Sunday, December 22, 2024

భయం వద్దు, ఇది నాలుగో వేవ్ కాదు

- Advertisement -
- Advertisement -

Rising number of cases is not sign of beginning of fourth wave

భయపడనక్కర లేదని శాస్త్రవేత్తల హెచ్చరిక

న్యూఢిల్లీ : ఢిల్లీలోను, పరిసర ప్రాంతాల్లోను కొవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ ఆస్పత్రుల్లో అడ్మిషన్లపైనే దృష్టి కేంద్రీకరించాలని, అలాంటి పరిస్థితి మామూలుగానే ఉన్నప్పుడు, లేదా స్వల్పంగా మారినంత మాత్రాన కరోనా నాలుగోవేవ్‌కు సూచనగా భయపడరాదని అనేక మంది శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కొవిడ్ ఆంక్షలను తొలగించడం, స్కూళ్లలో తిరిగి తరగతులు ప్రత్యక్షంగా ప్రారంభం కావడం, సామాజిక , ఆర్థిక కార్యక్రమాలు ముమ్మరమై ప్రజలంతా చేరువవుతుండడం, ఇవన్నీ దేశ రాజధాని ఢిల్లీలోను, పరిసర ప్రాంతాల్లోను కేసులు పెరగడానికి దోహదం చేసి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలో కేసులు పెరుగుతున్నా ఆస్పత్రుల అడ్మిషన్ల పరిస్థితి అలాగే ఉన్నప్పుడు కేవలం కేసులను లెక్కించడంలో అర్థం లేదని ఫిజీషియన్, ఎపిడెమియోలాజిస్టు చంద్రకాంత్ లహారియా చెప్పారు. ఎపిడెమియోలాజికల్, శాస్త్రీయ ఆధారాల బట్టి ఢిల్లీలో ప్రస్తుతం పెరుగుతున్న కేసులు నాలుగోవేవ్ ప్రారంభానికి సంకేతం కాదని అన్నారు.

వైరస్ వ్యాప్తి పెరిగినా ఆస్పత్రుల్లో చేర్చాల్సినంతగా కేసుల తీవ్రత పెరుగుతుందని తాము అనుకోవడం లేదని, ఎక్కడా అలాంటి పరిస్థితిని తాము చూడడం లేదని అమెరికా లోని జాన్స్‌హాప్‌కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ అమితా గుప్తా పేర్కొన్నారు. ఇప్పుడు నాలుగో వేవ్‌కు సూచనేమీ లేదని, అలా జరగాలంటే కొత్త వేరియంట్ పుట్టుకు రావాలని కాన్పూర్‌కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి)ప్రొఫెసర్ మోడెల్లర్ మహీంద్రా అగర్వాల్ పేర్కొన్నారు. ఇమ్యునిటీని తప్పించుకుని ఇన్‌ఫెక్షన్‌ను కలిగించే సామర్ధం ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ బిఎ2 కు ఉన్నప్పటికీ, అది అంత ప్రాణాంతకంగా ఉండదని, దీనికి అంతకు ముందు ఇన్‌ఫెక్షన్ వల్ల ఏర్పడిన ఇమ్యునిటీ కొనసాగడం, వ్యాక్సినేషన్ జరగడం కారణమని సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్, ఎకనామిక్స్ అండ్ పాలసీ డైరక్టర్ లక్ష్మీనారాయణ్ వివరించారు. మాస్కులు తప్పనిసరి నిబంధనను మళ్లీ అమలు చేయడం శ్రేయస్కరమని అగర్వాల్ సూచించారు.

కొవిడ్ కేసుల విషయంలో మరోదేశంతో పోల్చడం, అలాగే అనుమానించడం తగదని లహారియా సూచించారు. ఇతర దేశాల్లో జరుగుతున్నదానికి భారత్‌లో పరిస్థితికి ఎక్కడా సంబంధం ఉండదని, దానివల్ల నేర్చుకునేది ఏదీ లేదని చెప్పారు. స్థానిక సమాచారం ప్రకారమే నిర్ణయం తీసుకోవడంపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. ప్రతిదేశం నేపథ్యం వేరుగా ఉంటుందన్నారు. బిఎ2 లేదా ఎక్స్‌ఇ వల్ల భారత్‌లో భారీగా కేసులు పెరిగే దాఖలాలు లేవని చెప్పారు. 2022 జనవరి ఫిబ్రవరి నెలల్లో ఒమిక్రాన్ కేసులు పెరగడానికి బిఎ 2 యే కారణమన్నారు. అదే వేరియంట్ లేదా ఎక్స్ ఇ కనీసం ఆరు నుంచి తొమ్మిది నెలలైనా తాజా వేవ్‌ను కలిగించలేదని శాస్త్రీయంగా మనకు తెలుసని చెప్పారు. అయితే ఒమిక్రాన్ కన్నా వేగంగా వ్యాపించే కొత్త వేరియంట్ ఏదైనా వచ్చినా, ఇమ్యునిటీని తప్పించుకోగలిగినా, అప్పుడు తాజా వేవ్ రిస్కు ఉంటుందని లహారియా హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News