హైదరాబాద్ : కృష్ణానదికి భారీ వరద వస్తోందని, నదీతీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా హెచ్చరించారు. నాగార్జునసాగర్, పులిచింతల డ్యామ్ నుండి ఇన్ పెరుగుతున్న దృష్ట్యా ప్రకాశం బ్యారేజ్ వద్ద శనివారం ఉదయానికి 4 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేయుచున్న దృష్ట్యా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ రోజు సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్ వద్ద 4.53 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారని తెలిపారు. వరద పెరుగుతున్న దృష్ట్యా నదీతీర మండలాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
నదిలోకి ఎవ్వరూ వెళ్లవద్దని, గొర్రెలు, మేకలు, గేదలు, ఆవులు తదితర పశువులు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ కోరారు. వరద పరిస్థితి ఎప్పటికప్పుడు గమనిస్తూ వరద విధులను కేటాయించిన సిబ్బంది పహారా ఉంచాలని తహసీల్దార్లను ఆదేశించినట్లు తెలిపారు. వీఆర్వోలు గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అలాగే సచివాలయ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన కోరారు. మత్స్యకారులు ఎవరూ నదిలోకి వేటకు వెళ్లకుండా చూడాలని మత్స్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే తెలియజేసేందుకు కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నెం. 08672 252572, మచిలీపట్నం రెవెన్యూ డివిజనల్ కార్యాలయం కంట్రోల్ రూమ్ నెం. 9849903982, ఉయ్యూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయం కంట్రోల్ రూమ్ నెం. 9849231336 ఏర్పాటు చేసినట్లు తెలిపారు.