ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో చోరీ కలకలం రేపుతుంది. రాత్రి 10.30 గంటల సమయంలో దుండగుడు అమ్మవారి ఆలయంలో ప్రవేశించి హుండీలను పగలగొట్టి చోరీలకు పాల్పడ్డాడు. అనంతరం అక్కడే ఉన్న ప్రధాన హుండీని తెరవడానికి శతవిధాల ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. చోరీ చేస్తున్న దృశ్యాలు అన్ని సిసి కెమెరాలో రికార్డు అయింది. అంతకు ముందు దొంగ హోంగార్డుల కళ్లు కప్పి లడ్డు పులిహోర టికెట్ కౌంటర్‌ను పగలగొట్టి కౌంటర్‌లోని నగదు దోచుకున్నాడు. అనంతరం తాపీగా గోశాల నుండి ఇనుప కంచెను తొలగించి గోపురంపై నుండి ఆలయంలోకి 10.30 ప్రాంతంలో ప్రవేశించాడు.
అమ్మవారి ఆలయంలోని ఉపఆలయం దత్తాత్రేయ ఆలయం ముందర హుండీని పగలగొట్టి నగదును దోచుకెళ్లినట్టు తెలుస్తోంది. అనంతరం మహాంకాళి ఆలయం ముందర ఉన్న కౌంటర్‌ను తెరిచి వస్తువులను చిందవందర చేశాడు. ఆగంతకుడు సుమారు ఆలయంలో గంటకు పైగా భద్రతా సిబ్బంది కళ్లు కప్పి చోరీ చేస్తున్నా పసిగట్టలేకపోవడంపై తీవ్ర అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. పోలీసులు ఫింగర్ ప్రింట్, డాగ్‌స్కాడ్‌తో క్షుణ్ణంగా పరిశీలించారు. అమ్మవారి ఆలయంలో చోరీ జరిగిన ఆలయాన్ని బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్,ముథోల్ సీఐ మల్లేష్, ఆలయ ఈవో విజయరామారావు పరిశీలించారు.