Monday, December 23, 2024

పెరుగుతున్న వరకట్న మరణాలు

- Advertisement -
- Advertisement -

యుగాలు గడిచే కొద్దీ పురుషుడు స్త్రీ ధనం మీద ఆధారపడ సాగాడు. ఆ ప్రయత్నంలో అదనపు కట్నం కోసం భర్త అత్తమామలను వేధించడం, భార్యను హింసించడం, వారు ఆత్మహత్య చేసుకోవడం జరుగుతోంది. స్త్రీ సాధికారత అభివృద్ధి పథంలో పయనిస్తున్నా వరకట్న ఆచారం ఇంకా ఉంటూనే వున్నది. అయితే జీవన ప్రమాణాలు పెరిగాయి. పురుషుడుకి వున్న విద్య, ఉద్యోగ అవకాశాలు స్త్రీకి కూడా వుంటున్నాయి. వరకట్నం అంటే పెళ్ళి కూతురు తల్లిదండ్రులు పెళ్ళి కొడుకు తల్లి దండ్రులకి భూమి, నగలు, డబ్బులు ఇచ్చే సంప్రదాయం. నూతన దంపతులకు ఆర్థికంగా బలం చేకూర్చడము. ఈ ప్రాచీన సంప్రదాయం కేవలం భారత దేశంలోనే కాక పాకిస్థాన్, గ్రీసు, రోమన్, శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాలలో కూడా వున్నది. దీని వల్ల చాలా మంది పేదవాళ్లు వారి పిల్లలకు పెళ్లి చేయడం కష్టంగా మారింది. దీనితో వారు పిల్లలకు చిన్నతనంలోనే పెళ్లి చేసేవారు. దీని వలన వరుని కుటుంబీకులు వధువుని హింసించి ఇంకా ఎక్కువ ధనం మీద ఆశతో వారి పుట్టింటికి పంపించి ధనం తీసుకు రమ్మని వేధించేవారు.

అలా ఆ మహిళ కూడా వారి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి ఎంతో కొంత ధనాన్ని తీసుకు వచ్చి అత్తవారి ఇంట్లో ఇచ్చేది. ఇచ్చినప్పుడు మాత్రమే మంచిగా చూసుకుని, ధనాన్ని తీసుకు రానప్పుడు మహిళలను మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టేవారు. 1983లో వరకట్నాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసినప్పటికీ వరకట్న హత్యలు జరుగుతున్నాయి. అత్తింటి వేధింపులు వున్న వరకట్న బాధితురాలు తన మెట్టినింటి వారుండే ప్రాంతంతో పాటు పుట్టింటి వారుండే ప్రాంతంలోనూ ఐపిసి 498ఎ కేసులను నమోదు చేయవచ్చని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. సెక్షన్ ఐపిసి 498ఎ ప్రకారం ఏ సాక్ష్యాలు విచారించకుండా భర్త, అత్త మామలను, ఆడపడుచులను 3 సంవత్సరాలు జైల్లో వేయడం జరుగుతున్నది. దేశంలో రోజు రోజుకు సుమారుగా 18 వరకట్న మరణాలు సంభవిస్తున్నాయని ఎన్‌సిఆర్‌బి నివేదిక వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌లో ఈ మరణాలు ఎక్కువగా వున్నట్లు తెలిపింది. గత ఏడాది దేశ వ్యాప్తంగా మొత్తం 6516 వరకట్న మరణాలు సంభవించగా, వీటిలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు ముందున్నాయి. వీటిలో భర్తనుంచి వేధింపులే అధికంగా వున్నాయి.

తెలంగాణలో గత ఏడాది 137 మరణాలు నమోదయ్యాయని ఎన్‌టిఆర్‌సి తెలిపింది. తెలంగాణలో మహిళల భద్రత కోసం ఉమెన్స్ సేఫ్టీ వింగ్ సత్ఫలితాలను ఇస్తున్నది. తెలంగాణ వ్యాప్తంగా వున్న భరోసా కేంద్రాలు షీ టీమ్స్ కు వరకట్న వేధింపులపై వచ్చినటువంటి ఫిర్యాదులను సేఫ్టీవీక్ చాకచక్యంగా వ్యవహరిస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నది. మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి వారికి కఠిన శిక్షలు విధించి కటకటాల వెనక్కి పంపుతుండడంతో క్రమంగా నేరాలు తగ్గుముఖం పట్టాయి. మహిళలు పని చేసే ప్రదేశాల్లో కూడా వేధించే వారికి సాహస్ అనే విభాగాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా వేధించేటటువంటి వారికి కఠినమైన శిక్షలు వేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. లైంగిక వేధింపులు అత్యధికంగా జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ముందు వరసలో వున్నాయి. వీటితో పాటు లైంగిక దాడులు సైతం దేశ వ్యాప్తంగా భారీగా పెరిగాయి. రాజస్థాన్‌లో 5399 కేసులు, ఉత్తరప్రదేశ్‌లో 3690, మధ్యప్రదేశ్‌లో 3029, మహారాష్ట్రలో 2904, హర్యానాలో 1787, ఒడిశాలో 1464, జార్ఖండ్‌లో 1298, చత్తీస్‌గఢ్‌లో 1246 కేసులు నమోదయ్యాయి. తక్కువగా నమోదు అయినటువంటి రాష్ట్రాల సరసన నిలిచింది తెలంగాణ రాష్ట్రం.

తెలంగాణలో 814 కేసులు నమోదయ్యాయి. వరకట్న మరణాల విషయాని కొస్తే ఉత్తరప్రదేశ్‌లో 2142, బీహార్‌లో 1057, మధ్యప్రదేశ్‌లో 520, రాజస్థాన్‌లో 451, పశ్చిమ బెంగాల్‌లో 427, ఒడిశాలో 263, హర్యానాలో 234, తెలంగాణలో 137 మరణాలు జరిగాయని ఎన్‌సిఆర్‌బి నివేదిక తెలిపింది. దేశంలో మొత్తంగా గత ఏడాది 6,516 వరకట్న మరణాలు జరిగాయి. ఇవే కాకుండా లైంగిక వేధింపుల కేసుల ద్వారా పని ప్రదేశాల్లో మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాల వల్ల అనేక మంది మరణించారు.ముఖ్యంగా మహిళలపై వేధింపులు తగ్గేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలను అమలు చేయాలి. అప్పుడే వరకట్నం మరణాలు, వేధింపులు తగ్గుతాయి. మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారికి కఠిన శిక్షలు అమలు పరిచాలి. అలా చేసినప్పుడే మహిళలు సమాజంలో స్వేచ్ఛగా తిరగగలుగుతారు. స్వేచ్ఛగా పని చేసుకోగలుగుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News