Friday, November 15, 2024

రాకెట్ మహిళ రీతూ కరిధాల్

- Advertisement -
- Advertisement -

చంద్రయాన్ -3 మిషన్‌లో దాదాపు 54 మంది మహిళా శాస్త్రవేత్తలు ప్రధాన పాత్ర పోషించడం విశేషం. కాగా ఈ ప్రయోగం తర్వాత, అనూహ్యం గా డాక్టర్ రీతూ కరిధాల్ శ్రీవాస్తవ పేరు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మార్స్ ఆర్బిటర్ మిషన్ (మంగళయాన్), ఇతర అంతరిక్ష యాత్రలలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ‘భారత రాకెట్ మహిళ’గా పేరు గడించి ఇస్రో సీనియర్ శాస్త్రవేత్తలలో ఒకరిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డా. రీతూ కరిధాల్ శ్రీవాస్తవ ప్రతిష్ఠాత్మక చంద్రయాన్- 3 మిషన్‌కు నాయకత్వం వహిస్తున్నారు.

భారత అంతరిక్ష పరిశోధనా రంగం కోసం రీతూ కరిధాల్ ప్రదర్శిస్తున్న అసాధారణ స్ఫూర్తి, అందిస్తున్న సహాయ సహకారాల, కృషితో ఆమె అత్యంత ప్రేరణాత్మకంగా, మార్గదర్శకురాలిగా ప్రకాశిస్తున్నారు. శాస్త్రవేత్తగా ఆమె ప్రదర్శిస్తు న్న అద్వితీయమైన ప్రతిభ, కఠోర పరిశ్రమ, చంద్రయాన్ -2 వంటి ప్రముఖ మిషన్లలో ఆమె నిర్వహించిన పాత్ర దేశ అంతరిక్ష పరిశోధనా ప్రయత్నాలలో ఆమెను ముందంజలో ఉంచింది.

అంతరిక్ష సంబంధిత విషయాలపై రీతూ కరిధాల్ శ్రీవాస్తవకు బాల్యంలోనే మక్కువ ఏర్పడడం ప్రారంభమై ఆ జిజ్ఞాస వయసు తో పాటు పెరుగుతూ ఆమెను శాస్త్రీయ పరిశోధనల వైపు నడిపించింది. చిన్ననాటి నుండే ఆమె మేడపై గంటల తరబడి ఆకాశంలోని చంద్రున్ని, నక్షత్రాలను గమనిస్తూ, ఖగోళ శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలను చదువుతూ కాలం గడిపేది. గణితం పై తనకు గల మక్కువ గురించి ప్రస్తావిస్తూ ఆమె ఒక ఇంటర్వ్యూ లో గణితంపై పద్యాలు రాయడంతో పాటు సంఖ్యలు నన్ను చుట్టుముట్టినట్లు ఊహించుకునే దాన్ని అన్నారు. తన యుక్త వయసులో ఆమె వివిధ దినపత్రికల లో ప్రచురితమయ్యే నాసా, ఇస్రోల కార్యక్రమ వివరాలను ఎంతో ఆసక్తిగా చదువుతూ ఆయా వార్తా పత్రికలను జాగ్రత్తగా భద్రపర్చుకుంటూ అంతరిక్ష రంగంలో తనకంటూ ఒక భవిష్యత్తును నిర్మించుకో వాలని ప్రగాఢంగా కోరుకునేది. అంతరిక్షంపై వున్న అచంచలమైన అభిరుచి, అనురక్తి, సైన్స్‌లో వృత్తిని కొనసాగించాలనే ఆమె సంకల్పం, ఆమెను ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో పట్టా పొందేలా చేసింది. ఆమెలోని ఈ ఉత్సుకత, ఖగోల శాస్త్ర రహస్యాలను ఛేదించాలనే సహజమైన కోరిక ఈ అద్భుతమైన ప్రయాణానికి నాంది పలకడంతో పాటు భారత దేశ అంతరిక్ష పరిశోధనా రంగంలో ఆమెను ఒక విశిష్ట వ్యక్తిగా ముందు వరుసలో నిలబెట్టడానికి దోహదమవుతున్నాయి.

13 ఏప్రిల్ 1975న ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన డా. రీతూ కరిధాల్ ప్రాథమిక విద్యాభ్యాసం లక్నోలోని సెయింట్ అంజని పబ్లిక్ స్కూల్, నవయుగ కన్య విద్యాలయ, ఉన్నత విద్య మహిళా విద్యాలయ పిజి కళాశాల, లక్నో యూనివర్సిటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో కొనసాగింది. 1997లో ఎంఎస్‌సి పూర్తి చేసి, ఆరు నెలలు పిహెచ్‌డి కొనసాగించి ఆ తరువాత గేట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో పిహెచ్‌డి అర్ధాంతరంగా నిలిపి వేసి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో చేరి ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ పూర్తి చేశారు.
1997లో ఇస్రోలో చేరిన తర్వాత ఆమె కొన్ని ముఖ్యమైన మిషన్లలో చురుకుగా పాల్గొన్నారు. 2013లో ఆమె మంగళయాన్ మిషన్‌కు డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా, అలాగే చంద్రయాన్- 2 కి మిషన్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆమె 20 పైగా పరిశోధనా పత్రాలు ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆమె విద్యార్హతలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో పని తీరును పరిగణనలోకి తీసుకున్న ఇస్రో ఆమెకు యుఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో కఠినమైన బాధ్యతలు అప్పగించడమేకాక సీనియర్ శాస్త్రవేత్తలు ఉన్నప్పటికీ ఆమెకు అధునాతనమైన ప్రాజెక్టులలో అవకాశాలు కల్పించింది. ఇది ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పాదుకొల్పిం ది.

మంగళయాన్ మిషన్‌లో అంతరిక్ష వాహక నౌక స్వయంప్రతిపత్తి వ్యవస్థను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ ఉపగ్రహంలోని భాగాలు సమయాను సారం విడివడేలా చూడడం, ఒకవేళ సాంకేతిక కారణాలతో ప్రతిష్టంభన ఏర్పడితే ఆ లోపాన్ని వ్యవస్థ ద్వారానే స్వయంగా సరిదిద్దికుని పునరుద్ధరింపబడేలా సాంకేతిక పరిజ్ఞాన్నా న్ని జోడించే బాధ్యతలను ఆమె సమర్థవంతంగా నిర్వహించారు. భారతదేశ చరిత్రాత్మక చంద్రయాన్ -2 మిషన్‌కు మిషన్ డైరెక్టర్‌గా వ్యవహరించిన డాక్టర్ రీతూ కరిధాల్ అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ఆమె జిశాట్ -6ఎ, జిశాట్- 7ఎ మిషన్‌లలో కూడా పని చేశారు.

ఆమె అసాధారణమైన నాయకత్వ లక్షణాలు, సాంకేతిక నైపుణ్యం మిషన్ ప్రయోగంలో ప్రస్ఫుటంగా ప్రతిబింబించాయి. మిషన్ ప్లానింగ్ నుండి అంతరిక్షవాహక నౌక నావిగేషన్ వరకు ఆమె మార్గనిర్దేశం చేశారు. భారత దేశ అంతరిక్ష కార్యక్రమా నికి చంద్రయాన్-2ను ఒక ముఖ్యమైన మైలురాయిగా మార్చడంలో డాక్టర్ రీతూ కరిధాల్ అచంచలమైన సంకల్పం, చిత్తశుద్ధి ప్రధాన భూమిక నిర్వహించా యనడంలో ఎలాంటి సందేహం లేదు. చంద్రయాన్- 2 మిషన్ సందర్భంగా ఆమె ప్రదర్శించిన సునిశిత దృష్టి, త్రికరణ శుద్ధి ఇప్పుడు చంద్రయాన్- 3 మిషన్‌లో ఆమెను ప్రముఖ శాస్త్రవేత్తగా ముందు వరుసలో ఉండేలా చేసింది. అంతరిక్ష వాహక నౌక నావిగేషన్, మిషన్ విశ్లేషణ, వ్యవస్థ అనుసంధానం లాంటి అంశాలలో ఆమె నైపుణ్యం, ప్రతిభా పాటవాలు మిషన్ విజయంలో ఆమెను ఒక అమూల్యమైన ఆస్తిగా నిలిపింది.

ప్రముఖ శాస్త్రవేత్తగా, మిషన్ పథం, అంతరిక్ష నౌక రూపకల్పన, కార్యాచరణ ప్రణాళికను రూపొందించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. చంద్రయాన్ -3 కోసం ఆమె చేసిన విశిష్ట కృషి అంతరిక్ష పరిశోధనా రంగంలో అగ్రగామి మహిళగా ఆమె వారసత్వాన్ని మరింత సుస్థిరం చేశాయి. గొప్ప సాంకేతిక నైపుణ్యం, అద్వితీయమైన పనితీరు, అచంచలమైన ఆత్మవిశ్వాసం, వృత్తి పట్ల అంకిత భావాలతో డాక్టర్ కరిధాల్ శ్రీవాస్తవ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక శాస్త్రవేత్తలకు, ముఖ్యంగా మహిళలకు స్ఫూర్తిగా, ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతరిక్షం పట్ల ఆమెకున్న అభిరుచి, నాయకత్వ లక్షణాలు, సాంకేతిక నైపుణ్యం ఈ రంగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పాయి. ఆమె విజయాలు లింగ వివక్షను అధిగమించి, శాస్త్రసాంకేతిక రంగంలో మహిళల అద్భుతమైన సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తాయి. అంతరిక్ష పరిశోధనా రంగంలో తన అద్భుతమైన ప్రయాణం ద్వారా, మూస పద్ధతులను బద్దలు కొట్టిన ఆమె మహిళలకు భవిష్యత్తుపై ఆశావహ దృక్పధాన్ని, ప్రేరణను కలిగిస్తుంది. మహిళా సాధికారతకు సామాజిక నిబంధనలు లేదా కట్టుబాట్లు ఏమాత్రం అవరోధాలు కాజాలవని ఆమె తన విజయాల ద్వారా ప్రయోగాత్మకంగా నిరూపిస్తూ నేటి యువతరానికి ప్రత్యేకించి మహిళలకు స్ఫూర్తిప్రదాతగా నిలుస్తున్నారు.

డా. రీతూ కరిధాల్ 2007లో మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం చేతుల మీదుగా యువ శాత్రవేత్త పురస్కారం, 2015లో మార్స్ ఆర్బిటర్ మిషన్ (ఎంఒఎం) కోసం ఇస్రో టీం పురస్కారం, ఎఎస్‌ఐ టీం పురస్కారం, 2017లో సొసైటీ ఆఫ్ ఇండియన్ ఏరోస్పేస్ టెక్నాలజీస్ ద్వారా అంతరిక్ష రంగంలో విజయం సాధించిన మహిళా పురస్కారం, లక్నో యూనివర్సిటీ ద్వారా గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. మార్చి 3, 2019 న హైదరాబాద్‌లో నిర్వహించబడిన TEDx (Techno logy, Entertain ment, and Design) కార్యక్రమం లో వక్తగా పాల్గొన్న ఆమె మార్స్ ఆర్బిటర్ మిషన్‌లో తన అనుభవాలను పంచుకున్నారు.

మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగానికి పది నెలల ముందు నుండే తాను తీవ్ర వ్యక్తిగత, వృత్తిపరమైన వత్తిడికి గురైనప్పటికీ అది తనకు సంతృప్తి కలిగించిందన్నారు. ఆఫీసు నుండి తిరిగి వచ్చిన వెంటనే వాయు వేగంతో ఇంటి పనులు ముగించుకుని పిల్లల హోం వర్క్ పూర్తి చేయించి అర్ధరాత్రి ప్రారంభించి తెల్లవారు జామున దాదాపు నాలుగు గంటల వరకు తన పనిలో నిమగ్నమయ్యే దాన్నని తెలిపారు. అంతరిక్ష విజ్ఞాన రంగంలో మరింత మంది మహిళలు తమ నైపుణ్యాన్ని, సత్తాను చాటుకొని ఆకాశమే హద్దుగా కొనసాగి అంతరిక్ష రంగంలో నోబెల్ బహుమతులు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ భారత రాకెట్ మహిళ డా రీతూ కరిధాల్ తో భేటీ కావడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని పేర్కొనడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News