Monday, December 23, 2024

వర్షం మిగిల్చిన కష్టాలు..

- Advertisement -
- Advertisement -

రాయికల్‌ః వర్షం మిగిల్చిన కష్టాలతో ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వరద తాకిడికి చాలా గ్రామాల్లో రోడ్లు తెగిపొయాయి. కల్వర్టులు ధ్వంసమై రాకపోకలు నిలిచిపోయాయి. రాయికల్ పట్టణంతో పాటు పలు గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఇండ్లలోకి నీళ్లు చేరి పలు కాలనీల్లో ప్రజలు ఇండ్లను విడిచిపెట్టే పరిస్థితి నెలకొంది. నిరాశ్రయులైన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారయంత్రాంగం స్థానిక యువత, దాతల సమకరంతో ఆకలి తీర్చారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షం వల్ల రాయికల్ మండల వ్యాప్తంగా ప్రజలు అతలాకుతలం అయ్యారు. చెరువులు, కుంటలు నిండుకండలా తయారైయ్యాయి.

రాయికల్ పెద్ద చెరువులోకి వరద నీరు చేరి కేశవనగర్, భీమన్నవాడ, మేదరివాడలను జలదిగ్బంధం చేయగా స్థానికులు, అధికారుల సహకారంతో అక్కడి ప్రజలను స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చేరి ఆశ్రయం కల్పించారు. తహసీల్దార్ మహ్మద్ అబ్దుల్ ఖయ్యుం, ఎంపిడిఓ గంగుల సంతోష్‌కుమార్, ఎస్‌ఐ అజయ్, పలువురు ప్రజాప్రతినిధులు సకాలంలో స్పందించి నిరాశ్రయులైన ప్రజలకు సాయం అందించారు. చాలా గ్రామాల్లో విద్యుత్ స్థంబాలు విరిగిపడ్డాయి. ట్రాన్స్‌ఫార్మర్లు వాగులు, ఒర్రెల్లో కొట్టుకుపోగా అధికారులు యుద్దప్రాతిపాదికన చర్యలు చేపట్టారు. కొన్ని చోట్ల కరంటు కోతతో ప్రజలు తిప్పలు పడ్డారు. పలు గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన ఇండ్లు కూలిపోగా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. పంట పోలాల్లో ఇసుక చేరి రైతుల కష్టం నీటి పాలైంది.
తెగిన రోడ్లు…
రాయికల్, ఇటిక్యాల, రామాజీపేట, వీరాపూర్, భూపతిపూర్, మూటపెల్లి, కొత్తపేట, కుమ్మరిపెల్లి, మైతాపూర్ గ్రామాలకు వెళ్లే బిటి రోడ్లు వాగులు, కల్వర్టుల వద్ద తెగిపోయాయి. చాలా గ్రామాల్లో రోడ్లు ధ్వంసమై రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామాలకు ఆర్టీసి బస్సులు నడవడంలేదు. జగిత్యాల, రాయికల్ మీదుగా ఇటిక్యాల, నిర్మల్ వెళ్లే రహదారి ధ్వంసం కాగ స్థానిక ఎస్‌ఐ అజయ్ మరమ్మత్తులు చేయించి రాకపోకలు సాగేలా తాత్కాలిక ఏర్పాట్లు చేయించారు. రాయికల్, రామాజీపేట గ్రామాల మధ్య నిర్మిస్తున్న వంతెన వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక కల్వర్టు వరద నీటికి కొట్టుకుపోయింది.

మైతాపూర్, రాయికల్ వంతెన వద్ద నిర్మించిన కల్వర్టు తెగిపోయి రాకపోకలు స్థంభించాయి. ఇటిక్యాల, రేగుంట బ్రిడ్జిపై నుండి వరదనీరు ప్రవహించడంతో అక్కడ ఉన్న ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్ స్థంభాలు వాగులో పడి కొట్టుకుపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. 24 సెంటిమీటర్ల వర్షం పడ్డట్లు అధికారులు చెప్పుతుండగా ఈ వర్షం వల్ల చాలా గ్రామాల్లో ప్రజలు పడరాని పాట్లు పడ్డారు.
నిరాశ్రయులను ఆదుకున్న యువత
రాయికల్ పట్టణంలోని పలు కాలనీలు జలదిగ్బంధనంలో ఉండగా అధికారులు, స్థానిక యువకులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మా ఊరి ముచ్చట్లు వాట్సాప్ గ్రూప్ యువకులు స్థానిక ఆర్యవైశ్య యువజన సంఘం సహకరంతో ప్రజలకు భోజన వసతి ఏర్పాటు చేసారు. రెండు రోజులుగా రాయికల్ జామియితే ఉల్మాహింద్ సభ్యులు ముంపు బాధితులకు భోజనాలు అందించి తమ ఉదారతను చాటుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News