Saturday, November 23, 2024

రోడ్లు దిగ్బంధించరాదు: సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

Roads should not be blocked: Supreme Court

న్యూఢిల్లీ: ప్రజా రవాణా రోడ్లను దిగ్బంధించరాదని సుప్రీంకోర్టు గురువారం రైతులకు ఖరాఖండిగా చెప్పింది. రోడ్ల దిగ్బంధనంను తొలగించాల్సిందిగా కొందరు పౌరులు దాఖలు చేసుకున్న అభ్యర్థనలను స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ అంశంపై నోటీసు జారీచేసింది. సుప్రీంకోర్టు గురువారం ఈ అంశంపై విచారణ చేపట్టినప్పుడు రైతుల తరఫున, ప్రభుత్వం తరఫున ఒకరిని మరొకరు నిందించుకున్నారు. రైతుల తరఫున సీనియర్ అడ్వొకేట్ దుష్యంత్ దావే, అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ కావాలనే ప్రభుత్వం రైతులను రోడ్లపై కూర్చునేలా చేస్తుందని, వారికి రామ్‌లీలా మైదాన్‌లో, జంతర్‌మంతర్‌లో ప్రవేశించడానికి అనుమతి ఇవ్వాలని, కొత్తగా తెచ్చిన సేద్యపు చట్టాలకు వ్యతిరేకంగా వారు నిరసన తెలుపుకునే అవకాశాన్ని ఇవ్వాలని వాదించారు. కాగా దీని వ్యతిరేకించిన హర్యానా తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ సందర్భంగా జనవరిలో ఎర్రకోట వద్ద జరిగిన హింసాత్మక ఘటనను ప్రస్తావించారు.

న్యాయమూర్తి ఎస్‌కె కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం “ఉద్యమంతో సమస్య ఉంది. సమస్య లేదనే విషయాన్ని మేము అంగీకరించబోము” అని అభిప్రాయపడింది. రైతులు, ప్రభుత్వం మధ్య రెండేళ్లుగా కొనసాగుతున్న ఈ ప్రతిష్టంబనకు ఓ పరిష్కారం కనుగొనాల్సి ఉందని పేర్కొంది. కాగా నిరసన తెలుపుకోవడం అన్నది ప్రాథమిక హక్కు అని దావే తెలిపారు. రోడ్లను దిగ్బంధిస్తున్నది పోలీసులే అని పేర్కొన్నారు. జంతర్‌మంతర్ వద్ద రైతులు నిరసన తెలుపుకోవడానికి అనుమతినివ్వడమే సరైన పరిష్కారం అని ఆయన ఈ సందర్భంగా కోర్టుకు విన్నవించారు. వాదనలో ఒకానొక సందర్భంలో ‘సేద్యపు చట్టాలు రైతుల కోసం కాదు, అవి వేరే ఉద్దేశ్యంతో తెచ్చినవి’ అని పేర్కొన్నారు. ఆయన తన వాదనతో తుషార్ మెహతాను తుర్పారబట్టారు. ఇతర ప్రైవేట్ వ్యక్తులు రోడ్ల దిగ్బంధనంపై దాఖలుచేసిన పిటిషన్లపై కోర్టు నోటీసులు జారీచేసింది. కాగా తదుపరి విచారణను డిసెంబర్ 7కు ధర్మాసనం వాయిదావేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News