భారతీయత గర్వకారణమన్న నేత
వంద ఎకరాల ఆధ్యాత్మిక క్షేత్రానికి రాక
మంత్రోచ్ఛారణల నడుమ స్వామికి అంజలి
న్యూఢిల్లీ : జి20 సమ్మిట్ చివరి రోజు ఆదివారం బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇక్కడి ప్రఖ్యాత హిందూ దేవాలయం అక్షరధామ్‌ను సందర్శించారు. ఆయన వెంబడి భారతీయురాలైన భార్య అక్షత మూర్తి కూడా ఉన్నారు. ఇక్కడ సంప్రదాయం ప్రకారం దంపతులు పూజాదికాలు, అభిషేకం నిర్వహించారు. ఆలయంలో ఉన్న దశలో రిషి కొద్ది సేపు అక్కడి పూజార్లు, స్వామిజీలతో ముచ్చటించారు. జి 20 సదస్సుకు వచ్చిన తనకు ఇక్కడి ఏదో ఒక ఆలయం చూడాలని ఉందని ముందుగానే రిషి సునాక్ తెలిపారు. ఈ మేరకు అక్షరధామ్ సందర్శన ఖరారు అయింది. ఆదివారం తెల్లవారుజామున ఆరున్నరకు వీరిరువురూ ఆలయానికి వచ్చారు.
ముందుగా పూజారులు, ఆలయ నిర్వాహకులు వీరిని ఆవరణ అంతా చూపించారు. వంద ఎకరాల విస్తీర్ణంలో విస్తరించుకుని ఉన్న స్వామినారాయణ్ అక్షరధామ్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేదిక గురించి సమాచారం అందించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రిషి సునాక్ భారతదేశ పర్యటనకు రావడం ఇదే తొలిసారి. తన భారతీయ మూలాల పట్ల గర్వంగా ఉందని, భారతదేశంతో తన అనుబంధాలు, పూర్వీకులు ఇక్కడి వారు కావడం ఆనందదాయకం అని బ్రిటన్ ప్రధాని తెలిపారు. ఈ దశలో బ్రిటన్ ప్రధాని తాను సగర్వ హిందువును అని సంబోధించారు. తాను సర్వదా భారత ప్రజలకు కట్టుబడి ఉంటానని సవినయంగా తెలిపారు. హిందువుగా గర్విస్తున్నానని అంటే ఇక్కడి ప్రజలు, ఈ దేశంతో సంబంధ బాంధవ్యాలకు ఎల్లవేళలా విలువ నిస్తున్నట్లే అని స్పష్టం చేశారు. ప్రధాని సునాక్ అక్షరధామ్ ఆలయం సందర్శన, ఆయన వ్యాఖ్యలను ఇక్కడి బ్రిటిష్ హై కమిషన్ వర్గాలు ట్వీట్ చేశారు. అక్షరధామ్‌లో స్వామినారాయణ్ మూర్తి ముందు నిల్చుని రిషి సునాక్ దంపతుల హారతి అంజలి ఘటించారు.
తరువాత ఆలయం వెలుపల ఫోటోలుదిగారు. వీరి వెంట కుటుంబ సభ్యులు కూడా కొందరు ఉన్నారు. చిరుజల్లులు పడుతూ ఉండగా రిషి సునాక్ అక్షత ఆలయం ఆవరణలో ఫోటోలు దిగడం, ఆయన మెడలో అర్చకులు వేసిన పూదండ సంబంధిత చిత్తరువులు ఇప్పటికే బ్రిటన్‌లో అందరిని ఆకట్టుకుంటున్నాయి. వీటికి భారతీయుల నుంచి విశేష స్పందన వెలువడింది. జి 20కి రాగానే రిషి సునాక్ తను ఈ దేశ అల్లుడిని అని ప్రకటించుకున్నారు. ఆయన భార్య అక్షత మూర్తి భారతదేశపు దిగ్గజ కోటీశ్వరులు, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి, ఫిలాంత్రపిస్టు, విద్యావేత, రచయిత్రి సుధామూర్తి కూతురు. లండన్‌లో విద్యాభ్యాసం దశలో వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.