మూడు రోజుల్లోగా కొత్త రోడ్లకు ప్రతిపాదనలు పంపించాలి
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో పదోన్నతులు పూర్తి చేయాలి
ఇటీవల పదోన్నతులు పొందిన డిపిఓలు, ఎంపీడీఓలకు ఖాళీలను బట్టి వెంటనే పోస్టింగులివ్వాలి
కారోబార్ లు, పంపు మెకానిక్ ల సమస్యలను సాధ్యమైనంత తొందరగా పరిష్కరించాలి
ఉన్నతాధికారులను ఆదేశించిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
హైదరాబాద్ సెప్టెంబర్ 8: ఇటీవలి భారీ వర్షాలకు దెబ్బతిన్న పంచాయతీరాజ్ శాఖ రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని, రానున్న మూడు రోజుల్లోగా కొత్త రోడ్డకు ప్రతిపాదనలు పంపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖలోని పలు అంశాల మీద మంత్రి, హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలోని తన క్యాంపు కార్యాలయంలో సంబంధిత ఉన్నతాధికారులతో బుధవారం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలోని పదోన్నతులు, పోస్టింగులు, ఇటీవల పదోన్నతులు పొందిన డిపిఓలు, ఎంపిడీఓలకు పోస్టింగులు, కారోబార్ లు, పంపు మెకానిక్ ల సమస్యలు వంటి పలు అంశాలపై మంత్రి సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగానే దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే మంజూరైన పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు. అలాగే కొత్త రోడ్ల కోసం ప్రతిపాదనలను మూడు రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా ప్రజాప్రతినిధులతో మాట్లాడి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. పంచాయతీరాజ్ శాఖలో ఇప్పటికే చేపట్టిన పదోన్నతులు పొందిన 57మంది డిపిఓలు, ఎంపిడిఓలకు ఖాళీలను బట్టి పోస్టింగులు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే ఇంజనీరింగ్ విభాగంలోని ఇంజనీర్లకు పదోన్నతులు కల్పించాలని, ఇందుకు సంబంధించిన నివేదికలు సిద్ధం చేయాలని మంత్రి చెప్పారు. కారోబార్ లు, పంపు మెకానిక్ లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిశీలించి, నిబంధనలకు లోబడి వెంటనే వాటిని పరిష్కరించాలని మంత్రి అధికారులకు చెప్పారు. మిగిలి ఉన్న అతి కొద్ది వైకుంఠ ధామాలు, డింపింగ్ యార్డులను సాధ్యమైనంత తొందరలో పూర్తయ్యే విధంగా చూడాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రితోపాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్ సంజీవ రావు తదితరులు పాల్గొన్నారు.