Thursday, January 23, 2025

70% వాళ్లే

- Advertisement -
- Advertisement -

Risk of Covid for those who have not been vaccinated

ఆసుపత్రుల్లో చేరుతున్న వాళ్లలో వ్యాక్సిన్ తీసుకోనివాళ్లే మెజార్టీ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో చేరిన వారిపై డాక్టర్ల పరిశీలన

మనతెలంగాణ/హైదరాబాద్ : కొవిడ్‌తో ఆసుపత్రుల్లో చేరుతున్న వారిలో అధిక శాతం వ్యాక్సిన్ తీసుకోనివారే ఉంటున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారు వైరస్ బారిన పడుతున్నా వారు ఆసుపత్రి వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే కోలుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభు త్వ, ప్రైవేట్, కార్పోరేట్ ఆసుపత్రులు, ఐసీయులో చికిత్స పొందుతున్న వారిలో 70 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోని వారేనని గణాంకాలు చెబుతున్నాయి. అయితే వ్యాక్సిన్ ద్వారా 100 శాతం కొవిడ్‌ను నియంత్రించే అవకాశాలు లేకున్నా, వైరస్ ప్రభావాన్ని తగ్గించేందుకు దోహదపడుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారితో పోల్చితే వ్యాక్సిన్ తీసుకోనివారిలో లేదా ఒకే డోసు తీసుకున్న వారిలో ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. నగరంలోని ప్రభుత్వం, కార్పోరేట్ ఆసుపత్రుల్లో కొవిడ్‌తో బాధపడుతూ ఐసీయు లేదా ఆక్సిజన్‌తో చికిత్స పొందుతున్న వారిలో సుమారు 70 శాతం మంది రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకోని వారే ఉన్నారు. నగరంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 809 మంది ఆక్సిజన్‌తో చికిత్స పొందుతుండగా, 492 మంది ఐసీయులో చికిత్స పొందుతున్నారు. వారిలో 10 మందికి 7 గురు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోనివారే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలో నిరాఘాటంగా వ్యాక్సినేషన్

కరోనా మహమ్మారి కోరలు కత్తిరించే మార్గంగా వ్యాక్సిన్‌ను ప్రభుత్వాలు అందుబాటులోకి తీసుకువచ్చాయి. గత సంవత్సరం కాలంగా రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ విస్తృతంగా సాగుతోంది. అయితే రాష్ట్రంలో కొంతమంది గడువు ముగిసినా రెండో డోస్ తీసుకోవడంపై నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారు.అనేక ప్రాంతాల్లో టీకా అందుబాటులో ఉన్నా.. రెండో డోస్ తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. ఇటీవల పండుగల సీజన్ కావటంతో టీకా తీసుకుంటే జ్వరం, ఒళ్లు నొప్పుల వంటివి వచ్చే అవకాశం ఉందన్న ఆందోళనతో పలువురు టీకాకు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటిరవకు మొదటి డోసు 103 శాతం పూర్తి కాగా, రెండవ డోసు 75 శాతం పూర్తయింది.

అయితే అందరికీ టీకాలు వేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో రాష్ట్రంలో వ్యాక్సిన్ కేంద్రాల వద్ద నిత్యం రద్దీ నెలకొంటుంది. దాంతోపాటు ఇప్పటివరకు వ్యాక్సిన్ వేసుకోని వారిని గుర్తించి ఇంటింటికీ వెళ్లి మరీ ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సిన్ వేస్తున్నారు. భవిష్యత్తులో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చూపిస్తేనే మార్కెట్లు, సూపర్ మార్కెట్లు, సినిమా హాళ్లు, ఇతర బహిరంగ ప్రదేశాలలో అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రెండు డోసులు వేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వ్యాక్సినేషన్‌పై ఎప్పటికప్పుడు అందరికీ అవగాహన కల్పిస్తూ మరింత ఉధృతంగా వ్యాక్సినేషన్ చేపట్టేలా చర్యలు చేపడుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News