Friday, December 20, 2024

తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో గురువారం ఉదయం సంభవించిన వేర్వేరు ఘోర రోడ్డు ప్రమాద సంఘటనలలో మొత్తంగా తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే… ఖమ్మం జిల్లాలో గురువారం ఉదయం మూడు చోట్ల ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ మూడు ఘటనల్లో మొత్తం ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో పాటు మరో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు పాలవ్వగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గురువారం ఉదయం ఖమ్మం జిల్లాలోని కొనిజర్ల మండల కేంద్రం సమీపంలోని పెట్రోల్ బంక్ ఎదురుగా లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు.

తీవ్రగాయాలపాలైన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని తీవ్రంగా గాయపడిని వ్యక్తిని అంబులెన్స్ ద్వారా ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. మృతులు వైరా మండలం విప్పలమడక గ్రామానికి చెందిన పారుపల్లి రాజేశ్, సుజాత దంపతులు, కుమారుడు అశ్విత్ గా గుర్తించారు. హైదరాబాద్ లో ప్రైవేట్ ఫార్మసీ కంపెనీలో రాజేశ్ ఉద్యోగం చేస్తుండగా, హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కల్లూపు మండలం రంగంబంజరలో ఓ ఆటో లారీని ఢీకొట్టింది.

సాయితేజ అనే యువకుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మరో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. మరో రోడ్డు ప్రమాదంలో రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటన పెనుబల్లి మండలం విఎం బంజారాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్‌లో ఇరుక్కుని ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే తుదిశ్వాస విడిచారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతుల వివరాలు సేకరించే పనిలో పడ్డారు. అదే విధంగా, తిరుపతి జిల్లాలో కూడా గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ కారు ఆర్టీసి బస్సును ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృత్యువాత పడగా, మరో ఇరువురి పరిస్థితి విషమంగా ఉంది.

తిరుపతి -శ్రీకాళహస్తి ప్రధాన రహదారిలో ఏర్పేడు మండలం మేర్లపాక చెరువు వద్ద ఈ ప్రమాదం సంభవించింది. మృతుల్లో భార్యాభర్తతో పాటు చిన్నారి పాప కూడా ఉంది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. ఏర్పేడు సీఐ శ్రీహరి సిబ్బందితో సహా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడు తున్నారు. మృతులతో పాటు క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అయితే మృతులు తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లెకు చెందిన కుటుంబంగా పోలీసులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News