Thursday, January 23, 2025

యమున విలయతాండవం

- Advertisement -
- Advertisement -

పవిత్రమైన పుణ్యనదులకు పుట్టినిల్లు భారత దేశం. ఈ నదులతోనే ప్రజల, జీవరాసుల జీవనాధారం ఆధారపడినది. ఈ నదులను ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. వీటి ఒడ్డున అనేక దైవ పుణ్యక్షేత్రాలు పురాణ కాలంలోనే నెలకొల్పబడినవి. ఇతిహాస పురాణాల కాలం నుండి అధిక వర్షపాతం సంభవించి నదులకు భీకర వరదలు వచ్చినప్పుడు తగ్గుముఖం కోసం, వర్షాభావం సంభవించినప్పుడు వర్షాల కోసం ఈ నదీమ తల్లులను పూజించుట తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. మన దేశంలో నదులను పరమ పవిత్రతగా భావిస్తారు. నదులను దేశంలో దుర్వినియోగం చేసినట్టుగా మరెక్కడాచేయరు.

పట్టణీకరణ అత్యంత వేగవంతంగా పెరుగుతూ ఉండడం, జనాభా గణనీయంగా పెరుగుతున్నందున ప్రకృతి వనరులను అతిగా వినియోగించుకోవడం వల్ల అప్పుడప్పుడూ ప్రకృతి కన్నెర్ర చేసి జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ప్రకృతి నియమాలను, క్రమాన్ని అతిగా దుర్వినియోగం చేసినందు వల్ల ఈ విపత్తులు అనివార్యమే అవుతున్నవి. పట్టణాలలో జనభారం అత్యధికంగా పెరుగుతున్నందున ఉన్న మౌలిక వనరులు పెరిగే జనాభా అవసరాలు తీర్చడానికి సరిపోయేంతగా ఉండడం లేదు. ప్రకృతి ప్రకోపించినప్పుడు ఈ వ్యవస్థలూ అస్తవ్యస్తమవుతున్నవి. నగరాల్లో వరద నియంత్రణా వ్యవస్థలు నామ మాత్రమే. వర్షం పడినప్పుడల్లా నగర జీవితం నరకప్రాయంగా మారుతున్నది. వాడలు నదులుగా మారిపోతున్నవి.
ఇప్పుడు ఉత్తర భారత దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో అధిక వర్షపాతం వల్ల ఢిల్లీ జనజీవనానికి అత్యంత క్లిష్టమైన విఘాతం కలిగినది. ఈ మహా విపత్తు ఒక్క ఢిల్లీకే పరిమితం కాలేదు, హర్యానా, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లో కొంత భాగం కూడా కుంభవృష్టి బారినపడ్డాయి. ఢిల్లీలో ఇంత భారీ వర్షం పడడం గత 50 సంవత్సరాల తర్వాత, చండీగఢ్‌లో 302 మి.మీ. వర్షం పడినది. ఇంతటి వర్ష బీభత్స ప్రభావం పాకిస్తాన్‌లోనూ సంభవించినది. అక్కడి చీనాబ్, సట్లేజ్, రావి నదుల్లో నీటిమట్టం అమాంతం పెరిగినది. అక్కడా కొన్ని ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించవలసి వచ్చినది. ఈ వర్ష బీభత్సం వల్ల ఢిల్లీతో సహా ఎనిమిది రాష్ట్రాలలో దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఢిల్లీలోని ప్రముఖ వీధులతో పాటు నగరమంతా జలమయమైంది.రాజ్‌ఘాట్, ఐటిఒ సర్కిల్, సుప్రీంకోర్టు పరిసర ప్రాంతాలూ నీటితో నిండిపోయాయి. రాకపోకలు దాదాపు స్తంభించిపోయాయి. ఫలితంగా అత్యవసర సేవలు అందించవలసిన విభాగాలు తప్ప మిగతా కార్యాలయాలన్నీ మూసివేయవలసి వచ్చినది. కొన్ని సంస్థలు తమ సిబ్బందిని ఇంటి వద్ద నుండే పని చేయమని కోరడం జరిగింది. దేశ రాజధానిలో యమునా నది అక్కడక్కడ చిన్న పాయలుగానో, కొన్ని చోట్ల ఇసక పర్రలవలే పారుతున్నది.కానీ అత్యధిక వర్షపాతం వలన మహోగ్ర రూపం దాల్చినది. యమునా నది ప్రమాద సూచిక 205.33 మీటర్లు కానీ వరద మట్టం 208.66 మీటర్లకు చేరింది. యమునా నదిలో వరద ఉధృతి తగ్గిన కూడా ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలు చెరువులుగా మారాయి. హతినీకుండ్ బ్యారేజీ నుండి నీరు విడుదల చేయడం యమునలో నీటిమట్టం పెరగడానికి కారణమైంది. ఇంద్రప్రస్థ దగ్గర ఢిల్లీ నీటి పారుదల, వరద నియంత్రణ వ్యవస్థ పాడైపోవడం వల్ల మధ్య ఢిల్లీలోని సుప్రీంకోర్టు పరిసరాలు కూడా నీట మునిగిపోయినవి.

ఇళ్లు చిన్న చిన్న దీవులుగా మారిపోయినవి. రోజువారీ జనజీవనం స్తంభించిపోయినది. ఢిల్లీ, గూర్గాం, ముంబై లాంటి నగరాల్లో ఈ కష్టాలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు మానవ జీవితాలను అల్లకల్లోలం చేసిన సందర్భాలు ఎన్నెన్నో ఉన్నవి. తన అవసరాల కోసం, మనుగడ కోసం, పురోభివృద్ధి కోసం, నాగరికతాభివృద్ధి కోసం మనిషి ప్రకృతిని తనకు అనువుగా మార్చుకుంటున్న తరుణంలో ప్రకృతిని ఛిన్నాభిన్నం చేస్తున్న ఫలితంగా ప్రకృతి విధ్వంసం జరిగిపోతునది. ఈ విధ్వంస రచనతో మనిషి అస్తిత్వానికే ముప్పు కలుగుతున్నది. నగరాల్లో వరదలు రావడానికి అనేక కారణాలున్నాయి. అవి ప్రక్కన ఉన్న నదుల్లో, బ్యారేజీల్లో, జలాశయాల్లో జలప్రవాహం పెరగడం, వివిధ వ్యవస్థలు, మౌలిక సదుపాయాలు సవ్యంగా పనిచేయకపోవడం వలన, ఎగువన భారీ వర్షాలు పడితే దిగువన ఉన్న నగరాలు విపత్తులో పడిపోతున్నవి. వర్ష నీటి కోసం కొన్ని నగరాల్లో ఇది వరకు నిర్మించిన వ్యవస్థలు ఇప్పుడు ఆనవాలు లేకుండాపోయినవి. అవన్నీ దురాక్రమణలకు గురయ్యాయి. నగరాల విస్తరణకు నియతమైన నియమాలు ఉన్నట్టు కనిపించదు.

సహజమైన నీటి ప్రవాహ మార్గాలను ఆక్రమించుకుని ఇళ్లు నిర్మిస్తున్నందు వలన ఆ నీటి ప్రవాహం దారి మళ్లి మరో చోట ప్రమాదానికి దారి తీయక తప్పడం లేదు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరులో పట్టణీకరణ, ఆర్థికాభివృద్ధి వల్ల అనేక అనేక ప్రయోజనాలు ఉంటున్నవి. కానీ ప్రకృతి విలయ తాండవం చేసినప్పుడు ఈ నగరాలన్నీ నిస్సహాయ స్థితిలోకి వెళ్తున్నవి. సహాయక చర్యలు చేపట్టే బృందాలు వీధుల్లో పడవల మీద వెళ్లడం చూస్తూనే ఉన్నాం. భవన నిర్మాణాలు శ్రుతి మించినందు వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకే మార్గాలన్నీ మూసుకుపోయాయి. దీని వల్ల రోడ్ల మీద నిల్వ ఉండిపోతున్నవి. అక్రమ నిర్మాణాలను అరికట్టడం, నీటి పారుదలకు సహజంగా ఉన్న మార్గాలకు అవాంతరాలు తొలగించడం, భూ వినియోగ పద్ధతిలో మార్పులు తీసుకురావడం, పట్టణాలకు వలసలను తగ్గించడానికి గ్రామీణ ప్రాంతాలలో సదుపాయాలు, ఉపాధి అవకాశాలు పెంచడానికి తగిన ఏర్పాట్లు చేయడం వల్ల ఈ విపత్తులను నివారించవచ్చు. ఇవన్నీ చేయాలంటే బలమైన రాజకీయ వ్యవస్థ అవసరం. భౌగోళిక పరిస్థితులకు అనువుగా నగరాలను తీర్చిదిద్దాలి. మురుగునీటి పారుదల వ్యవస్థ అధిక చోట్ల ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నది.

వ్యర్థ పదార్థాలను ఏం చేయాలో తెలియని దుస్థితి. అడవులు నిత్యం ధ్వంసం అయిపోతున్నాయి. సముద్ర తీర ప్రాంతాలలో ఏర్పడిన నగరాలకు ప్రకృతి విపత్తులు అధికంగా ఉంటున్నవి. ఈ నగరాల్లో వరదలు ఏ రూపంలో వచ్చినా ఎదుర్కోవడం కష్టమే. ఇలాంటి వరదల వల్ల జనం, ముఖ్యంగా పేదలు నిర్వాసితులు కావడం, మౌలిక సదుపాయాలు ధ్వంసం అయిపోవడం, ఆర్థిక నష్టాలు, రవాణా సమస్యలు విపత్తుల ముప్పుకు అగ్నికి ఆజ్యం పోసినట్టు ఉంటునది. నదీ జలాలకు చోటు లేకుండా చేసినప్పుడు ఆ నీరు పొంగి పొర్లుతుంది.అక్కడ ఇళ్లు నిర్మించడం వల్ల నదులు తమ ప్రవాహ ఉధృతిలో వాటినీ కబళిస్తున్నవి ఇది తరతరాలుగా వస్తున్న సమస్య.

17వ శతాబ్దంలో యమునా నది ఒడ్డున ఎర్రకోట నిర్మించినారు. బ్రిటిష్ వారు ఆ తరవాత సివిల్ లైన్స్ ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరవాత యమునా నది ప్రవహించే ప్రాంతాం చాలా కుంచించుకుపోయింది. యమునా బాంక్ మెట్రో స్టేషన్, అక్షర ధాం, కామన్వెల్త్ గ్రామం మొదలగునవి యమునా నది సహజ ప్రవాహ దిశను నిరోధిస్తున్నవి. అక్రమ నిర్మాణాలకు లెక్కే లేదు. యమునా నది ప్రవాహ ప్రాంతం ఇది వరకు 5 నుంచి 10 కి.మీ. ఉండేది. ప్రస్తుతం కొన్ని చోట్ల కొన్ని మీటర్లకే పరిమితమైంది. రుచిగా ఉన్నదని భోజనం అధికంగా చేస్తే అది అజీర్తిగా మారి మనిషి ఉనికికే ప్రమాదం సంభవిస్తుంది. ఇదే పద్ధతిలో నది ప్రవాహ మార్గాన్ని అడ్డుకుంటే అది ఉగ్రరూపం దాల్చి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తన ప్రవాహాన్ని కొనసాగించి విలయతాండవం సృష్టిస్తున్నది.

దండంరాజు రాంచందర్ రావు- 9849592958

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News