Wednesday, January 22, 2025

నారసింహుని దివ్య దర్శన వేళ

- Advertisement -
- Advertisement -

Rituals at Yadadri temple to begin today

నేటి నుంచి భక్త జనకోటికి యాదగిరీశుని పునర్దర్శన భాగ్యం

యాదాద్రి శ్రీలక్ష్మీ నారసింహుని ఆలయానికి నభూతో నభవిష్యతి అనే రీతిలో కృష్ణ శిల సహితమైన విశిష్ట చిత్రకళా అపురూప వైభవాన్ని కల్పించిన అనంతరం నేడు భక్త కోటికి స్వామివారి పునర్దర్శన భాగ్యం లభించనున్నది. సోమవారం ఉ. 11.55 ని.కు ఆవిష్కృతం కానున్న సంప్రోక్షణ శుభ సందర్భానికి సిఎం కెసిఆర్ హాజరు కానున్నారు.

యాదాద్రి నవశకానికి ఉద్ఘాటన… శ్రీ లక్ష్మీనరసింహుడి దర్శనానికి మరో పర్వం ప్రారంభం.. నిలువెత్తు కృష్ణ శిలా సంపదతో ఆలయ నలుదిక్కుల సప్తరాజగోపురాల వైభవం గర్భాలయ విమాన గోపురం.. సుదర్శన చక్ర దర్శనం. దైవశక్తిని చాటే నాటి చారిత్రక ఆలయాలకు ఏమాత్రం తీసిపోకుండా మహా నిర్మాణం యాదాద్రి భవ్య క్షేత్రం.. ఆలయ మాడవీధుల అద్భుతమైన ప్రాకారాలు.. నారసింహుడి దర్శన ఘట్టాలతో ఆలయ ముఖమండపం.. కాకతీయ మండప శిల్ప చారిత్రక దర్శనభాగ్యం.. ఏకశిలపై వెలసిన స్వయంభు దేవదేవుడు శ్రీ పంచనారసింహుడి గర్భాలయ దివ్యదర్శన క్షేత్రం యాదాద్రి.. శ్రీవారి క్షేత్రంలో ప్రథమ దర్శనాలతో భక్తులకు ఆభయమిచ్చే క్షేత్రపాలకుడు అంజనేయుడు.. శక్తి స్వరూపిణి అండాళమ్మ దివ్యదర్శనం, ఆళ్వార్‌మూర్తులతో ఆలయ మండపం… స్వామికి విష్ణుపుష్కరిణి.. భక్తుడికి శ్రీలక్ష్మీపుష్కరిణిలో పుణ్యస్నానాల ఘట్టాలు..మాళాధారణ మండల దీక్షా క్షేత్రం,శివకేశవులకు నిలయం శ్రీ పర్వతవర్ధిణి రామలింగేశ్వరుని ఆలయ వైభవం. ఆలయ పూరవీధులలో నలుదిశలలో రామానుజూకుటం, యజ్ఞశాల, ఆద్దాలమండపం, నిత్యకల్యాణ మండపాల శోభనీయం.. నాడు యాదఋషి తపస్సుతో వెలసిన లక్ష్మీనరసింహుడికి… నేడు కెసిఆర్ సంకల్పంతో ఆధ్యాత్మిక శిల్పకళలతో అలరారే ఆలయ నిర్మాణం… దేదీప్యమానంగా కొలువు దీరిన స్వయంభూ యాదాద్రిని దర్శించి తరించేందుకు భక్తకోటికి ఇక మహోత్సవమే.

ఇల వైకుంఠం.. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని దివ్యక్షేత్రం. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మహాసంకల్పంతో ఆలయ పునఃనిర్మాణ వైభవంతో భక్తకోటికి స్వయంభూ దర్శనం కల్పించేందుకు అలరారే తెలంగాణ దివ్యక్షేత్రం. సోమవారం ఉదయం 11.55 గంటలకు నిర్ణయించిన దివ్య ముహుర్తాన ఆలయ మహాకుంభ సంప్రోక్షణ అభిషేక మహోత్సవాన్ని పంచారాత్రాగమ శాస్త్రానుసారం మూలవిరాట్టు దర్శనం భక్తులకు కల్పించనున్నారు. మహోత్సవ పూజలో భాగంగా నేడు సిఎం కెసిఆర్ మహాకుంభ అభిషేక మహోత్సవంలో పాల్గొనున్నారు. శ్రీవారి స్వయంభూ నారసింహుడితోపాటు, ఆలయమూర్తులకు, అంజనేయుడికి, ధ్వజస్తంభమునకు, సుదర్శనచక్రం, సప్తరాజగోపురాలు, నవవిగ్రహమూర్తులకు కుంభాభిషేక పూజలను నిర్వహించి, విశ్వాశాంతి నిమిత్తం సాయంత్రం లక్ష్మీనరసింహునికి శాంతి కల్యాణ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. మహాకుంభ సంప్రోక్షణ అనంతరం భక్తకోటికి స్వామివారి గర్భాలయ దర్శనాలు కల్పించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.

రాజగోపురాల శిలామయమూర్తుల శోభతో భక్తులకు దర్శనభాగ్యం

ఏకశిఖరంపై ఉగ్రనరసింహ, జ్వాలనారసింహ, లక్ష్మీనరసింహ, గండభేరుండ నారసింహ, యోగానంద నారసింహుడిగా వెలసిన యాదాద్రి నవ ఆలయం నిర్మాణం పూర్తిగా కృష్ణశిల రాయితో చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజుల కాలంనాటి శిల్ప కల్పనతో నేటి తరానికి ఆధ్యాత్మిక భక్తిభావం, ప్రాచీన సంస్కృతి చాటేలా ఆలయ నిర్మాణం మహాద్భుతం. ప్రధానాలయంలో నాలుగు దిక్కులు నాలుగు రాజగోపురాలతోపాటు ముఖద్వార గర్భాలయ విమానగోపురం, అంజనేయ స్వామి గోపురాలను పూర్తిగా రాయితో ప్రాచీన పద్ధతిని ఉపయోగించి చేపట్టిన ఆలయ నిర్మాణం అచ్చెరువొందేలా కన్పిస్తోంది. యాదాద్రిలో మూడు రకాలుగా త్రితల, పంచతల, సప్తతల గోపురాలను గర్భగుడి వెలుపల ప్రాకారంలో నలుదిక్కుల నిర్మాణాన్ని చేపట్టారు. ఆలయ ప్రాకారం మాడవీధులతోపాటు, ప్రధానాలయ ముఖమండపం శిల్పకళతోరణముగా నిర్మాణం చేయగా, ప్రధానాలయంలో కాకతీయుల శిల్పకళ మండపం తలపించేలా నిర్మాణం అబ్బురమన్పించకమానదు.

ప్రధానాలయంలో అండాళ్ అమ్మవారు… అళ్వారుల దర్శనాలు

స్వామివారి ప్రధానాలయ ముఖమండపంలో గత ఆలయం మాదిరిగానే శ్రీ లక్ష్మీనరసింహున్ని దర్శనం అనంతరం భక్తులకు అండాళ్ అమ్మవారు, ఆళ్వారుల దర్శనం కల్పించేలా ఆలయ నిర్మాణాలు జరిగాయి.

రాతి దేవాలయంగా ప్రపంచ ఖ్యాతి

ఆలయ పునఃనిర్మాణంలో నల్లరాతి కృష్ణ శిలా సంపదతో పూర్తిగా ఆలయ నిర్మాణం చేపట్టడంతో యాదాద్రి క్షేత్రానికి ప్రపంచ ఖ్యాతి నిలుస్తుందని స్తపతులు భావన. ప్రతి దేవాలయంలో రాజగోపురాలు పూర్తిగా రాతి నిర్మాణంతో ఉండవు, యాదాద్రి క్షేత్రంలో మాత్రం రాజగోపురాలను పూర్తిగా రాతితో నిర్మించడం ప్రత్యేకత.

క్షేత్రపాలకుడు అంజనేయుడి దివ్య దర్శనం

యాదాద్రి పంచనారసింహ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా ఆంజనేయుడు దివ్య దర్శనం ప్రథమంగా భక్తులకు కలగనుంది. నృసింహుని దర్శనార్థం యాదఋషి తపస్సుకు మెచ్చి మొదట ఆంజనేయస్వామి ప్రత్యేక్షమై తన తపస్సుకు భంగం వాటిల్లకుండా అభయమివ్వడంతో యాదఋషి కఠోర తపస్సుకు లక్ష్మీనరసింహుడు అనుగ్రహించి పంచరూపాలతో సత్కారమైనట్లు స్కంధ పురాణాలను బట్టి తెలుస్తోంది. అప్పటి నుంచి ఈ క్షేత్రం యాదఋషి పేరు మీద యాదగిరిపల్లె (యాదగిరిగుట్ట)గా ఏర్పడి ఆంజనేయుడు నాటి నుంచి భక్తులకు అభయుడిగా నిలిచి క్షేత్రపాలకుడిగా పూజలందుకుంటున్నాడు.

శ్రీ విష్ణు పుష్కరిణి… శ్రీ లక్ష్మీపుష్కరిణి

యాదాద్రి క్షేత్రం గత ఆలయంలో శ్రీవారి ఉత్సవపూజలకు, భక్తుల పుణ్యస్నానాలకు కొండపైన ఈశాన్య భాగంలో రాతి చెలిమే నుంచి పుట్టిన విష్ణు పుష్కరిణి మహిమానిత్వమైంది. స్వామివారి మహిమను చాటుతూ సుదర్శనచక్ర శోభను కలిగి ఉన్నటువంటి పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు ఎన్నో మహిమలు చూశారు. ప్రస్తుత ఆలయ అభివృధ్ధిలో స్వామి వారి ఉత్సవ వేడుకలకు విష్ణు పుష్కరిణిని కొలువుదీర్చగా కొండ కింద భక్తుల పుణ్యస్నానాల కోసం శ్రీ లక్ష్మీపుష్కరిణిని ఏర్పాటు చేశారు. ప్రధానాలయ పురవీధుల నలుదిశలలో ప్రత్యేకత కలిగి ఉంది. తూర్పు, ఈశాన్య భాగాలలో స్వామివారి నిత్య కల్యాణ మండపాన్ని ఏర్పాటు చేయగా.. ఆగ్నేయంలో స్వామివారికి ప్రసాద భోగముల కోసం రామానుజ కూటాన్ని నిర్మించారు. నైరుతిన స్వామివారి యజ్ఞశాల.. వాయవ్యంలో స్వామివారికి అద్దాల మేడ నిర్మాణం చేశారు. ఒకేసారి వెయ్యిమందికి పైగా శ్రీవారి నిత్య కల్యాణంలో పాల్గొనే విధంగా కల్యాణ మండప ప్రాకారం నిర్మించారు. ఆలయ నిర్మాణంలో స్వర్ణ తాపడాల కాంతులు వెదజల్లనున్నాయి. శ్రీవారి ప్రధానాలయంలో గర్భాలయ ముఖద్వారం ధ్వజస్తంభం, విమానగోపురం, బలిపీఠం, రాజగోపురాల కలశాలకు బంగారు తాపడాన్ని కొలువుదీర్చారు. ప్రధానాలయంలో ముఖద్వారం, ధ్వజస్తంభం, బలిపీఠం, రాజగోపురాల కలశాలకు బంగారు తాపడం పూర్తయినప్పటికీ విమాన గోపుర బంగారు తాపడం పనులు జరుగుతున్నాయి.

రథశాల.. బ్రహ్మోత్సవ మండపం

ప్రధానాలయ తూర్పున శ్రీవారి బ్రహ్మోత్సవ మండపాన్ని నిర్మించారు. స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే ఉత్సవ, కల్యాణ మహోత్సవానికి ఈ మండపాన్ని ఉపయోగించనున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగమైన రథోత్సవానికి ఆలయ వాయవ్యంలో రథశాలను నిర్మాణం చేశారు.

శిల్పుల కళా నైపుణ్యం

యాదాద్రి ఆలయ క్షేత్ర నిర్మాణంలో కృష్ణ శిలకు దేవాతమూర్తులకు ప్రాణం పోసి ఆలయ నిర్మాణంలో శిల్పుల కళా నైపుణ్యాన్ని చాటారు. ఆగమశాస్త్రానుసారం ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టగా శాస్త్రానుసారం నిర్మాణం చేయడానికి స్తపతులు దిక్సూచిగా నిలువగా శిల్పులు తమ కళా నైపుణ్యాన్ని రాతిపై చెక్కి ఆధ్యాత్మిక రూపాన్ని యాదాద్రి క్షేత్రానికి అద్దారు. సుమారు 500 మందికి పైగా శిల్పులు అనునిత్యం శ్రమించి ఇల వైకుంఠంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రాన్నితీర్చిదిద్దారు.

ఆలయానికి ప్రత్యేక బంగారు రంగు విద్యుత్ కాంతులు

ఆలయానికి ప్రత్యేకంగా విద్యుత్ కాంతులను ఏర్పాటు చేశారు. శ్రీవారి ప్రధానాలయంతో పాటు ఆలయ ప్రకారాలకు, మాఢవీధులకు, ఆలయ ప్రాంతంలో బంగారు రంగు విద్యుత్ కాంతులతో రాతి నిర్మాణం కనబడేలా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు.

అద్భుత నిర్మాణ శైలి

n యాదాద్రి ఆలయ నిర్మాణంలో కాకతీయ, చోళ, చాళుక్య, పల్లవ.. ఇలా ఎన్నో అద్భుత నిర్మాణ శైలులను వినియోగించారు.
n వైష్ణవ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యం ఉన్న ఆళ్వార్లు ఇక్కడ రాతి స్తంభాల రూపంలో ముఖ మండపంలో కొలువుదీరారు. 12 మంది ఆళ్వార్లు 11 అడుగుల ఎత్తుతో 38 అడుగుల ఎత్తున్న ముఖ మండపానికి ఆధారభూతంగా నిలిచారు.
n మరెక్కడా లేనట్టుగా 1,700 అడుగుల పొడవునా.. దాదాపు 80 నుంచి 100 అడుగుల ఎత్తుతో ప్రాకారాలను నిర్మించారు.
n 84 అడుగుల ఎత్తుతో ఏడు అంతస్తుల మహారాజగోపురం.. ఐదు, నాలు గు, మూడు, రెండు అంతస్తులతో మరో ఐదు గోపురాలు, విమాన గోపురం ఇక్కడి మరో ప్రత్యేకత.
n మహారాజగోపురం చెక్కడానికే ఏకంగా 13వేల టన్నుల రాయిని వాడారు. ఇది పూర్తవటానికి రెండేళ్లు పట్టింది.
n ప్రాకారానికి వెలుపల అష్టభుజి మండపాలను ఏర్పాటు చేశారు. రథయాత్ర సాగినా భక్తులు హాయిగా ఆ మండపాల్లో కూర్చుని చూడొచ్చు.
n సింహం తల, గుర్రం తరహా శరీరం, దిగువ ఏనుగు.. వెరసి యాలీ జంతు రూపం. భారీ రాతి శిల్పాలు ఏకంగా 58 కొలువుదీరాయి. నోరుతెరిచి ఉ న్నట్టుగా ఉండే ఆవిగ్రహాలనోటిలోఅతిపెద్ద రాతిబంతులుఉండటం విశేషం.
n ఏడు చోట్ల ఐరావతాలు, ప్రవేశం నుంచి ఆలయంలోకి వెళ్లేప్పుడు స్తంభాల రూపంలో ఆంజనేయుడు, ప్రహ్లాదుడు, యాదమహర్షి, రామానుజుల రూపాలు, గర్భాలయ ద్వారంపైన రాతి ప్యానెల్‌పై గర్భాలయ ఉత్సవమూర్తి రూపం, ప్రహ్లాదచరిత్ర, పంచ నారసింహుల రూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మన తెలంగాణ ప్రతినిధుల బృందం

యాదాద్రి ఓ తంజావూరు.. ఓ శ్రీరంగం

గొప్ప రాతి నిర్మాణ దేవాలయం అనగానే మనకు తంజావూరు గోపురం గుర్తుకొస్తుంది. శ్రీరం గం మదిలో మెదులుతుంది. ఇప్పుడా రెండు దేవాలయాలు మనకు యాదాద్రిలో కనిపిస్తాయి. ఇది అసాధారణ నిర్మాణం. సిఎం కెసిఆర్ శ్రీకృష్ణదేవరాయలులాగా నిలిచి, ఆలోచనలు పంచి, ఆర్థిక వనరులు కల్పించి కట్టించారు. రాతి దేవాలయాల నిర్మాణ చరిత్రలో యా దాద్రి చిరకాలం నిలిచిపోతుంది. భక్తులకు ఆధ్యాత్మిక పరిమళాలతోపాటు గొప్ప నిర్మాణంలో గడిపిన అనుభూతిని పంచుతుంది.
                                                                                 ఆనంద సాయి, ఆలయ ఆర్కిటెక్ట్

నిఘా నీడలో యాదాద్రి క్షేత్రం

మూడు వేల మందితో భారీ బందోబస్తు
మన తెలంగాణ/హైదరాబాద్ : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మహా కుంభ సంప్రోక్షణ మహోత్సవానికి హాజరవుతున్న ప్రముఖుల భద్రతకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. మహాకుంభ సంప్రోక్షణకు దాదాపుగా మూడు వేల మంది పోలీసులతో పటిష్టత భద్రతను ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఉద్ఘాటనలో పాల్గొంటుండంతో, భద్రతను కట్టుదిట్టం చేశారు. యాదాద్రి క్షేత్రానికి ఇప్పటికే పారామిలటరీ, ఎఆర్, స్పెషల్ పోలీసు, బృందాలతో పహారా కాస్తున్నారు. యాదాద్రి క్షేత్రం ప్రాంగణమంతా బాంబ్ స్క్వాడ్ బృందం తనిఖీలు చేపట్టింది. విస్తరణ పనుల నేపథ్యంలో కల్వర్టులు, గుంతల వద్ద క్షుణ్ణంగా పరిశీలించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలను అందుబాటులో ఉంచారు. ప్రముఖులకు, భక్తులకు ట్రాఫిక్‌తో పాటు శాంతిభదత్రల సమస్య తలెత్తకుండా యాదాద్రి ఆల యం తరుఫున 88సీసీ కెమెరాలు, పోలీసు శాఖ ఆధ్వర్యంలో మరో 150 సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. కొండపైన ప్రత్యేకంగా కంట్రో ల్ రూం ఏర్పాటు చేసి, సిసి కెమెరాలతో ద్వారా ఎప్పటికప్పుడు నిఘా పెంచుతున్నారు. రాచకొండ పోలీసు కమిషనర్, అదనపు పోలీసు కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు, అదనపు డిప్యూటీ కమిషనర్లు, ఏసీలు, పలు విభాగాలకు చెందిన ఇన్‌స్పెక్టర్లకు ఇప్పటికే బాధ్యతలు అప్పగించారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, అధికారులు పెద్దసంఖ్యలో విచ్చేస్తున్నందున ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పార్కిం గ్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖులంతా బస్సుల్లో యాదాద్రి క్షేత్రానికి వెళ్లేందుకు ఏర్పాటు చేశారు. పాతగోశాల ప్రాంతంలో విఐపిల కోసం పార్కింగ్ వసతి ఏర్పాటు చేశారు.

నేడే మహాకుంభ సంప్రోక్షణ

మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్ అత్యంత వైభవంగా తలపెట్టిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునరుధ్ఘాటన మహోత్సవం సోమవారం కన్నుల పండువుగా జరుగనుంది. ఈ కార్యక్రమానికి సిఎం కెసిఆర్ హాజరవుతున్న నేపథ్యంలో మంత్రులు, సంబంధిత అధికారులు ఇప్పటికే తగు ఏర్పాట్లు పూర్తి చే శారు. ఉదయం7 గంటలకు నిత్యహోమాలు, చతు:స్దానార్చన, పరివారశాంతి ప్రాయశ్చిత్తహోమాలు, శాలబలి కార్యక్రమంతో పునరుద్ఘాటన మ హోత్సవం మొదలుకానుంది. కాగా ఉదయం 9 గం.లకు మహాపూర్ణాహుతి, గర్తన్యాసము, రత్నన్యా సం, యంత్ర ప్రతిష్ట, దివ్య విమానగోపుర సుదర్శన చక్రప్రతిష్ట, బింబప్రతిష్ట, అష్టబంధనం, కళారోహణం, ప్రాణప్రతిష్ట, నేత్రోన్మీలనం, దిష్టికుంభం పూజా కార్యక్రమాలు పూర్తి కానున్నాయి. కాగా ఈ వేడకల్లో పాల్గొనేందుకు సిఎం కెసిఆర్ దంపతులు ఉదయం 9:30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా యాదాద్రికి బ యలుదేరుతారు. 11 గంటల 55 నిమిషాలకు మిధునలగ్న సుముహూర్తాన సిఎం కెసిఆర్ దంపతుల చేతుల మీదుగా ప్రధానాలయ గోపురాలపై ఏ ర్పాటు చేసిన కలశాలకు పవిత్ర నదీజలాలు, పం చామృతాలతో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్ర మం జరుగుతుంది. అనంతరం ప్రధానాలయం గర్భగుడిలో స్వామివారికి ప్రథమ ఆరాధన, ఆరగింపు, తీర్దప్రసాద గోష్టి, శాంతి కళ్యాణం, ఆచా ర్య రుత్విక్ సన్మానం, మహదాశీర్వచనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

స్వామి దర్శన వేళల్లో మార్పులు..

n సుప్రభాతం: ఉదయం 3.30నుంచి 4 గంటల వరకు బిందె తీర్థం
n ఆరాధన: ఉదయం 4నుంచి 4.30 గంటలు
n బాలభోగం: ఉదయం 4.30నుంచి 5.30 గంటలు
n నిజాభిషేకం: ఉదయం 5.30 నుంచి 5.45 గంటలు
n అలంకార సేవ : ఉదయం 5.45నుంచి 6.30 వరకు
n ఆండాల్ అమ్మవారికి కుంకుమార్చన :ఉ. 6.30నుంచి 8 వరకు
n సర్వ దర్శనాలు : ఉ. 8నుంచి 9గంటల వరకు
n విఐపి బ్రేక్ దర్శనం: ఉ.9నుంచి 12 గంటల వరకు
n సర్వదర్శనాలు : మధ్యాహ్నం 12 నుంచి 12.45 గంటల వరకు
n మధ్యాహ్న రాజభోగము మ.12.45 నుంచి 4 గంటల వరకు
n సర్వ దర్శనాలు :సా.4నుంచి 5 గంటల వరకు
n విఐపి బ్రేక్ దర్శనం : సా. 5 నుంచి 7 గంటల వరకు
n సర్వ దర్శనాలు : రాత్రి 7 నుంచి 7.30 గంటల వరకు
n తిరువారాధన: రాత్రి 7.30 నుంచి 8.15 గంటల వరకు
n ఆండాల్ అమ్మవారికి కుంకుమార్చన: రా.8.15నుంచి9.15 వరకు
n సర్వదర్శనాలు : రా. 9.15 నుంచి 9.45 గంటల వరకు
n రాత్రి నివేదన, ఆరగింపు : రా. 9.45నుంచి 10గంటల వరకు
n శయనోత్సవ దర్శనం, ప్రధానాలయ ద్వార బంధనం :
n ఉ.6.30 నుంచి రాత్రి 9.15 గంటల వరకు జరిగే సర్వదర్శన వేళల్లో సువర్ణపుష్పార్చన, వేదాశీర్వచనం.
n ఉదయం 8.30 గంటల నుంచి 10గంటల వరకు సుదర్శన నారసింహ హోమం.
n ఉదయం 10.30 గంటల నుంచి 12 గంటల వరకు స్వామివారి నిత్య కల్యాణోత్సం.. బ్రహ్మోత్సవం.
n సాయంత్రం 5గంటల నుంచి 6.30 గంటల వరకు స్వామివారి వెండి జోడు సేవోత్సవాలు
n సాయంత్రం 6.45 గంటల నుంచి 7 గంటల వరకు దర్భారు సేవ
n ప్రతీ మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి 11 గంటల వరకు విష్ణుపుష్కరిణి, ప్రధానాలయంలోని క్షేత్రపాలకుడికి నాగవల్లీ దళార్చనలు.
n ప్రతీ శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవోత్సవం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News