Friday, November 22, 2024

క్రూడ్ ధరల దడ

- Advertisement -
- Advertisement -

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర మళ్ళీ పెరుగుతోంది. బ్యారెల్ 150 డాలర్లకు చేరిపోయిన ఒకప్పటి సంక్షోభం గుర్తుకు వస్తోంది. ప్రస్తుతం 90 డాలర్లకు పైనే వున్న మనం వాడే బ్రెంట్ రకం క్రూడాయిల్ ధర త్వరలో వంద డాలర్లకు చేరుకోనున్నదని తెలుస్తున్నది. వచ్చే వేసవి నుంచి క్రూడాయిల్ ధరలు 30% పెరుగుతాయని నిపుణులు జోస్యం చెబుతున్నారు. డీజెల్ ధరలు విజృంభించి కీలక సరకుల రవాణా ఖర్చు తడిసిమోపెడై సామాన్యుల జీవితాలు మరింత దుర్భరం కానున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర అంతకు ముందరి 10 మాసాల కాలంలో ఎప్పుడూ లేనంతగా గత సెప్టెంబర్‌లో బ్యారెల్ 93 డాలర్లు దాటిపోయింది. ఆగస్టులో ఇది 86 డాలర్ల వద్దే వుంది. డాలర్‌తో రూపాయి విలువ బాగా పతనమై ఇప్పటికే రూ. 83.06కు చేరుకొంది. మనం కొనుగోలు చేస్తున్న క్రూడాయిల్‌కు డాలర్లలోనే చెల్లిస్తున్నందున క్రూడ్ ధర అటకెక్కడంతో డాలర్‌తో మన రూపాయి మరింతగా విలువ కోల్పోతుంది. మన వాణిజ్య లోటు విపరీతంగా పెరిగిపోతుంది. మనం కొనుగోలు చేస్తున్న క్రూడాయిల్ ధర బ్యారెల్ వద్ద 10 డాలర్లు పెరిగితే మన వాణిజ్య లోటు 1415 బిలియన్ డాలర్లు ఎగబాకుతుంది. ఇది దేశంలో ధరలపై ఎంతటి దుష్ప్రభావం చూపుతుందో చెప్పనక్కర లేదు.

ఆయిల్ ప్రియమవుతున్న కొద్దీ మన విదేశీ మారక నిల్వలు కూడా అడుగంటడం మొదలవుతుంది. ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. దాన్ని అదుపులో వుంచడానికి రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు మళ్ళీ పెంచుతుంది. ఆ ప్రభావంతో బ్యాంకుల రుణాల ఖరీదయిపోయి వ్యాపారుల పెట్టుబడులు పరిమితమవుతాయి. స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) వృద్ధి దెబ్బతింటుంది. క్రూడాయిల్ ధరలు పతనం కాకుండా చూసుకోడానికి ఆయిల్ ఉత్పత్తి (ఒపెక్) దేశాలు ఉత్పత్తిని తగ్గించడంతో గత జూన్ నుంచి బ్రెంట్ క్రూడాయిల్ ధర 25% పెరిగిపోయింది. తన ఉత్పత్తిని రోజుకి 10 లక్షల బ్యారెళ్ళ మేరకు తగ్గించుకోనున్నట్టు సౌదీ అరేబియా జూన్‌లో ప్రకటించింది. జులైలో రష్యా కూడా అదే పని చేసింది. ఇండియాలో వినియోగిస్తున్న ఆయిల్‌లో 87% దిగుమతి చేసుకొంటున్నదే. ప్రపంచ వ్యాప్తంగా రోజుకి 100 మిలియన్ బ్యారెళ్ళ ఆయిల్ వినియోగమవుతున్నది. ఉక్రెయిన్ యుద్ధం, దాని పర్యవసానాల కారణంగా రష్యా నుంచి మనకు చవకగా లభిస్తూ వచ్చిన క్రూడాయిల్ కూడా అంతర్జాతీయ రేటు పెరగడంతో మనకిప్పుడు ఖరీదయిపోయింది. ఒపెక్ దేశాలన్నీ కలిసి రోజుకి 3.66 మిలియన్ల బ్యారెళ్ళ మేరకు ఆయిల్ ఉత్పత్తిని తగ్గించుకొన్నాయి.

ఈ దేశాల్లో సౌదీ అరేబియా అతి ఎక్కువ ఆయిల్ ఉత్పత్తి దేశం కాగా, రష్యా రెండోస్థానంలో వుంటుంది. రష్యా ఒక్కటే రోజుకి 3 లక్షల బారెళ్ళ మేరకు ఉత్పత్తిని కుదించుకొన్నది. ఒపెక్ ఉత్పత్తి తగ్గింపు 2024 సంవత్సరాంతం వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఆయిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలన్న ఆరాటం పెరుగుతున్నప్పటికీ ఇప్పట్లో అది సాధ్యంకాకపోయే ప్రమాదమే కనిపిస్తున్నది. ఎలెక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచి, పెట్రోల్‌లో ఇథనాల్‌ను, మెథనాల్‌ను కలపడం ద్వారా క్రూడాయిల్ అవసరాన్ని తగ్గించుకోవాలనే కృషి కూడా పూర్తిగా ఫలించే అవకాశాలు తక్షణమే కనిపించడం లేదు. దేశంలో ఇప్పటికే లీటరు వంద రూపాయలు దాటిపోయిన పెట్రోల్, డీజెల్ ధరలు ముందు ముందు ఎక్కడికి చేరుకొంటాయో ఊహించడానికే భయం వేస్తున్నది. త్వరగా దూసుకు వస్తున్న ఎన్నికలను దృష్టిలో వుంచుకొని ఇటీవల గృహ వినియోగ వంట గ్యాస్ ధరను తగ్గించిన కేంద్రం కార్లలోనూ, ఇతర అనేక పారిశ్రామిక రంగాలలోనూ వినియోగించే వాణిజ్య వంట గ్యాస్ ధరను పెంచింది. ఓటర్లను బుజ్జగించడం కోసం పెట్రోల్, డీజెల్ ధరలను కూడా కేంద్రం తగ్గించే అవకాశమున్నదని ఈ మధ్య వరకు ఆశించాము.

కాని అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధర భయపెడుతున్న నేపథ్యంలో ఆ అవకాశాలు అడుగంటినట్లే భావించాలి. ఉక్రెయిన్ యుద్ధం చల్లారితే రష్యాకు, యూరపు దేశాలకు మధ్య సంబంధాలు మెరుగుపడితే, రష్యాపై అమెరికా ఆంక్షలు తొలగితే పరిస్థితుల్లో గణనీయమైన మెరుగుదల సాధ్యం కావచ్చు. అది జరిగేది ఎప్పుడు? దేశ ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ ప్రాబల్య శక్తుల ప్రయోజనాలకు అనుగుణంగా నడిపించడం మన పరాధీనతను విపరీతంగా పెంచివేసింది. క్రూడాయిల్ దిగుమతుల మీద ఆధారపడ్డాన్ని వీలైనంత మేరకు తగ్గించుకోడమే మనకు శరణ్యం. దేశంలో ఇథనాల్, మెథనాల్ ఉత్పత్తిని పెంచుకోడం మీద దృష్టి సారించవలసి వుంది. అలాగే బయటి నుంచి తెచ్చుకొనే క్రూడాయిల్ వినియోగంతో నిమిత్తం లేకుండా ఏయే రంగాల్లో దేశీయ ఇంధనాల వాడకం సాధ్యమో అన్వేషించి అందుకు తగినట్టు మన పద్ధతులను మార్చుకోడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News