బ్రిటన్ ప్రధాని సునాక్ హెచ్చరిక
వీధుల్లో తీవ్రవాదుల నిరసనల హైజాక్‌కు ఖండన
లండన్ : బ్రిటన్ రాజకీయాలలో విష సంస్కృతి పెచ్చుమీరుతున్నదని బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ హెచ్చరించారు. ఇజ్రాయెల్- గాజా పోరుకు సంబంధించి కామన్స్ సభలో తమ వోటింగ్ ఉద్దేశాలపై పార్లమెంట్ సభ్యులు భద్రత ముప్పు ఎదుర్కొంటున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో సునాక్ ఈ హెచ్చరిక చేశారు. ఉగ్రవాదాన్ని పొగిడేందుకు దేశంలోని వీధుల్లో నిరసనలను తీవ్రవాదులు హైజాక్ చేయడాన్ని ఖండించేందుకు 43 ఏళ్ల బ్రిటిష్ భారత సంతతి నేత సునాక్ ఒక ప్రకటన విడుదల చేశారు.
ముగ్గురు అజ్ఞాత మహిళా ఎంపిలు తమ భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేసిన తరువాత వారికి అదనపు భద్రత మంజూరైనట్లు ‘ది సండే టైమ్స్’లో ఒక వార్త ప్రచురితమైన నేపథ్యంలో ఆయన ఆ ప్రకటన చేశారు. ‘ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు, పొగిడేందుకు తీవ్రవాదులు చట్టబద్ధమైన నిరసనలను హైజాక్ చేయడం, ఎన్నికైన ప్రతినిధులను మౌఖికంగా బెదరించడం, శారీరకంగా, దౌర్జన్యపూరితంగా లక్షం చేసుకోవడం, జాతి వ్యతిరేక వ్యాఖ్యలు మన సొంత పార్లమెంట్ భవనంలోకి ప్రసారం చేశారు’ అని సునాక్ తన ప్రకటనలో తెలిపారు.
గాజా కాల్పుల విరమణ వోటుపై క్రితం వారం కామన్స్ సభలోని గందరగోళ దృశ్యాల గురించి సునాక్ ప్రస్తావిస్తూ, ‘ఈ తరహా బెదరింపు పని చేస్తుందనే అత్యంత ప్రమాదకర సంకేతాన్ని పార్లమెంట్‌లో ఈ వారం పంపారు. ఇది మన సమాజంలో, రాజకీయాలలో విష సంస్కృతి, బ్రిటన్‌ల మనకు ప్రీతిపాత్రంగా పరిగణించే హక్కులకు, విలువలకు ముప్పు’ అని వ్యాఖ్యానించారు.