నిజామాబాద్ : రోడ్డు ప్రమాదం చూడడానికి బస్సులోంచి కిందికి దిగిన ప్రయాణీకుల మీదకి వెనుక నుంచి ఒక వాహనం దూసుకువచ్చిన ఘటనలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ హృదయ విదాకార ఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి జాతీయ రహదారి మీద శనివారం తెల్లవారు జామున జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతులంతా యూపికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. ఇందల్వాయి, దగ్గి గ్రామాల మధ్య 44వ నెంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ఓ వరి కోత యంత్రం రోడ్డుపై ఆగిపోగా భారీగా వాహనాలు నిలిచాయి. ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఓ లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఢీకొన్నాయి.
దీంతో బస్సులో ఉన్న వారంతా కిందికి దిగారు. జరిగిన ప్రమాదాన్ని చూస్తున్నారు. అదే సమయంలో వెనుకాల నుంచి వేగంగా వచ్చిన డిసిఎం వాహనం వారి మీదికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఘటన స్థలంలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికి మరణించారు. మృతులు ప్రదీప్, జిత్తు, దుర్గేష్, ప్రసాద్, గణేష్‌గా పోలీసులు గుర్తించారు. అయితే వీరంతా ఉత్తరప్రదేశ్‌లోని ఘోరక్‌పూర్ పట్టణానికి చెందిన వారుగా గుర్తించారు. గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో కూలీ పని చేసుకుంటు జీవనం సాగిస్తున్నారు. ప్రతియేటా మాదిరిగానే దసరా పండుగ కోసం ఘోరక్‌పూర్‌కు వెళ్తున్నారని పోలీసులు తెలిపారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.