బిజెపి జాతీయాధ్యక్షుడు జెపి నడ్డాకు ఆ పార్టీ మహిళా ఎంపి ప్రతిపాదన
లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ అనేక రాజకీయ మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి నేతలు ఫిరాయించడం కొనసాగుతూనే ఉంది. ఇదే సమయంలో సీనియర్ నాయకురాలు రీటా బహుగుణ జోషి షాకింగ్ ప్రకటన వెలుగు లోకి వచ్చింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తన కొడుకు మయాంక్ జోషికి లక్నో కంటోన్మెంట్ నియోజక వర్గం నుంచి టికెట్ ఇవ్వాలని ఆమె బిజెపి అధిష్టానాన్ని కోరింది. ఒకే కుటుంబంలో ఇద్దరికి పదవులు కుదరవనుకుంటే తన కొడుకు కోసం తాను ఎంపీ పదవిని వదులు కోడానికి సిద్ధంగా ఉన్నానని బిజెపి జాతీయాధ్యక్షుడు జేసి నడ్డాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. తన కొడుకు 12 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నాడని, ప్రజలకు సేవ చేస్తున్నాడని ఆమె గుర్తు చేశారు. రీటాతోపాటు బిజెపి ఎంపీ జగదాంబికా పాల్ , కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్, యుపి డిప్యూటీ సిఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా తమ పుత్రులకు అసెంబ్లీ టికెట్ల కోసం పావులు కదుపుతున్నారు.