లక్నో: ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో శుక్రవారం రాత్రి బొలెరో వాహనం వేగంగా వస్తున్న బస్సును ఢీకొట్టడంతో బొలెరో లోని భక్తుల్లో పది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 19 మంది గాయపడ్డారు. మృతుల్లో ఈశ్వరీ ప్రసాద్ జైస్వాల్, సంతోష్ సోని, భాగీరథి జైస్వాల్, సోమనాథ్, అజయ్ బంజరే, సౌరభ్ కుమార్ సోని,గంగా దాస్ వర్మ, శివరాజ్‌పుత్, దీపక్‌వర్మ, రాజుసాహు ఉన్నారు. వీరంతా ఛత్తీస్‌గఢ్ కోర్బా జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. ప్రయాగ్‌రాజ్ నుంచి మీర్జాపూర్ వెళ్లే హైవేపై ఈ ప్రమాదం జరిగింది.
పోలీస్‌లు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.భక్తులు మధ్యప్రదేశ్ లోని రాజ్‌గడ్ జిల్లాకు చెందిన వారు . వారణాసి వెళ్లడానికి సిద్ధమయ్యారు. గాయపడిన వారిని రామ్‌నగర్‌లో ని పీహెచ్‌సిలో చేర్చారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించి మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. గాయపడిన వారికి తక్షణ వైద్యం అందించాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు.