గ్యాంగ్‌స్టర్‌కు కరోనా కాటు
న్యూఢిల్లీ : ఆర్జేడీ నేత, మాజీ ఎంపి మహమ్మద్ షాబుద్దిన్ శనివారం కొవిడ్‌తో మృతి చెందారు. గ్యాంగ్‌స్టర్‌గా పేరొంది, లాలూప్రసాద్ యాదవ్ సారథ్యపు ఆర్జేడీలో షాబుద్దిన్ కీలక పాత్ర పోషించారు. హత్యకేసుకు సంబంధించి షాబుద్దిన్ యావజ్జీవ శిక్ష పడటంలో తీహార్ జైలులో ఉన్నారు. కొవిడ్ తీవ్రతతో ఢిల్లీలోని ఆసుపత్రికి చేర్చారు. ఐసియూలో శనివారం మృతి చెందారని అధికారులు తెలిపారు. బీహార్ రాజకీయాలలో షాబుద్దిన్‌కు బాహుబలి అనే పేరుంది. ఆయన మరణం పార్టీకి తీరని లోటు అని ఆర్జేడీ అధ్యక్షులు తేజస్వీ యాదవ్ ప్రకటన వెలువరించారు. ఢిల్లీ ఆసుపత్రులలో చేర్చి ఆయనకు చికిత్స జరిపించాలని ఇటీవలే ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అయితే ఢిల్లీ ఆసుపత్రులలో సరైన ఏర్పాట్లు లేవని, చివరికి ఆక్సిజన్ కూడా అందడం లేదని, ఇతరత్రా నిత్యావసర మందుల కటకట ఉందని తన ప్రాణాలు పోతాయని ముందుగానే షాబుద్దిన్ ఢిల్లీ హైకోర్టుకు విన్నవించుకున్నారు. ఇప్పుడు ఢిల్లీ ఆసుపత్రిలోనే ఆయన కన్నుమూశారు.