లక్నో : ఉత్తరప్రదేశ్ లోని రోడ్లను 2024 నాటికి అమెరికాకు దీటుగా తీర్చిదిద్దుతామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. లఖ్‌నవూలో జరిగిన ఇండియన్ రోడ్డు కాంగ్రెస్ 81 వ సదస్సులో రోడ్ల నిర్మాణంపై ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌కు రూ.8000 కోట్ల విలువ చేసే రోడ్డు ప్రాజెక్టులను ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ రహదారులను అగ్రరాజ్యానికి దీటుగా తీర్చి దిద్దేందుకు ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం త్వరలోనే రూ. 5 లక్షల కోట్లు మంజూరు చేయనున్నట్టు తెలిపారు.
రహదారుల నిర్మాణానికి నిధుల కొరత లేదన్నారు. షాహబాద్ హర్దోర్ బైపాస్, షాజహాన్‌పూర్ టు షాహబాద్ బైపాస్, మోరాబాద్‌థాకుర్వారా కషిపుర్ బైపాస్, ఘాజిపూర్‌బలియా బైపాస్‌లతో పాటు 13 ఆర్‌వోబీలు, మొత్తం రూ.8 వేల కోట్ల ప్రాజెక్టులు ఆమోదం పొందాయి. సాంకేతికత, పర్యావరణ పరిరక్షణ, వినూత్నత, భద్రత, నాణ్యత , వంటి అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని రహదారుల అభివృద్ధి జరగాలని గద్కరీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పెట్రోల్, డీజిల్‌తో కాకుండా సీఎన్‌జీ, ఇథనాల్, మిథనాల్‌తో నడిచే వాహనాలను ఉపయోగించాలని పిలుపునిచ్చారు. విద్యుత్ వాహనాలను వినియోగించాలన్నారు. ఫలితంగా రవాణా వ్యయాలు తగ్గుతాయన్నారు. మరోవైపు లక్నో లోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.