హైదరాబాద్: సుచిత్ర నుండి మేడ్చల్ వరకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు జాతీయ రహదారుల సంస్థ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా శాసన సభలో శుక్రవారం నాడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీలు శంబీపూర్ రాజు, నవీన్ కుమార్ లతో కలిసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా సుచిత్ర జంక్షన్ నుండి మేడ్చల్ వరకు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 10 కి.మీ పొడవునా సర్వీస్ రోడ్లు, నాలుగు అండర్ పాస్ లు, జంక్షన్ ల విస్తరణలకు రూ.492 కోట్లతో త్వరలోనే పనులు ప్రారంభంకానున్నాయి. సుచిత్ర, జీడిమెట్ల, దూలపల్లి, కొంపల్లి జంక్షన్ ల అభివృద్ధి, 3 ఫ్లై ఓవర్ల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. గుండ్లపోచం పల్లి నుండి కళ్లకల్ వరకు 17కి.మీ రూ 800 కోట్లతో సర్వీస్ రోడ్లు, జంక్షన్ ల విస్తరణ, మేడ్చల్ టౌన్ లో ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు చేపట్టనున్నారు. సిఎం కెసిఆర్ కృషితో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలతో పాటు మేడ్చల్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగనున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన జాతీయ రహదారుల సంస్థకి రాష్ట్ర ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
- Advertisement -