వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం మామునూరు వద్ద భారత్ పెట్రోల్ పంప్ సమీపం రైలు పట్టాల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రైలు పట్టాలు ఆటోపై పడ్డాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని రైలు పట్టాల కింద ఇరుక్కున్న నలుగురు వ్యక్తులు బయటకు తీసి చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. లారీ ఖమ్మం నుంచి వరంగల్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డుపై పడ్డ రైలు పట్టాలను జేసీబీ సాయంతో తప్పించారు.ఈ ప్రమాదంతో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై రోడ్డుకిరువైపులా కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.