భారత దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా గల వాహనాల్లో ఒక్క శాతం మాత్రమే ఉన్న మన దేశంలో ఏటా ప్రమాదాలలో కన్నుమూస్తున్న వారి సంఖ్య మాత్రం లక్షల్లో ఉండటం ఆందోళన కలిగించే పరిణామం. తాజాగా యువ ఎంఎల్‌ఎ లాస్య నందిత దుర్మరణం.. రోడ్డు ప్రమాదాలకు ముకుతాడు వేయవలసిన తక్షణావసరాన్ని నొక్కి చెబుతోంది. అవుటర్ రింగ్ రోడ్డుపై అతి వేగంగా వెళ్తున్న ఎంఎల్‌ఎ కారు అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీ కొనడానికి అతివేగమే కారణమని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. ప్రమాద సమయంలో ఎంఎల్‌ఎ కారు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు పోలీసుల కథనం. విద్యాధికురాలైన లాస్య నందిత.. తండ్రి అడుగుజాడల్లో ప్రజాసేవ చేయాలని రాజకీయాలను ఎంచుకుని పిన్న వయసులోనే కన్నుమూయడం విషాదకరం. కొన్ని రోజుల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో తృటిలో తప్పించుకున్న ఆమె.. ఈసారి మాత్రం మృత్యువు బారి నుంచి తప్పించుకోలేకపోయారు.
ఎంఎల్‌ఎ దుర్మరణం పాలైన రోజే శ్రీశైలం ఘాట్ రోడ్డుపై జరిగిన మరొక ప్రమాదంలో 24 మంది క్షతగాత్రులైన సంఘటన తెలుగునాట రోడ్డు ప్రమాదాలు పెచ్చుమీరుతున్నాయనడానికి ఉదాహరణ. ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్నవారి సంఖ్య మన దేశంలోనే అధికమని తాజా గణాంకాలు కళ్ళకు కడుతున్నాయి. భారత దేశంలో గంటకు 53 ప్రమాదాలు జరుగుతుండగా, 19 మంది మరణిస్తున్నారని అంచనా. మన దేశంలో 2022లో 4,61,312 రోడ్డు ప్రమాదాలు జరిగితే, 1,68,491 మంది అసువులు బాశారు. అంతకు ముందు ఏడాది నమోదైన మరణాలతో పోలిస్తే ఈ సంఖ్య 9.4 శాతం పెరిగినట్లు భారత రవాణా శాఖ పేర్కొంది. ఇలా మృత్యువాత పడుతున్న ప్రతి పదిమందిలో ఏడుగురు అతి వేగం కారణంగానే చనిపోతున్నారు. నైపుణ్యం లోపించిన డ్రైవర్లు, సాఫీగా లేని రోడ్లు, నిర్వహణ అంతంత మాత్రంగానే ఉన్న వాహనాలు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
దూరప్రాంతాలకు వెళ్లే వాహనాలు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకోకుండా సాఫీగా ముందుకు సాగిపోయేందుకు నిర్మించిన అవుటర్ రింగ్ రోడ్డు పై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉండటం కలవరం కలిగిస్తోంది. నాలుగు రోజుల క్రితం ఒఆర్‌ఆర్‌పై అతివేగంగా వెళ్తున్న ఓ కారు నార్సింగి వద్ద అదుపు తప్పి పైనుంచి కిందకు పడిపోయింది. గత ఏడాది ఒఆర్‌ఆర్ పై 216 ప్రమాదాలు జరిగితే, 81 మంది మృత్యువాతపడ్డారు. పోలీసులు రహదారి వెంబడి స్పీడ్ గన్లను అమర్చినా గంటకు 120 కిలోమీటర్ల వేగాన్ని మించకూడదంటూ సైన్ బోర్డులు ఉన్నా, విశాలంగా, పలు వరుసల్లో ఉండే ఒఆర్‌ఆర్‌పై వాహనాల వేగం మితిమీరుతోంది. రద్దీతో కిటకిటలాడే నగరాలు, పట్టణాల్లో కంటే ప్రధాన జాతీయ రహదారులపైనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వాహనాలను నడిపే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించకపోవడం కొన్ని సందర్భాల్లో పెను ప్రమాదాలకు దారి తీస్తోంది. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం, కార్లు, ఇతర వాహనాల్లో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వంటివి అనర్థాలకు దారితీస్తున్నాయి.
హెల్మెట్ ధరించకపోవడం వల్ల 2022లో 50 వేలమంది ద్విచక్ర వాహనదారులు దుర్మరణం పాలైనట్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది. వేగం, మద్యపానం, హెల్మెట్ ధరించటం, సీట్ బెల్టు పెట్టుకోవడం, మైనర్లను వాహనాలకు దూరంగా ఉంచడం- ఈ ఐదు అంశాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని ప్రామాణికతలను నిర్దేశించింది. కానీ వీటికి అనుగుణంగా చట్టాల రూపకల్పన చేసిన దేశాలు ఆరు మాత్రమే. చట్టాల పట్ల ప్రజలలో భయభక్తులు లోపించడం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమని ఒక సందర్భంలో విస్పష్టంగా చెప్పిన కేంద్ర రోడ్డు రవాణా మంత్రి గడ్కరీ, ప్రజల ఆలోచనా విధానం మారితేగానీ ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టదని కుండబద్దలు కొట్టారు. ఏటా రోడ్డు భద్రతా వారోత్సవాలు ఘనంగా జరుపుతున్నా, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు ఎప్పటికప్పుడు జరిమానాలు విధిస్తున్నా ప్రమాదాల సంఖ్య తగ్గకపోవడానికి మంత్రివర్యులు చెప్పినట్లు చట్టాలపై వాహనదారులకు ఉన్న చిన్నచూపే కారణం. ఈ దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సరిపోవనడానికి రోజురోజుకీ మితిమీరుతున్న ప్రమాదాలే సాక్ష్యం. చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, వాటిని తు.చ తప్పకుండా ఆచరింపజేసేందుకు తగిన కార్యాచరణ రూపొందించడం ప్రభుత్వాల తక్షణ కర్తవ్యం.