయారని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను పటిష్ట పరుస్తానని తాజాగా ఆయన ఇచ్చిన హామీలను ఎవరూ నమ్మలేదు. ఇటీవల యూగవ్ తాజా సర్వేలో 52 శాతం మంది ఆర్థిక సమస్యలనే ప్రముఖంగా ప్రస్తావించడం గమనార్హం. ఆరోగ్య సమస్యలు తమ జీవితాలను కుంగదీస్తున్నాయని మరో 50 శాతం మంది తమ అభిప్రాయం వెల్లడించారు. కీలకమైన వలసదారులు, వారికి ఆశ్రయం కల్పించే విషయంలో కన్సర్వేటివ్ పార్టీ వైఖరిని 40% మంది తప్పుపట్టారు. ఈ సమస్యలన్నీ సునాక్ 20 నెలల పాలనకు ముగింపు పలికాయి. 14 ఏళ్లుగా అధికారంలో ఉన్న కన్సర్వేటివ్ పార్టీ విధానాలపై ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తిని లేబర్ పార్టీ అతి పెద్ద సానుకూల అంశంగా మార్చుకోగలిగింది.

‘పార్టీ కంటే దేశం ముందు’ అన్న నినాదంతో లేబర్ పార్టీ నాయకుడు స్మార్టర్ ముందుకు దూసుకు వెళ్లారు. ఈ నినాదం బ్రిటన్ పౌరులను అమితంగా ఆకట్టుకోగలిగింది. నిరుపేద కార్మిక కుటుంబం నుంచి వచ్చిన తనకు సామాన్యుల కష్టనష్టాలు తెలుసునని, ధరల భారాన్ని తగ్గించి సుపరిపాలన అందిస్తానని స్మార్టర్ ప్రజలకు నమ్మబలికారు. ఓటమికి తనదే పూర్తి బాధ్యత అని సునాక్ తన అంగీకారవేళ బహిరంగా ప్రకటించారు. అయితే ఇంతకు ముందు పాలన సాగించిన టోరీల తప్పిదాలకు ఆయన నిజంగానే బాధితుడు అయ్యారు. అత్యంత క్లిష్ట సమయాలలో దేశానికి పాలనపగ్గాలు చేపట్టాల్సి వచ్చిన ఈ టోరీ నేత తరచూ, చివరికి ముందస్తు ఎన్నికల వరకూ కూడా దీర్ఘకాలిక అధికార పార్టీ పట్ల ప్రజల నుంచి వ్యక్తం అవుతూ వచ్చిన అసంతృప్తిని, నిరసనలను ఎదుర్కొవల్సి వచ్చింది. కన్సర్వేటివ్ పార్టీ బ్రిటన్ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో అత్యల్ప స్థానాలతో ఇంటిబాట పట్టడానికి పలు కారణాలు ఉన్నాయి.

ప్రత్యేకించి ఈ పార్టీ పట్ల ప్రజలలో నెలకొన్న నిరాసక్తత, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పార్టీ వల్ల తమ పరిస్థితి గట్టెక్కే అవకాశం లేదనే దృఢమైన అభిప్రాయం నాటుకుపోవడం కీలకం అయింది. పైగా బ్రిటన్‌లో ఏ పార్టీ కూడా వరుసగా ఐదో సారి అధికారం చేపట్టలేదు. ఇక్కడ రెండు ప్రధాన పార్టీల మధ్య ప్రతి 10 నుంచి 15 ఏళ్లకు ఓసారి అధికార మార్పిడి జరిగే తంతు చోటు చేసుకొంటోంది. టోరీలు తీసుకున్న నిర్ణయాలు అనేకం దేశ ఆర్ధిక వ్యవస్థ మరింత మందగించేలా చేశాయనే విమర్శలు ఉన్నాయి. సంక్షుభిత ప్రపంచంలో తమ దేశపు స్థానం నానాటికీ దిగజారిపోవడం, అంతర్జాతీయంగా దేశం దిగదుడుపు పాత్రను పోషించే స్థితిలో ఉండటం వంటివి సహజంగానే మేధోవంతులుగా ఆలోచించి, సకాలంలో తగు నిర్ణయాలు తీసుకునే బ్రిటిషర్లలో నెలకొంది.ప్రత్యేకించి పన్నుల భారం సామాన్యుడు, మధ్యతరగతి, వేతన జీవులకు తీరని ఆక్రోశాన్ని మిగిల్చాయి. ఇక బ్రిటన్‌కు లెక్కకు మించిన వలసలు కూడా రాజకీయ అంశాలను ప్రభావితం చేశాయి.

వలసల పరిణామం నేపథ్యంలోనే నిగేల్ ఫరేజ్ ఓ నేతగా ఎదిగి ఆయన సారథ్యంలో ఏకంగా రిఫార్మ్ యుకె అనే పార్టీ ఆవిర్భవించింది. ఈ ఎన్నికల్లో నిగేల్ తొలిసారి విజయం సాధించారు.ఈ పార్టీ ఎన్నికల్లో దాదాపు 15% ఓట్లు సంపాదించుకుంది. ఇది చివరికి సునాక్ పార్టీకే షాక్ ఇచ్చింది. బ్రెగ్జిట్ తరువాతి పరిణామాలు, ప్రత్యేకించి జీవన వ్యయం పెరగడం, కొవిడ్ అంతకు ముందటి దశల్లో చోటు చేసుకున్న స్కామ్‌ల దుష్ఫలితాలను రిషి మౌనంగానే భరించి ఇప్పుడు టాటా వీడ్కోలు చెప్పాల్సిన స్థితికి చేర్చింది. అన్నింటికి మించి అంతకు ముందటి ప్రధాని బోరిస్ జాన్సన్ కొవిడ్ లాక్‌డౌన్ వేళల్లో విందులు, వినోదాలు, సామూహిక సభలకు దిగడం వంటివి కూడా బ్రిటిషర్ల నుంచి ఇదేమీ నాన్సెస్ అనుకునే స్థితికి తీసుకువచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News