పేద విద్యార్థులకు ఉన్నత విద్యని అందించేందుకు ఆ దేవుడు పంపిన నాయకుడే మన జగనన్న అని మంత్రి రోజా అన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో రూ.5.41 కోట్లతో ఆధునీకరించిన ప్రాంతీయ ఆస్పత్రి ప్రారంభోత్సవంతోపాటు, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, నగరిలో మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి సోమవారం సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం నగరిలో ఏర్పాటు చేసిన జగనన్న విద్యా దీవెన పథకం నిధుల విడుదల కార్యక్రమంలో సిఎం జగన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. “నగరిలో జై జగన్ అని సౌండ్ చేస్తే చంద్రబాబు గుండెల్లో రీసౌండ్ రావాలి. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా విద్యాదీవెన లాంటి గొప్ప పథకం ఆలోచన రాలేదు. ఒకప్పుడు పెత్తందారుల ఆస్తిగా ఉన్న చదువుని.. ఇప్పుడు పేదవాళ్ల హక్కుగా జగనన్న మార్చారు. జగనన్న బటన్ నొక్కుతున్నాడని ఎగతాళి చేస్తున్న వారికి చెప్తున్నా.. అవును సీఎం బటన్ నొక్కి ఈ రాష్ట్రంలో పేదల్ని లంచం నుంచి విముక్తి చేసి డైరెక్ట్‌గా వాళ్ల అకౌంట్లో డబ్బులు పడేలా చేస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా సంక్షేమ పథకాలు వారికి ఆ బటన్ ద్వారానే అందుతున్నాయి. ఇంకా చెప్పాలంటే వెటకారం చేస్తున్న వారికి రాజకీయ భవిష్యత్ లేకుండా చేయబోయేది కూడా ఆ బటనే” అని పేర్కొన్నారు.