Thursday, January 23, 2025

పొంగుతున్న ‘పాల ధర’

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఈ వర్గం ఆ వర్గం అన్నతేడా లేకుండా.. వయసులతో నిమిత్తం లేకుండా పసిపిల్లల నుంచి పండు ముదుసళ్ల దాక అందరికీ అత్యంత పోషక విలువలతో కూడిన ఆహారం అందించే పాల ఉత్పత్తుల ధరలు సామన్యుడికి అందనంత ఎత్తకు పెరిగిపోతున్నాయి. ఏడాదిలో ఇప్పటికే నాలుగు సార్లు పెరిగిన పాల విక్రయ ధరలు పేద మద్యతరగతి కుటుంబాలకు భారంగా మారుతున్నాయి. మదర్‌డెయిరీ లీటరు రూ.2పెంచి రూ.64కు చేర్చింది. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ కూడా లీటరు రూ.2పెంచింది. కర్నాటక మిల్క్ ఫెడరేషన్ కూడా లీటరుపాలపైన రూ.2పెంచింది. అయితే ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాక అమలును నిలిపివేసింది. హైదరాబాద్‌లో లీటరు పాలు కొనుగోలు చేయాలంటే రూ.60 చెల్లించాల్సివస్తోంది. పెరుగుతున్న పాల ధరలతో పోటీ పడలేక సామాన్యులు పాల వినియోగాన్ని తగ్గించుకుంటూ సర్దుకు పోవాల్సివస్తోంది.

ఒక వైపు ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో అతిపెద్ద దేశంగా ఉన్న ఇండియా పాల వినియోగంలో మాత్రం పేరు గొప్ప వూరు దిబ్బ అన్నట్టుగా ఉందని పాడి పరిశ్రమ రంగం నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఒక వైపు పాల ఉత్పత్తి పెరుగుతోంది. మరో వైపు ధరలు అంతకు మించి పెరగుతున్నాయి. అయితే మార్కెట్‌లో పాలు , పాల పదార్ధాల వినియోగంలో పెరుగుదల మాత్రం సంపన్న వర్గాలకే పరిమితం అవుతోంది. పేద మద్య తరగతి ప్రజలు లీటరు పాలు వినియోగించే చోట అరలీటరు పాలతో సర్దుకుపోతూ ఎదో తాగాం ..తిన్నాం అన్న రీతిలో అవసరాలు తీర్చుకుంటున్నారు. ఈ వర్గాల ఇళ్లలో నెయ్యి ఏ పండగో పబ్బమో వస్తే తప్ప కొని తినలేని పరిస్థితి ఉందంటున్నారు.

పాల ధరలు పెరుగుతున్న ప్రతిసారి పేద మహిళలే అధికంగా నష్టపోతున్నారు. 5శాతం కుంటుబాలు నెలకు పాలు, పాల ఉత్పత్తులపైన కేవలం రూ.86 వెచ్చిస్తుండగా, 5శాతం పైన కుటుంబాలు నెలకు రూ.598 ఖర్చు చేస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. పాలు , పాల పదార్ధాల వినియోగంలో సంపన్న వర్గాలకు , నిరుపేద వర్గాలకు మధ్య అంతరం నింగికి నేలకు ఉన్నంతగా ఉంటోంది. 2017లో లీటరు పాల ధర సగటున రూ.42 ఉండగా ఈ ఐదేళ్ల కాలంలోనే 30శాతం ధరలు పెరిగాయి. దేశంలో సగటున పాల ధర లీటరుకు రూ.55 ఉండగా, ఇది ఆయా రాష్ట్రాలు, నగరాలను బట్టి మారిపోతోంది. హైదరాబాద్‌లో లీటరు పాల ధర రూ.60ఉంది. అగర్తలలో అత్యధికంగా రూ.72 ఉంది. దేశరాజధాని ఢిల్లోలో రూ.52, చెన్నైలో అతితక్కువగా రూ.40 ఉన్నట్టు మార్కెటింగ్ వర్గాలు చెబుతున్నాయి.

ఉత్పత్తి పెరిగినా తగ్గిని ధరల మంట!

దేశంలో పాడి పరిశ్రమ రంగం వేగంగా అభివృద్ది చెందుతూ వస్తోంది. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో పాల ఉత్పత్తులను పరిశీలిస్తే 1951లో 17మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి ఉండేది. 1965లో నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు ఏర్పాటుతో పాడిపరిశ్రమ రంగం వ్యవస్థీకృతం అయింది. 1991నాటికి దేశంలో పాల ఉత్పత్తి 53.9మిలియన్ టన్నులకు చెరుకుంది. డా. వర్గీస్ కురియన్ కృషితో పాడిపరిశ్రమ రంగం అభివృద్ధి మరింత వేగం పుంజుకుంది. 2022నాటికి పాల ఉత్పత్తి 210మిలియన్ టన్నులకు చేరుకుని ప్రపంచంలోనే అతి పెద్ద పాల ఉత్పత్తుల దేశంగా ఎదిగింది. ప్రపంచ పాల ఉత్పత్తుల అవసరాల్లో 21శాతం ఇండియానుంచే తీరుతున్నాయి. పాల వినియోగం కూడా దేశంలో 1991నాటికి సగటు వినియోగం 178గ్రాములు ఉంటే నేడు ఇది 400గ్రాములకు పెరిగింది. అయితే ఈ పెరుగుదల అంతా నాణెనికి ఒక వైపు మాత్రమే అని, పాలు , పెరుగు కంటే పాలతో తయారు చేస్తున్న పదార్ధాల్లోనే అదికంగా వినియోగం జరుగుతోందని, అదికూడా సంపన్న వర్గాలకే అధికంగా పరిమితం అవుతూ వస్తోందన్న విమర్శలు కూడా ఉన్నాయి.

తెలంగాణలో పాలపోంగు:

తెలంగాణ రాష్ట్రలో పాడి పరిశ్రమ రంగం వేగంగా అభివృద్ది చెందుతూ వస్తోంది. దాంతోపాటే పాలు , పాల పదార్ధాల వినియోగం కూడా పెరుగుతూ వస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేనాటికి 2014లో 42.07లక్షల టన్నులు ఉన్న పాల ఉత్పత్తి నేడు 60.99లక్షల టన్నులకు పెరిగింది. పశుసంపద విలువ కూడా 24,878కోట్ల నుంచి రూ.94,400కోట్లకు పెరిగింది. ముఖ్యమంత్రి కేసిఆర్ పాడిపరిశ్రమరంగం పట్ల చూపుతున్న శ్రద్ద ఈ రంగం అభివృద్ధికోసం ఇస్తున్న ప్రోత్సాహం తెలంగాణ రాష్ట్రాన్ని పాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయిస్తోందని పాడిపరిశ్రమ సమాఖ్య అధికారులు చెబుతున్నారు. దేశంలో పాల అధికోత్పత్తికి తొలి 5 రాష్ట్రాల జాబితాలో ఉత్తర ప్రదేశ్ , రాజస్థాన్ , ఆంధ్రప్రదేశ్ , గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలు ఉన్నాయి. రానున్న మూడేళ్లలో తెలంగాణ కూడా తొలి ఐదు రాష్ట్రాల్లో స్థానం దక్కించుకునే పయత్నాలు చేస్తోంది. ప్రతిఏటా జూన్ ఒకటిన ప్రపంచ పాల దినోత్సవం నిర్వహిస్తుండగా, దేశంలో మాత్రం ప్రతియేటా నవంబర్ 26న డా. కురియన్ జన్మదినాన్ని జాతీయ పాల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News