ప్రమాదానికి కారణాలపై పోలీస్‌ల దర్యాప్తు
లండన్ : స్కాట్లాండ్‌లో కేసిల్ స్టాల్కర్ సమీపాన గత శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్ధులు మృతి చెందగా, మరో భారతీయ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు చేపట్టిన స్కాట్లాండ్ పోలీసులు తమకు ఎవరైనా సమాచారం అందించాలనుకుంటే 101 ద్వారా అధికారులను సంప్రదించవచ్చని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఇదే విధంగా 1976 శుక్రవారం జరిగిన ప్రమాదాన్ని ఉదహరించారు. హైదరాబాద్‌కు చెందిన పవన్ బషెట్టి, బెంగళూరుకు చెందిన గిరీష్ సుబ్రహ్మణ్యం వీరిద్దరూ 23 ఏళ్ల వారే. ఇద్దరూ యూనివర్శిటీ ఆఫ్ లీసెస్టర్ లో ఎయిరోనాటికల్ ఇంజినీరింగ్ మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నారు. వీరి స్నేహితుడు, యూనివర్శిటీ మాజీ విద్యార్థి, నెల్లూరుకు చెందిన 30 ఏళ్ల సుధాకర్ మోడేపల్లితోపాటు హైదరాబాద్‌కు చెందిన 24 ఏళ్ల సాయివర్మ ఈ నల్గురూ గత శుక్రవారం కేసిల్ స్టాల్కర్ వద్ద ఎ 828 జాతీయ రహదారిపై కారు ( సిల్వర్ హోండా సివిక్) లో వెళ్తుండగా సరకులతో వస్తున్న భారీ వాహనం (హెచ్‌జివిఢీ కొనడంతో వీరిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
వీరితోపాటు కారులో ఉన్న హైదరాబాద్‌కు చెందిన 24 ఏళ్ల సాయి వర్మ తీవ్ర గాయాల పాలై గ్లాస్గోలోని క్వీన్ ఎలిజెబెత్ యూనివర్శిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వర్మ కూడా లీసెస్టర్ యూనివర్శిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్ డిగ్రీ చేస్తున్నాడు. ఈ ప్రమాదానికి సంబంధించి 47 ఏళ్ల వ్యక్తిని స్కాట్లాండ్ పోలీసులు అరెస్టు చేసి తరువాత తదుపరి దర్యాప్తు కోసం విడుదల చేశారు. హాలిడే పురస్కరించుకుని ఈ విద్యార్థులు నలుగురూ కారులో వెళ్తుండగా స్కాటిష్ హైలాండ్స్ లోని ఆర్గిల్ అప్పిన్ ఏరియాలో ఈ ప్రమాదం జరిగింది. స్కాట్లాండ్ లోని భారతీయ సమాజం, బ్రిటన్ లోని ఇండియన్ నేషనల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐఎన్‌ఎస్‌ఎ) మృతుల కుటుంబాలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. స్కాట్లాండ్ లోని ఇండియన్ కాన్సులేట్ మృతదేహాలకు పోస్టుమార్టమ్ జరిపించి ఆ మృతదేహాలను భారత్‌కు పంపడానికి ప్రయత్నిస్తోంది.