Thursday, December 26, 2024

‘కమలం’పై కలిసి కదనం

- Advertisement -
- Advertisement -

RJD leader Tejaswi Yadav's team meets CM KCR

సిఎం కెసిఆర్‌తో ఆర్‌జెడి నేత తేజస్వీ యాదవ్ బృందం భేటీ

బిజెపి విచ్ఛిన్నకర విధానాలను తిప్పికొట్టేందుకు
ఐక్యం కావాలని అభిప్రాయం త్వరలో భవిష్యత్
కార్యాచరణ రూపకల్పనకు సూత్రప్రాయ
నిర్ణయం మీకు మా సంపూర్ణ మద్ధతు
ఉంటుందని కెసిఆర్‌కు మాటిచ్చిన తేజస్వీ
జాతీయ, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చ
తెలంగాణలో వ్యవసాయం, సాగునీటి రంగం
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అడిగి
తెలుసుకున్న బీహార్ విపక్ష నేత ఇటీవల సిఎం
కెసిఆర్‌ను కలిసిన కమ్యూనిస్టు జాతీయ నేతలు

మన తెలంగాణ/ హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుతో ఆర్‌జెడి నేత, బిహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ మంగళవారం ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీలో జాతీయ రాజకీయాలతో పాటు రాష్ట్రంలో అమలవుతున్న పథకాల గురించి ప్రధానంగా చర్చించినట్లుగా సమాచారం. అలాగే దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, మూడవ ఫ్రంట్ ఏర్పాటుపై సిఎం కెసిఆర్‌తో ఆయన ప్రత్యేకంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చిన నలుగురు సభ్యుల ఆర్‌జెడి నేతల బృం దం కెసిఆర్‌తో సుమారు రెండు గంటల పాటు సమావేశమయ్యారు. కేం ద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ అనుసరిస్తున్న విచ్చిన్నకర అప్రజాస్వామిక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజాస్వామిక లౌకిక శక్తులన్నీ ఏకం కావాల్సిన తక్షణ అవసరం ఉందనే అభిప్రాయం సిఎం కెసిఆర్, తేజస్వీ యాదవ్‌ల భేటీ సందర్భంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. రైతులతో పాటు ఎస్‌సి, ఎస్‌టి, బిసి మైనారిటీ వర్గాలకు వ్యతిరేకంగా పని చేస్తున్న బిజెపి పార్టీని గద్దె దించేంతవరకు పోరాడాల్సిన అవసరముందని.. అందుకు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణను త్వరలో నిర్ణయించుకోవాలని వారు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం.

ఇటీవలే ఉభయ కమ్యునిస్టు పార్టీలతో భేటీ అయిన సిఎం కెసిఆర్ బిజెపి ముక్త్ భారత్ గురించి చర్చించిన విషయం తెలిసిందే. లౌకికవాద ప్రజాస్వామిక శక్తుల ఐక్యసంఘటన దిశగా దేశ రాజకీయ పోరాటాన్ని ఉద్రుతం చేయాలనే అభిప్రాయం తేజస్వీ యాదవ్‌తో ఈ సందర్భంగా ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. భేటీ సందర్భంగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి, తేజస్వీ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌తో సిఎం కెసిఆర్ ఫోన్లో మాట్లాడారని సమాచారం. వారి ఆరోగ్య క్షేమ సమాచారాన్ని కెసిఆర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్‌జెడి తెలంగాణ ఏర్పాటుకు మద్దతిచ్చిన విషయాన్ని లాలూ గుర్తు చేసినట్టు తెలిసింది.. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు మీరు ముందుకు రావాలంటూ సిఎం కెసిఆర్‌ను ఈ సందర్భంగా లాలూ ప్రసాద్ యాదవ్ కోరినట్లుగా సమాచారం. మీరు తెలంగాణ కోసం ఎంతో పోరాడారు. త్యాగం చేశారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. నేడు దేశం గర్వించేలా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నడిపిస్తున్నారని సిఎం కెసిఆర్‌ను ఉద్దేశించి ఫోన్‌లో వ్యాఖ్యానించినట్లుగా తెలిసింది.

అన్ని మతాలను కులాలను సబ్బండ వర్గాలకు అనుకూలంగా సాగుతున్న మీ పాలనానుభవం దేశానికి అవసరముందన్నారు.. జాతీయ రాజకీయాల్లో మీరు తగిన పాత్ర పోషించాలని సూచించారు. లౌకిక ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడుకోవాలని…ఇందుకు మీరు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో బిజెపి ఆరాచక పాలన నుంచి దేశాన్ని రక్షించేందుకు లౌకిక వాద శక్తులన్నీ ఒక్కటి కావాలన్నారు. దేశాన్ని నాశనం కానివ్వద్దు అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో థర్డ్‌ఫ్రంట్‌కు మీరు నాయకత్వం వహించాలని, దీనికి వెంటనే ముందుకు రావాలని అని కెసిఆర్‌ను లాలూ ప్రసాద్ యాదవ్ కోరినట్టు సమాచారం. రాష్ట్రంలో జరుగుతున్న వ్యవసాయాభివృద్ధి కార్యాచరణ, సాగునీటి రంగం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తేజస్వీ యాదవ్ ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌ను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. దేశ సమగ్రతను కాపాడే దిశగా జాతీయ రాజకీయాలను బలోపేతం చేయాలన్నారు. దీనికోసంం సాగే బిజెపి వ్యతిరేక పోరాటంలో కలిసి సాగుదామని ఆర్‌జెడి నేతలు చెప్పినట్లు తెలిసింది.

లౌకికవాద, ప్రజాస్వామిక శక్తుల పునరేకీకరణ దిశగా మీరు చేస్తున్న ప్రయత్నాలకు… తమ పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని తేజస్వీ యాదవ్ బృందం స్పష్టం చేసినట్లు తెలిసింది. యుపి రాజకీయాలపై..ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపై ఇరు పార్టీల నేతలు చర్చించినట్లు సమాచారం. ఏకంగా కేబినెట్ మంత్రి… పదవి, పార్టీ నుంచి తప్పుకోవడంతో పాటు శాసనసభ్యులు బిజెపిని వీడడం ఆ పార్టీ పతనానికి నాందిగా ఇరువురు నేతలు విశ్లేషించినట్లు తెలిసింది. రానున్న యుపి ఎన్నికల్లో అఖిలేశ్‌యాదవ్‌కు ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్ మద్దతు ప్రకటించడం గొప్ప పరిణామమని వారు అన్నట్లు సమాచారం. ఈ భేటిలో టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె. తారక రామారావు, ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్, ఆర్‌జెడి నుంచి నుంచి తేజస్వీ యాదవ్‌తో పాటు మాజీ మంత్రి అబ్దుల్ బారి సిద్దిఖీ, మాజీ ఎంఎల్‌సి సునిల్ సింగ్, మాజీ ఎంఎల్‌ఎ భోలా యాదవ్ , తదితరులు పాల్గొన్నారు. ఆర్‌జెడి బృందం వెంట తెలుగు రాష్ట్రాల ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు శోభా యాదవ్ కూడా ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News