Friday, November 22, 2024

బుసలు కొట్టి కాటేస్తున్న కరోనా

- Advertisement -
- Advertisement -

Rising coronavirus deaths

గత సంవత్సరం ఈ సమయంలో భారతదేశమే కాదు.. ప్రపంచం మొత్తం ఒక చెరసాలగా మారిపోయి ఉంది. రోడ్ల మీదికి రావాలంటే జనం గజగజ వణికిపోయారు. కరో నా భూతం ఎక్కడ పొంచి ఉన్న దో, ఏ పొదల మాటున దాక్కున్నదో, ఏ క్షణం మీదపడి ప్రాణం తీస్తుందోనని భయపడుతూ ఆ మృత్యుదేవత కోరల్లో చిక్కి దిక్కుమాలిన చావు చావడం కన్నా, గంజి తాగుతూ ఇంట్లో కూర్చోవడం ఉత్తమం అంటూ తలుపులు బిగించుకుని ఇళ్లలో కూర్చున్నారు. పొరపాటున ఎవరైనా రోడ్ల మీద కనిపిస్తే లాఠీలు విరిగేట్లు కొట్టారు పోలీసులు. ఈ రోజు వంద కేసులు, నాలుగు మరణాలు అనే వార్త టివిలో కనిపించగానే భయంతో బిక్కచచ్చిపోయారు.

సమీప బంధువుల ఇళ్లలో మరణాలు సంభవించాయన్నా కనీసం వెళ్లి పరామర్శించడానికి కూడా సాహసించ లేదు. పెళ్లిళ్లు చేసుకుంటే యాభై మంది, అంత్యక్రియలకు ఇరవై మంది అంటూ ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. ఆ కొద్ది సంఖ్యలో హాజరైన వారికీ కరోనా సోకిన ఉదంతాలు ఉన్నాయి. వీధి వీధికి ముళ్ల కంచెలు… రాష్ట్ర రాష్ట్రానికి మధ్య ఇనుప కంచెలు… దేశ సరిహద్దుల మూసివేత, విమానాలు బంద్, బస్సులు, రైళ్లు బంద్, సినిమా హాళ్లు, దుకాణాలు, బార్లు, హోటళ్లు, కిరాణా షాపులు, ఒకటేమిటి… సకలం బంద్.. ఒక్క ఆసుపత్రులు, మెడికల్ షాపులు మినహా. ఇదంతా ఎప్పుడు? రోజుకు వందా రెండు వందల కేసులు నమోదు అవుతున్నప్పుడు. ఈ కొవిడ్ భూతం డిసెంబర్ నాటికి కొంచెం చల్లబడింది.

మరి ఇప్పుడు? గత నెల రోజులుగా కరోనా రెండో దశ మొదలైంది. మొదలైన పది రోజులకే కేసులు దేశ వ్యాప్తంగా లక్షల్లో నమోదు అవుతున్నాయి. రాష్ట్రాల్లో రెండు వేల నుంచి పది వేల కేసులు బయటపడుతున్నాయి.మరణాలు డజన్ల సంఖ్యను మించిపోయాయి. అయినప్పటికీ ప్రభుత్వాలు నిరుడు అమలు చేసిన ఆంక్షలు నేడు పట్టించుకోవడం లేదు. లాక్‌డౌన్, కర్ఫ్యూలు ఉండవు అని ప్రకటిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు, కళాశాలలు మూసేశారు.కొన్ని రాష్ట్రాల్లో నడుస్తున్నాయి.వైన్ షాపులు, బార్లు బార్లా తెరుచుకున్నాయి. సినిమా హాళ్ళకు అనుమతులు ఇచ్చేశారు. ఏ వ్యాపార కార్యకలాపాల మీదా నిషేధాలు లేవు. ‘మాస్కులు వాడండి, శానిటైజర్లు ఉపయోగించండి మీ జాగ్రత్తలో మీరుండాలి. కరోనా వస్తే డోలో వేసుకోండి… లాక్‌డౌన్ అంటే ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలుతుంది’ అని నిర్మొహమాటంగా కేంద్రం, రాష్ట్రాలు కూడా ప్రకటించాయి. పైగా అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.

కొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. కరోనా పేరు చెప్పి ఎన్నికల వాయిదాను కోరుతూ కొన్ని పార్టీలు కోర్టుకు వెళ్తే తిరస్కరిస్తున్నాయి కోర్టులు. విచ్చలవిడిగా రాజకీయ సభలు జరుగుతున్నాయి. పార్టీలు నిర్వహిస్తున్న మీటింగులకు తండోపతండాలుగా జనం హాజరవుతున్నారు. భౌతిక దూరం పాటించడం లేదు. ఒకరిమీద మరొకరు పడి తోసుకుంటున్నారు, నెట్టుకుంటున్నారు. ఇక మాస్కులు అనేవి గడ్డాలకు అలంకారంగా మారిపోయాయి. మూతీ ముక్కులు మూసుకోవడం లేదు. ఆడా మగా భేదం లేకుండా మాస్కులను అజాగళస్తనాల మాదిరిగా వాడుకుంటున్నారు.
కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా జనం పట్టించుకోవడం లేదు.దూరంగా పోలీసులు కనిపిస్తే జరిమానాను తప్పించుకోవడానికి గడ్డానికి వేలాడుతున్న మాస్కును పైకి జరుపుకోవడం, పోలీసులను దాటగానే మళ్ళీ కిందికి జరుపుకోవడం కనిపిస్తున్నది.

కొన్ని నగరాల్లో ఎంత వసూలు చెయ్యాలో పోలీసులకు టార్గెట్లు విధించారు. దాంతో పోలీసులు లాఠీలు ఝళిపించకుండా, చలానాలు ఇచ్చేసి భుజం తట్టి పంపిస్తున్నారు. ఆ సమయంలో పర్సులో డబ్బు లేకపోతే తరువాతైనా చెల్లించే మహత్తర అవకాశం కల్పించారు. మాస్క్ అంటే ఫలానా మాస్క్ వాడాలని నిబంధన ఏమీ లేదు. పోలీసులు కనిపిస్తే జేబు రుమాలు కూడా మాస్క్ లా మారిపోతుంది కాసేపు!రద్దీ ప్రదేశాల్లో ఎక్కడా భౌతికదూరం అనేది మచ్చుకు కూడా కనిపించడం లేదు. గతంలో మాదిరిగా షాపుల వారు కూడా వినియోగదారులను హెచ్చరించడం లేదు. గతేడాది ఈ కరోనా ఆంక్షల కారణంగా లక్షలాది మంది తమ ఉపాధిని, ఉద్యోగాలను కోల్పోయారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వందలాది కిలోమీటర్ల దూరాన్ని ఎర్రని ఎండల్లో కాలినడకన ప్రయాణించారు వలసకార్మికులు. ఆ క్రమంలో దారిలోనే మరణించినవారు వేలల్లో ఉన్నారు. కరోనా కారణంగా ఆర్ధికంగా కుదుపునకు లోనయ్యేవారిని ఏ ప్రభుత్వాలైనా ఎంతకాలం భరించగలవు? అందుకే ఈసారి అలాంటి తీవ్ర చర్యలకు దిగడానికి కేంద్రంతో సహా రాష్ట్రాలు కూడా వెనకడుగు వేస్తున్నాయి.

దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. మొదట్లో రెండు నెలల పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగినప్పటికీ, క్రమంగా అవసరానికి తగిన సరఫరా లేక ప్రక్రియ మందగించింది. చాలా ఆసుపత్రుల ముందు క్యూలు కనిపిస్తున్నప్పటికీ సరఫరా లేకపోవడంతో యాజమాన్యాలు చేతులెత్తేశాయి. ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సుమారు నలభై లక్షల డోసులు కావాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తే వారు ఎనిమిది లక్షల డోసులు మాత్రమే సరఫరా చేయగలిగారంటే కేంద్రం కూడా తన నిస్సహాయతను ప్రకటించినట్లే అని అర్ధం చేసుకోవాలి. అంటే వంద మందిలో ఇరవై మందికి మాత్రమే వాక్సిన్ అందుబాటులో ఉన్నదని అర్ధం. మరి ఇలాగైతే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా వేగం పుంజుకుంటుంది? ఇది కేంద్రం అసమర్ధతనే అనుకోవాలి.

మరొక విడ్డూరం ఏమిటంటే వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నప్పటికీ కొందరికి పాజిటివ్‌గా తేలుతున్నది. దీంతో వ్యాక్సిన్ పనితనం మీద చాలామందికి సందేహాలు పొడసూపుతున్నాయి. అయితే వ్యాక్సిన్ వేయించుకున్న వారికి పాజిటివ్ వచ్చినా ప్రాణప్రమాదం ఉండదని, ఇంట్లో విశ్రాంతి తీసుకుంటే చాలని ప్రభుత్వాలు అభయం ఇస్తున్నాయి.పైగా వైద్యులు కూడా రకరకాలుగా వ్యాక్సిన్ గూర్చి చెబుతున్నారు. కొన్నికొన్ని రకాల మందులు వాడే వారు వ్యాక్సిన్ వేయించుకోవద్దని కొందరు చెబుతుంటే, ఎలాంటి సంకోచాలు లేకుండా అందరూ వేయించుకోవచ్చని మరి కొందరు చెబుతున్నారు.

వాక్సిన్ వేయించుకునే సమయంలో షుగర్, బిపి నియంత్రణలో ఉండాలని కొందరు సూచిస్తుంటే, వాటి నియంత్రణకు వ్యాక్సినేషన్‌కు ఎలాంటి సంబంధం లేదని మరికొందరు ప్రకటిస్తారు! వీరిలో ఎవరి మాట విశ్వసించాలో తెలియక అనేక మంది బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత జ్వరం, ఒళ్ళు నొప్పులు లాంటివి రావడం వ్యాక్సిన్ ప్రభావం పని చేస్తున్నదని చెప్పడానికి నిదర్శనం అని కొందరు డాక్టర్లు చెబుతుంటే, అందరికీ అలా రావాలని రూల్ లేదని మరికొందరు చెబుతున్నారు.

ఎలాంటి రియాక్షన్ లేకపోతే వ్యాక్సిన్ పని చెయ్యనట్లు అని అర్థమా అని కొందరు సందేహరాయుళ్లు ప్రశ్నిస్తున్నారు. ఏమైనప్పటికీ కరోనా భూతం నుంచి కాపాడుకోవడానికి స్వీయ నియంత్రణలే మార్గం అని అందరూ ఒప్పుకుంటున్న సత్యం. వీధిలోకి వెళ్ళినపుడు మాస్క్‌ను తప్పనిసరిగా ధరించాలి. గడ్డానికి కాదు… మూతీచ ముక్కు కవర్ అయ్యేట్లు సుమా! అలాగే ఏ వస్తువును ముట్టుకున్నా విధిగా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. బజార్ నుంచి రాగానే బట్టలు మొత్తం విప్పేసి స్నానం చెయ్యడం ఉత్తమోత్తమం. మన రక్షణ బాధ్యత మనదే. కరోనా ఎన్నటికీ తనంతట తాను మన జోలికి రాదు. మనం ఆహ్వానిస్తే తప్పకుండా మన్నిస్తుంది! తస్మాత్ జాగ్రత్త!

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News