తెలంగాణ సీఐడీ చీఫ్ గోవింద్ సింగ్ భార్య మృతి,
గాయాలతో బయటపడిన సింగ్
హైదరాబాద్ : తెలంగాణ సీఐడీ చీఫ్ గోవింద్ సింగ్ ప్రయాణీస్తున్న వాహనానికి సోమవారం నాడు రాజస్థాన్ రాష్ట్రంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గోవింద్ సింగ్ భార్యఅక్కడికక్కడే మరణించారు. డ్రైవర్, మరొకరు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో సిఐడి చీఫ్ గోవింద్ సింగ్ గాయాలతో బయటపడ్డాడు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాంఘర్‌లోని మాతా దేవాలయాన్ని సందర్శించుకొని తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జై సల్మేర్ జిల్లాలోని రామ్‌గఢ్‌టానోట్ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. తెలిసిన వివరాల ప్రకారం తెలంగాణ సిఐడి డిజిపి గోవింద్ సింగ్ తన భార్యతో కలిసి మాతేశ్వరి తనోతరాయ్ మాత ఆలయాన్ని సందర్శించడానికి వెళ్లారు.
ఈ క్రమంలో రామ్‌గఢ్ ప్రాంతంలో ఉన్న ఘంటియాలీ మాత ఆలయం సమీపంలో ఆయన కారు ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న డిజి గోవింద్ సింగ్ భార్య షీలా సింగ్ ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచారు. అయితే డిజి గోవింద్‌సింగ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జవహర్ ఆసుపత్రికి చేరి చికిత్స పొందుతున్నారు. ఇక ఘటన గురించి సమాచారం అందుకున్న బిఎస్‌ఎఫ్.. తమ అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని జవహర్ ఆసుపత్రికి తరలించారు. సోమవారం ఉదయం 9.10 గంటలకు గోవింద్‌సింగ్, ఆయన భార్య ఆలయాన్ని సందర్శించిన తర్వాత సుమారు 2.40 గంటలకు తిరుగు ప్రయాణమైన సమయంలో ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.
డిజిపి దిగ్భ్రాంతి
రాజస్థాన్ లోని రామ్‌గఢ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సిఐడి విభాగం డీజిపి గోవింద్ సింగ్ సతీమణి మరణించడం పట్ల డిజిపి ఎం మహేందర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లోని తనోత్ మాత దర్శనానికి తన సతీమణితో కలసి వెళ్లిన గోవింద్ సింగ్ రాంగఢ్ కు తిరుగుప్రయానంలో వస్తుండగా జరిగిన ప్రమాదంలో తమ మహీంద్రా వాహనo బోల్తా పడడంతో ఆయన సతీమణి మరణించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ.గోవింద్ సింగ్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా, ఈ ప్రమాదంలో గోవింద్ సింగ్ సతీమణి మరణించడం పట్ల డీజీపీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గాయపడి చికిత్స పొందుతున్న తమ సహచర సీనియర్ అధికారి గోవింద్ సింగ్ త్వరితగతిన కోలుకోవాలని డిజిపి ఆకాంక్షించారు.