న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల నిర్వహణపై తన రోడ్‌మ్యాప్‌ను లా కమిషన్ వచ్చేవారం ఇందుకోసం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీతో పంచుకొంటుంది. దేశంలో జమిలి ఎన్నికలు ఎలా నిర్వహించాలనే దానిపై తన అభిప్రాయాలను తెలియజేయడం కోసం కోవింద్ కమిటీ ఈ నెల 25న లా కమిషన్‌ను ఆహ్వానించింది. కాగా ఇటీవల జరిగిన కమిటీ తొలి సమావేశంలో జమిలి ఎన్నికలపై రాజకీయ పార్టీల వైఖరులను తెలుసుకోవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు జమిలి ఎన్నికలపై తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతూ కమిటీ రాజకీయ పార్టీలకు లేఖలు రాసింది.
రాజకీయ పార్టీలకు రాసిన లేఖలో కమిటీ పరస్పరం అంగీకరించిన తేదీల్లో వారితో సమావేశం అవుతామని పేర్కొంది. సమావేశం కావడానికి వీలు కాని పక్షంలో రాబోయే మూడు నెలల్లో లిఖితపూర్వకంగా తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు కూడా అవకాశం ఇచ్చింది. 2029 నుంచి లోక్‌సభతో పాటుగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా ఆయా అసెంబ్లీల గడువును కుదించడం లేదా పొడిగించడం ద్వారా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం కోసం జస్టిస్ రితురాజ్ అవస్థి నేతృతవంలోని లా కమిషన్ ఒక ఫార్ములాను రూపొందించే పనిలో ఉంది. ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించగలిగితే ఈ రెండు ఎన్నికల కోసం ఓటర్లు రెండు సార్లు పోలింగ్ బూత్‌లకు వెళ్లే పని ఉండదు.